నోరు తీపి చేసుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు? కొందరికైతే భోజనంలో మిఠాయి లేకపోతే తిన్నట్టే అనిపించదు. మోతాదుకు మించిన తీపి పదార్థాలు ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా చాలామంది నియంత్రించుకోలేరు. ఆ చాపల్యానికి అడ్డుకట్ట వేయడానికి ‘స్మాల్ సైజ్’ ట్రెండ్ మొదలైంది. అంటే ఏ తీపి పదార్థమైనా ఒక్క గుటుక్కి పొట్టలోకి వెళ్లేంత చిన్న పరిమాణంలో తయారుచేస్తారన్న మాట. దీనివల్ల తినే మోతాదు తగ్గుతుందని న్యూట్రిషనిస్ట్లు చెబుతున్నారు. దీంతో కేకుల నుంచి కాజాల వరకూ.. అన్నీ సన్నగా మారిపోయాయి. ఇదే సూత్రాన్ని ఇంట్లోనూ పాటిస్తున్నారు గృహిణులు. దీంతో గులాబ్జామ్ గోళీకాయంత అయిపోయింది.మైసూర్పాక్ బర్ఫీలా బక్కచిక్కింది.