భరతనాట్యం నేర్చుకోవాలనే ఆశతో గజ్జె కట్టారామె. ఘనంగా అరంగేట్రం చేశారు. అయినా తనివి తీరలేదు. గురుకులానికి వెళ్లి కఠోర సాధన చేశారు. దేశవిదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. గణిత శాస్త్ర ప్రయోగాలతో భరతనాట్యంలో గుర్తింపు పొందారు. భరతనాట్యమే జీవితం అనుకున్న రాజేశ్వరీ సాయినాథ్
చదువుల్లోనూ రాణించారు. అనేక డిగ్రీలు సాధించారు. గణిత శాస్ర్తాన్ని శోధించి, భరతనాట్యానికి అన్వయించిన ఆమె కృషికి సంగీత నాటక అకాడమీ అవార్డ్ వరించిన సందర్భంగా జిందగీ పాఠకులతో చదువు, నాట్యమే జీవితంగా సాగిన జ్ఞాపకాలను పంచుకున్నారిలా..
మా పూర్వికులు తమిళులు. మా నాన్న రైల్వే ఆఫీసర్. ముంబై నుంచి సికింద్రాబాద్‌కు బదిలీ అయితే ఇక్కడికి వచ్చారు. నేను సికింద్రాబాద్‌లో పుట్టాను. ఇక్కడే పెరిగాను. మా ఆయన సాయినాథ్ పక్కా హైదరాబాదీ. తను పేరున్న క్రికెటర్. రంజీ క్రీడాకారుడు. ఆ రోజుల్లో కపిల్ దేవ్ తర్వాత ఫాస్ట్ బౌలర్‌గా పేరు తెచ్చుకున్నారు. మాకు తమిళ మూలాలున్నా నేను తెలంగాణ బిడ్డనే.
మా నాన్న నామ సంకీర్తనలు చాలా చక్కగా పాడతారు. ప్రతీ శనివారం భజన మండలి నిర్వహించే భజనల్లో పాడేవారు. అవి వినడం వల్ల సంగీతం, నాట్యం, సంస్కృతి పట్ల ఇష్టం పెరిగింది. నా ఇష్టాన్ని గుర్తించి మా అమ్మ నాకు భరత నాట్యం నేర్పించింది. నగరంలోని చిన్న చిన్న ఇన్స్టిట్యూట్లలో అయిదేళ్లపాటు భరతనాట్యం నేర్చుకున్నాను. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి వేదికపై యాభై అయిదేళ్ల క్రితం అరంగేట్రం జరిగింది. అప్పటికి నాకు పదిహేనేళ్లు.
దేవదాసీ కుటుంబం నుంచి వచ్చిన భరతనాట్య కళాకారిణి ఇందిరా రాజన్ ఓసారి హైదరాబాద్ వచ్చారు. తన శిష్యురాళ్లతో కలిసి నట్టువాంగ ప్రదర్శన కోసం వస్తే చూడటానికి వెళ్లాను. వారిది భరతనాట్యంలో ‘పందనల్లూరు’ సంప్రదాయం. అది బాగా నచ్చింది. నేను కూడా అది నేర్చుకోవాలనుకున్నాను. ఇందిరా రాజన్ని అడిగితే.. చెన్నై వచ్చి నేర్చుకోమంది. గురుకులానికి వెళ్తానని అమ్మని అడిగితే చెన్నై పంపించింది. చదువులోనూ బాగానే ఉన్నాను. కాబట్టి ఇంట్లో ఆంక్షల్లేవు. హాలిడేస్‌లోనే గురుకులానికి వెళ్లేదాన్ని. ఒక నెల రోజులు అక్కడ వాళ్ల ఇంట్లోనే ఉండి నేర్చుకునేదాన్ని. నెల తర్వాత ఇంటికి వచ్చి మూడు, నాలుగు నెలలు కాలేజీకి హాజరయ్యేది. సెలవులు రాగానే మళ్లీ చెన్నైకి వెళ్లేదాన్ని. గురువు శ్రీనివాస్ పిైళ్లె నా సాధన చూసి ఆశ్చర్యపోయేవారు. నాలుగు నెలల విరామం తర్వాత కూడా ఎంత బాగా నృత్యం చేస్తుందని మెచ్చుకునేవారు.
గురువు దగ్గర ఉన్నప్పుడు వాళ్లింట్లో వాళ్లు ఏది ఇస్తే అది, ఎప్పుడు ఇస్తే అప్పుడే తినాలి. చెప్పినట్టుగా నడుచుకోవాలి. అర్ధరాత్రి ముఖం మీద నీళ్లు చిలకరించి లేపేవాళ్లు. సాధన మొదలుపెట్టమనేవాళ్లు. ఒకసారి రాత్రి పన్నెండున్నరకు వచ్చి ఇందిరా రాజన్ గారు నిద్రలేపారు. ‘నాకు నిద్ర రావట్లేదు. నువ్వు డ్యాన్స్ చేయి’ అన్నారు. నిద్రమత్తులో నుంచి లేచి కాళ్లకు గజ్జ కట్టుకుని తెల్లవారిందాక డ్యాన్స్ చేశాను. ఆ రోజు ఉదయమే నాకు గజ్జె పూజ ఉంది. సంగీత కళాకారులు ఇంటికి వస్తారు. వాళ్లు వాద్యాలు వాయిస్తూ పాడుతుంటే ఇంట్లోనే నాట్యం చేయాలి. అది చూసేందుకు మా గురువు గారి శిష్యులు కూడా వస్తారు. రాత్రి నిద్రపోకుండా నాట్యం చేసి, మళ్లీ పొద్దున పది గంటలకు గజ్జె పూజలో ఆగకుండా రెండు గంటలు నాట్యం చేశాను. ఈ రోజుల్లో అలాంటి సాధన గురించి వింటే ఆశ్చర్యపోతారు. ఆ రోజుల్లో సాధన అంత కఠినంగా ఉండేది. నిబద్ధతతో నేర్చుకున్నాం కాబట్టే మంచి ప్రదర్శకులుగా పేరు తెచ్చుకున్నాం.
చిన్నప్పుడు చదువే కావాలని అనుకోలేదు. గొప్ప డ్యాన్సర్ అవ్వాలనీ కోరుకోలేదు. ఇంత డ్యాన్స్ చేస్తూ కూడా చాలా డిగ్రీలు చేశాను. మృదంగ విద్వాంసులు కారేకుడి మణి సంగీతంలోని గణిత విశేషాలు చెప్పారు. నాకు చాలా ఆసక్తి అనిపించింది. ఆయన అధ్యయన స్ఫూర్తితో భరతనాట్యంలో ఉన్న గణిత విశేషాలను వెతకడం ప్రారంభించాను. ఇంకా లోతుగా అధ్యయనం చేయాలని దీనినే పరిశోధనాంశంగా ఎంచుకుని పీహెచ్డీ అడ్మిషన్ తీసుకున్నాను. భరతనాట్య ప్రదర్శనకు గణితాన్ని జోడించాను. కష్టమైన లెక్కలను అర్థం చేసుకుని గణితానికి అనుగుణంగా ప్రదర్శనలిచ్చాను. ఆ కృషి వల్ల నన్ను ఎక్కువమంది గుర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘రాజీవ్ ప్రతిభా పురస్కారం’, తమిళనాడు ప్రభుత్వం ‘కలైమామణి అవార్డ్’ ప్రదానం చేశాయి. ఇప్పుడు సంగీత నాటక అకాడమీ అవార్డ్ వరించింది.
టీనేజ్‌లో నాకు సినిమా, డ్రామా ఏవీ కనిపించలేదు. అప్పట్లో నాకు సంగీతం వినిపించేది. నేను డ్యాన్స్ చేసేది. ఈ కెరీర్లో మొదటి పదిహేనేళ్లు స్ట్రగుల్ అయ్యాను. ముప్పై అయిదేళ్ల క్రితం బ్రేక్ వచ్చింది. మంచి అవకాశాలు, ఆహ్వానాలు అందాయి. ఎన్నో దేశాలకు వెళ్లి ప్రదర్శనలు ఇచ్చాను. ప్రపంచమంతా తిరిగొచ్చాను. నేను ఇలాంటి అవకాశం కోసం భరతనాట్యం నేర్చుకోలేదు. నా ఇష్టం కొద్దీ నేర్చుకున్నాను. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో భరతనాట్య శిక్షణా కేంద్రాలు నెలకొల్పాను. మృదంగ విద్వాంసులు కారేకుడి మణితో కలిసి లండన్, మెలబోర్న్, న్యూజెర్సీకి విస్తరించాను. అన్ని దేశాల్లో నా శిష్యులు ఉన్నారు. జీవితంలో ఊహించనివెన్నో జరిగిపోయాయి. ఈ ప్రయాణం సంతృప్తిని ఇచ్చింది. మరెన్నో సాధించాలన్న బలాన్నీ అందించింది.
డ్యాన్స్ నా ఊపిరి. నా జీవితం. ఇంటర్మీడియెట్ చదివే రోజుల్లో ‘చదువు ఇష్టమా? డ్యాన్స్ ఇష్టమా?’ అని చాలామంది అడిగేవాళ్లు. నాకు రెండూ ఇష్టమని, రెండిటిలో డ్యాన్స్ ఇంకా ఇష్టమని చెప్పేదాన్ని. పెళ్లి, పిల్లల పెంపకం, భరతనాట్య శిక్షణ ఇన్ని పనులు చేస్తూనే ఎన్నో డిగ్రీలు సాధించాను. బీకామ్ పూర్తి కాగానే ఎల్ఎల్బీ చదివాను. ఎంబీఏ పూర్తి చేశాను. భరత నాట్యంలో పీహెచ్డీ చేశాను. చదువును ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదు. బాగా చదువుకున్న వాళ్లే గొప్ప డ్యాన్సర్లుగా పేరు తెచ్చుకున్నారు. చదువులో రాణించని వాళ్లు డ్యాన్స్‌లో రాణించలేరు. డ్యాన్స్‌లో రాణించని వాళ్లు చదువులోనూ రాణించలేరు. ఈ రెండిటికీ ఉండాల్సింది మనో సంకల్పం. డ్యాన్స్ శారీరకంగా బలాన్ని పెంచడమే కాదు, మనోబలాన్ని కూడా ఇస్తుంది. మనోబలం పది పనులు చేసే శక్తినిస్తుంది.
– నాగవర్ధన్ రాయల