Rains in This New Year | చైత్రం: ఈ నెలలో రేవతి, అశ్విని, భరణి మూడు కార్తెలు ప్రవేశిస్తున్నాయి. కార్తుల ప్రవేశ సమయంలో యోగాలు అనుకూలంగా ఉన్నాయి. గ్రహాల నాడీ సంచారం కూడా అనుకూలంగా ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో అనుకూల వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో వర్షాభావ సూచన ఉన్నాయి. మాసం ప్రథమార్ధంలో మేఘాడంబరంతో వర్షాలు, ద్వితీయార్ధంలో అక్కడక్కడ సామాన్య వర్షాలు కురుస్తాయి.
వైశాఖం: ఈ మాసంలో కృత్తిక, రోహిణి కార్తెలు ప్రవేశిస్తున్నాయి. ప్రవేశ యోగాలు, నాడీఫలాలు ప్రతికూలంగా ఉండటంతో వర్షాభావ సూచనలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. గ్రహాలు వాయునాడిలో సంచరించడంతో గాలివానలు, ఎండలు ఎక్కువగా ఉంటాయి. రోహిణి కార్తెలో అక్కడక్కడా సామాన్యంగా వర్షాలు కురుస్తాయి.
జ్యేష్ఠం: ఈ మాసంలో మృగశిర, ఆరుద్ర కార్తెలు ప్రవేశిస్తున్నాయి. కార్తెల ప్రవేశ సమయంలో వాయుదహన నాడులతో ఉండటం వల్ల వర్షాలు తక్కువగా కురుస్తాయి. గ్రహస్థితి మూలంగా చూస్తే వర్షాభావ యోగాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు, ఓ మోస్తరు వర్షాలు ఉంటాయి. ఎండలు అధికంగా ఉంటాయి.
ఆషాఢం: ఈ మాసంలో పునర్వసు, పుష్యమి కార్తెలు ప్రవేశిస్తున్నాయి. గ్రహస్థితి మూలంగా మధ్యమంగా వర్షాలు కురుస్తాయి. కొన్ని ప్రాంతాలలో పంటలకు అనుకూలమైన వర్షాలు ఉంటాయి. ఆకాశము మేఘావృతమై అక్కడక్కడా జల్లులతో కూడిన సామాన్య వర్షాలు ఉంటాయి. ద్వితీయార్ధంలో ఎండలు కాస్తాయి. మొత్తం మీద ఈ మాసంలో సామాన్య వర్షపాతం నమోదవుతుంది.
శ్రావణం: ఈ మాసంలో ఆశ్లేష, మఖ కార్తెల ప్రవేశం సమయంలో వృష్టి యోగాలతో ఉండటంతో అనుకూల వర్షాలు ఉంటాయి. నెల ప్రారంభంలో వ్యవసాయదారులకు ఉపయోగపడే వర్షాలు కురుస్తాయి. మాసాంతంలో సామాన్య వర్షాలు ఉంటాయి. అన్ని ప్రాంతాలలో అనుకూల వర్షాలతో సువృష్టి యోగం.
భాద్రపదం: ఈ మాసంలో పుబ్బ, ఉత్తర కార్తెలు ప్రవేశిస్తున్నాయి. యోగాలు సమతుల్యంగా ఉన్నాయి. నాడీ సంచారం అనుకూలంగా ఉండటంతో ఈ మాసంలో అనుకూల వర్షాలు ఉంటాయి. మాసం ప్రథమార్ధంలో సాధారణ వర్షాలు ఉంటాయి. ద్వితీయార్ధంలో పంటలకు అనుకూలమైన వర్షాలు కురుస్తాయి.
ఆశ్వయుజం: ఈ మాసంలో హస్త, చిత్త, స్వాతి కార్తెలు ఉన్నాయి. కార్తె ప్రవేశ సమయాలు అనుకూలంగా ఉండటంతో పంటలకు అనుకూలమైన వర్షాలు ఉంటాయి. అక్కడక్కడ గాలితో కూడిన వానలు, కొన్ని ప్రాంతాల్లో ఎడతెరపిలేని ముసుర్లు ఉంటాయి.
కార్తికం: ఈ మాసంలో విశాఖ, అనూరాధ కార్తెలు ప్రవేశిస్తున్నాయి. ప్రథమార్ధంలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయి. కొన్నిచోట్ల అకాల వర్షాలు కురుస్తాయి. సముద్ర తీరంలో గాలులతో కూడిన వర్షాలు.
మార్గశిరం: ఈ మాసంలో కొద్దిపాటి వర్షాలు ఉన్నాయి. తేమతో కూడిన గాలులు వీస్తాయి. మంచు కురవడం, ద్వితీయార్ధంలో చలిగాలులు ఎక్కువగా ఉంటాయి.
పుష్యం: ఈ మాసంలో కార్తెల ప్రభావము సమానంగా ఉండటంతో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రథమార్ధంలో చలి ఎక్కువగా ఉండి, ద్వితీయార్ధంలో ఎండతో కూడుకున్న చలిగాలులు ఉంటాయి.
మాఘం: ఈ మాసంలో కార్తెల ప్రభావం ప్రతికూలంగా ఉండటంతో బలమైన గాలులు వీస్తాయి. వాతావరణం పొడిగా ఉంటుంది.
ఫాల్గుణం: ఈ మాసంలో ఉత్తరాభాద్ర, రేవతి కార్తెల ప్రవేశ సమయం అనుకూలంగా ఉండటంతో వాతావరణం బాగుంటుంది. సాధారణ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.
ఈ సంవత్సరం 1 తూము వర్షం, 4 తూముల వాయువు. రాజు శని కావడం వల్ల ఈ ఏడాది ఒక తూము వర్షపాతమే అయినా సస్యానుకూలంగా కురుస్తుంది. ఆఢకం దేవమానంతో 60 యోజనాల వెడల్పు, 100 యోజనాల ఎత్తు కలిగి ఉంటుంది. సముద్రంలో 10 భాగాలు, పర్వతాల్లో 9 భాగాలు, భూమిపై 1 భాగం వర్షం కురుస్తుంది
ఈ సంవత్సరం ఆఢకం వృద్ధ గొల్లవాడి హస్తగతమై ఉంది. అనంతరం వేశ్య హస్తగతమై ఉంది. వృద్ధ గొల్లవాడి చేతిలో ఆఢకం ఉండటం వల్ల అనుకూల వర్షాలతో వ్యవసాయదారులు సంతృప్తి చెందుతారు. వేశ్య హస్తగతమై ఉండటం వల్ల మంచి వర్షాలతో పంటలు సమృద్ధిగా పండటం, వాటికి సరైన ధరలు రావడం వంటి శుభఫలితాలు ఉంటాయి. కొన్ని ప్రత్యేక వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది.