యుక్త వయసులో అడుగుపెడుతున్న అమ్మాయిల మదిలో ఎన్నెన్నో సందేహాలు తలెత్తుతాయి. ఈ సమయంలో శారీరకంగానే కాదు, మానసికంగానూ.. బాలికల్లో ఎన్నో మార్పులు వస్తుంటాయి. ఫలితంగా.. వారిలో అనేక అనుమానాలు, భయాలూ తొంగిచూస్తుంటాయి. అయితే, బాల్యం నుంచి యవ్వనంలో చేరే ఈ దశ.. ఎంతో కీలకమైంది. ఇప్పుడు ఏర్పరచుకునే అలవాట్లు, జీవనశైలి సూత్రాలే.. వాళ్ల సంపూర్ణ భవిష్యత్తుకు పునాది. కాబట్టి, టీనేజీ పిల్లలకు కొన్ని విషయాల్లో సంపూర్ణ అవగాహన కల్పించాలి. ఇందుకు తల్లులే ప్రత్యేక శ్రద్ధ చూపాలి.
పీరియడ్స్.. అమ్మాయిల్లో శారీరకంగా, మానసికంగా ఎన్నో మార్పులు తీసుకొస్తాయి. కొన్ని సందర్భాల్లో భయాందోళనలకూ గురిచేస్తాయి. కాబట్టి, పీరియడ్స్ మొదలవకముందే.. నెలసరి గురించి వారికి పూర్తిగా అర్థమయ్యేలా చెప్పాలి. శారీరకంగా కలిగే మార్పులను వివరించాలి. అప్పుడే వారిలో భయాలు, అపోహలూ దూరమవుతాయి. శరీరంలో వస్తున్న మార్పులను అర్థం చేసుకుంటూ.. అందుకు తగ్గట్టుగా జీవనశైలిలో మార్పులు చేసుకుంటారు. ఇక పీరియడ్స్ సమయంలో పరిశుభ్రత పాటించడం, ప్యాడ్స్ మార్చుకోవడం లాంటి విషయాలపైనా అవగాహన కల్పించాలి.
హార్మోన్ల మార్పులతో టీనేజీ పిల్లల్లో మొటిమలు, అవాంఛిత రోమాలు వస్తుంటాయి. ముఖ్యంగా ముఖంపై వచ్చే మొటిమలు.. పిల్లల్లో ఆత్మన్యూనతకు దారితీస్తాయి. వాటిని గిల్లడం, చిదమడం లాంటివి చేయకుండా చూసుకోవాలి. మొటిమలు రాకుండా ఉండేందుకు, వచ్చినా తగ్గేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలి. ఇక అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి షేవింగ్, వ్యాక్సింగ్ ఎలా చేసుకోవాలో కూడా చెప్పాలి.
ఎదుగుతున్న అమ్మాయిలకు తగిన పోషకాహారం అందించడం తప్పనిసరి. కాబట్టి, వారి ఆహారంలో అధిక ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ ఉండేలా చూసుకోవాలి. ఈ సమయంలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే.. బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, తక్కువ ఫ్యాట్, తక్కువ
కార్బొహైడ్రేట్లు ఉండే ఆహారం ఇవ్వాలి. ఇక సరైన మోతాదులో నీళ్లు తీసుకోవడం కూడా చాలాముఖ్యం. రోజుకు కనీసం 10 – 12 గ్లాసుల నీళ్లు తాగేలా చూసుకోవాలి. కాఫీ, టీ, కార్బొనేటెడ్ డ్రింక్స్, కృత్రిమ పండ్ల రసాలకు వీలైనంత దూరంగా ఉంచాలి.
శరీరంలో కలిగే మార్పుల వల్ల చాలామంది టీనేజీ అమ్మాయిలు సిగ్గు, బిడియంతో ముడుచుకు పోతుంటారు. ఆటలకు దూరమై.. అధిక బరువు, ఊబకాయం బారిన పడుతుంటారు. కాబట్టి, వారికి వ్యాయామం తప్పకుండా అలవాటు చేయాలి. అప్పుడే.. భవిష్యత్తులో జీవనశైలి వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు.