‘నేనొక క్రమశిక్షణ కలిగిన మోడల్‌ను. అయినా.. నా ఆరోగ్యం కాపాడుకోవడంలో మాత్రం భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చిందని’ ప్రముఖ నటి, రచయిత లిసా రె చెప్పుకొచ్చారు. 37 ఏండ్లు ఉన్నప్పుడు బ్లడ్ క్యాన్సర్ బారినపడిందామె. ఐదేండ్లకు మించి బతకవని డాక్టర్లు చెప్పారట. ‘ఆ సమయంలో నాలో ఉన్న ఆత్మవిశ్వాసమే నన్ను బలంగా నిలిపింది. క్యాన్సర్‌ను జయించి ప్రస్తుతం 53 ఏళ్ల వయసులోనూ సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతున్నాను’ అని చెప్పుకొచ్చింది లిసా.
మన ఆరోగ్యానికి మనమే సీఈవోలమని, బాధ్యత తీసుకొని మరీ ఆరోగ్యానికి సరైన ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె సూచించారు. ఎన్ని విజయాలు వచ్చినా ఆరోగ్య సమస్యను పరిష్కరించదంటారు ఆమె. ‘రోగం అనేది దాచుకోవాల్సిన విషయం కాదు. నా శరీరం ఆ వ్యాధిని అంగీకరించడం వల్ల నేను నిజమైన విముక్తిని పొందాను. మనం పరిసరాలను శుభ్రం చేస్తాం, కార్లను కడుగుతాం. కానీ మనలోని నెగటివ్ ఆలోచనలను మాత్రం శుభ్రం చేయలేకపోతున్నాం. మనసులో ఉన్న మాలిన్యాల ప్రక్షాళనకు ధ్యానమే మార్గమ’ని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.