హలో జిందగీ. ఇటీవల వెంట్రుకల పెరుగుదలకు బయోటిన్ డ్రింకులు తాగితే మంచిదని రకరకాల మాధ్యమాల ద్వారా వింటున్నాం. అసలు బయోటిన్ డ్రింకులు అంటే ఏమిటి? ఒకే రకమా… వివిధ రకాలు ఉంటాయా? ఇవి తాగడం నిజంగానే జుట్టుకు మంచిదా?
బయోటిన్ అనేది బి విటమిన్ల సమూహం (బి కాంప్లెక్స్)లో ఒకటి. దీన్ని విటమిన్ – బి7 అని పిలుస్తారు. ఇది చర్మం, జుట్టు, నాడీ వ్యవస్థలను క్రమబద్ధం చేసి, అవి మెరుగ్గా పనిచేసేందుకు సాయపడుతుంది. గర్భధారణ సమయంలోనూ మేలుచేస్తుంది. సమతులాహారం ద్వారా దీన్ని మనం పొందవచ్చు. బయోటిన్ గుడ్డు పచ్చసొన, మాంసం, బాదం, వాల్నట్స్, పల్లీలు, సోయా, రాజ్మా, వైట్ బీన్స్లాంటి చిక్కుడు జాతి గింజలు, చిరుధాన్యాలు, పుట్టగొడుగులు, కాలీఫ్లవర్ తదితర ఆహార పదార్థాల్లో ఉంటుంది.
మునగ ఆకులు, కాడల్లో కూడా లభిస్తుంది. అయితే ఇందులో వేటినైనా సరే ఎక్కువ సమయం వండటం వల్ల అందులోని బయోటిన్ తగ్గిపోతుంది. సాధారణంగా టీనేజర్ల నుంచి పెద్దల వరకూ రోజుకు 30-100 మైక్రోగ్రాముల బయోటిన్ అవసరం అవుతుంది. గర్భిణుల్లో కాస్త ఎక్కువ కావాలి, అందుకే సప్లిమెంట్లు ఇస్తారు. ఇది నీళ్లలో కరిగే విటమిన్ కాబట్టి ఎక్కువ తీసుకున్నా, శరీరంలోంచి మూత్రం, చెమట రూపంలో బయటికి వెళ్లిపోతుంది. నిల్వ ఉండదు.
కాబట్టి మనం సమతులాహారం తీసుకుంటే సరిపోతుంది కానీ, ప్రత్యేకంగా ఈ బయోటిన్ డ్రింకుల అవసరం ఏంటన్నది అర్థం కాని విషయం. జుట్టు, చర్మ సమస్యలు ఇటీవలి కాలంలో అధికం అవుతుండటం వల్ల ఈ ప్రత్యేకమైన జ్యూస్‌లు, డ్రింకులు పుట్టుకొస్తున్నాయి. తాగితే నష్టం అని చెప్పలేం కానీ, వాటి అవసరం శరీరానికి ప్రత్యేకంగా అయితే లేదు. సమతులాహారం, చక్కటి నిద్ర, పండ్లూ కూరలు తీసుకోవడం, జంక్‌ఫుడ్‌కి దూరంగా ఉండటంలాంటివి జుట్టును ఆరోగ్యంగా ఉంచడంతోపాటు చర్మాన్ని కాంతిమంతంగా చేస్తాయి.