మా బాబు వయసు పది సంవత్సరాలు. తరగతిలో అందరికంటే తక్కువ ఎత్తు ఉంటాడు. క్లాస్‌లో పిల్లలు అప్పుడప్పుడూ తనను ఆటపట్టిస్తున్నారని ఇంటికి వచ్చి బాధపడుతున్నాడు. ఈ మధ్య చలాకీగా ఉండట్లేదు. డాక్టర్‌కు చూపిస్తే పిల్లవాడు ఆరోగ్యంగానే ఉన్నాడని చెప్పారు. ఇప్పటి వరకు ఏ టెస్టులు చేయించలేదు. మా ఆయన, నేను మరీ పొడుగు కాదు. అలాగని పొట్టిగానూ లేము. తనలో ఎదుగుదల లోపం ఉందా? ఎత్తు తక్కువ పిల్లలు ఆత్మన్యూనతకు గురైతే ఎలా జాగ్రత్తపడాలి?
మీ పిల్లవాడి ఎత్తు తక్కువని చెప్పారు. సాధారణంగా వయసుని బట్టి ఎత్తు, బరువు ఎంత ఉండాలో నియమాలు ఉన్నాయి. అలాగే వాళ్ల ఎత్తు, బరువు పెరుగుదల రేటు కూడా ఉంటుంది. ఆ ప్రకారంగా ఉన్నదీ, లేనిదీ నిర్ధారించాలంటే వయసు, ఎత్తు, బరువుతోపాటు గతంలో ఎంత వయసులో ఎంత ఎత్తు ఉన్నాడో కూడా తెలియాలి. పెరుగుదల రేటు సరిగా ఉంటే చాలు. ఎత్తుకు ప్రాధాన్యం లేదు. మీరు, మీ వారు బాగా ఎత్తు కాదన్నారు. కానీ, ఎంత ఎత్తు ఉన్నారో చెప్పలేదు. పిల్లల ఎదుగుదలను పోల్చేప్పుడు తల్లిదండ్రులతోపాటు, వారి అమ్మానాన్నల ఎత్తును కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఇలాంటి వివరాలేవీ మీరు చెప్పలేదు. ఎత్తు తక్కువ ఉన్నంత మాత్రాన కంగారుపడొద్దు. యుక్త వయసు వచ్చిన తర్వాత పిల్లవాడి ఎదుగుదలలో ఏ సమస్య ఉందో నిర్ధారించవచ్చు. మీరు తప్పకుండా మొదట పిల్లల వైద్యులను సంప్రదించండి. కొన్ని ముఖ్యమైన పరీక్షలు చేయించండి. ఎండోక్రైన్ గ్రంథుల ప్రత్యేక వైద్యులను కూడా సంప్రదించండి. హార్మోన్ల సమస్య ఏమైనా ఉన్నదీ, లేనిదీ తెలుసుకోండి.
పొట్టిగా ఉన్న పిల్లలను ఎవరైనా ఇబ్బందిపెడితే ఆత్మన్యూనతతో బాధపడుతూ ఉంటారు. బొద్దుగా, మరీ ఎక్కువ ఎత్తు, తక్కువ ఎత్తు ఉండే పిల్లలను తోటివారు ఆటపట్టిస్తుంటారు. ఒకసారి అంటే తమాషాకు అనుకోవచ్చు. కానీ, పదే పదే అంటే అది దూషణగానే పరిగణించాలి. ఎవరైనా తరగతి గదిలో మీ అబ్బాయిని అలా ఇబ్బంది పెడుతుంటే ప్రిన్సిపల్, టీచర్‌ను కలవండి. వాళ్లకు సమస్య వివరించండి. టీచర్ల ద్వారా పిల్లలకు ఇది తగదని చెప్పించాలి. కొంతవరకు సమస్య పరిష్కారమవుతుంది. పిల్లలు మనోవ్యధలో కూరుకుపోకుండా వాళ్లతో మాట్లాడుతూ వాళ్లకు ఇష్టమైన విషయాలు చెబుతూ ఉండాలి. వాళ్లు చేసే మంచి పనులు మెచ్చుకుంటూ ఉండాలి. వాళ్లను సంతోషంగా ఉంచడం ముఖ్యం.