ఇద్దరు ముద్దుగుమ్మలు తమ సౌందర్య రహస్యం ఏమిటన్నది సోషల్ మీడియా చెవిలో చెప్పారు. ఇంకేముంది, క్షణాల్లో దేశమంతా పాకిపోయింది. కొబ్బరినూనె పేరు చెబితేనే నాయనమ్మల ఖాతాలో జమకట్టేవాళ్లంతా తప్పు తెలుసుకున్నారు. దాంతోపాటే, బేబీ ఆయిల్ విలువనూ గ్రహించారు.
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఆదా శర్మ. ఈ సొట్టబుగ్గల సుందరి చర్మ సంరక్షణకు స్వచ్ఛమైన కొబ్బరినూనె ఉపయోగిస్తుందట. తల నుంచి పాదాల వరకూ మాయిశ్చరైజింగ్ కోసం కొబ్బరినూనెను వాడుతానని చెప్పింది. మొటిమలు తగ్గించుకోవడంలోనూ నారికేళ తైలం ఎంతో సహాయపడుతుందని అంటున్నది. ‘నాలా అందమైన చర్మాన్ని కోరుకునేవారు ఎప్పుడూ మేకప్‌తో నిద్రపోవద్దు. ఎంత ఆలస్యమైనా సరే.. మేకప్ తీసేసి, మాయిశ్చరైజర్ రాసుకొని నిద్రకు ఉపక్రమించండి’ అని అభిమానులకు సలహా ఇస్తున్నది.
జాతిరత్నాలు సినిమాతో కుర్రకారు గుండెల్లో చోటు సంపాదించుకున్న నటి ఫారియా అబ్దుల్లా. ఉండేది జూబ్లీహిల్స్ అయినా.. పక్కా తెలంగాణ యాసతో మాట్లాడుతూ ఆకట్టుకుంది ‘చిట్టి’. చర్మ సంరక్షణకు, ఒంటిని తేమగా ఉంచుకొనేందుకు బేబీ ఆయిల్‌నే ఉపయోగిస్తుందట ఫారియా. ‘ఆరోగ్యానికి శాకాహారమే ఉత్తమం’ అన్నది ఫారియా నిశ్చితాభిప్రాయం.