ఆనందాల కేళి.. దీపావళి. ఇది ఒక్కరోజు పండుగ కాదు. మన తెలుగు రాష్ర్టాల్లో మూడు రోజుల ముచ్చట. కేరళలో ఐదు రోజుల వేడుక. గుజరాతీలకు నయా సాల్ మొదలయ్యేది ఈనాటి నుంచే! ఇలా భిన్నత్వంలో ఏకత్వంగా విలసిల్లుతున్న భారతావనిలో దీపాలు ఏకత్వమైతే.. దీపావళి నిర్వహించే విధానంలో బహుళత్వం కనిపిస్తుంది. ఆశ్వయుజ బహుళ త్రయోదశి మొదలుకుని కార్తిక శుద్ధ విదియ వరకు రోజుకో రీతిగా దీపాల ‘వరుస’ పండుగ చేసుకుంటారు. ఆ విశేషాలు ఇవి..
తెలుగునాట ఆశ్వయుజ బహుళ త్రయోదశి (ధన త్రయోదశి)తో దీపావళి వేడుక మొదలవుతుంది. ఆనాడు లక్ష్మీదేవిని పూజిస్తారు. మరుసటి రోజు నరక చతుర్దశి. మర్నాడు అమావాస్య సందర్భంగా దీపావళి పండుగ చేసుకుంటారు. తెల్లవారుజామునే ఆడపడుచులు ఇంట్లో ఉన్న మగవాళ్లకు హారతులు ఇచ్చే సంప్రదాయం మన దగ్గర కనిపిస్తుంది. లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. సాయంత్రం దీపాలు వెలిగించి, పటాకులు కాలుస్తారు. వ్యాపారులు ‘ధనలక్ష్మి’ పూజలు చేస్తారు. కొందరు కుటుంబ సంప్రదాయంగా కేదారేశ్వర వ్రతం ఆచరిస్తారు.
కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాల్లో ఈ విధానాన్నే పాటిస్తారు. దీపావళి నాడు సూర్యాస్తమయం కాగానే మగవాళ్లు దివిటీలను దక్షిణ దిక్కుకు చూపిస్తూ నిలబడతారు. యముడు దక్షిణ దిక్కున ఉంటాడని, పితృదేవతలకు దారి చూపించేందుకు ఈ విధంగా చేస్తారని పురాణ కథనం.
మహారాష్ట్రలో దీపావళి నాడు ‘పెధిపూజన్’ పేరుతో ప్రత్యేక పూజలు చేస్తారు. ఉదయం లక్ష్మీదేవిని, సరస్వతిని అష్టోత్తర నామాలతో పూజిస్తారు. తీపి పదార్థాలను నివేదనగా సమర్పిస్తారు. ఇదే రోజు వ్యాపారులు జమాఖర్చులు చూసుకొని కొత్త పుస్తకాలను ప్రారంభిస్తారు. సాయంత్రం ఇంటి ముందు పదహారు దీపాలను వెలిగించి లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతారు.గుజరాతీలు దీనిని వ్యాపార సంబంధమైన పండుగగా చేసుకుంటారు. లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. వ్యాపారులు జమాఖర్చు పుస్తకాలను, విద్యార్థులు పాఠ్యపుస్తకాలను పూజిస్తారు. దీనికి ‘వహీ పూజ’ అని పేరు. ఇంట్లో బంగారమంతా తెచ్చి దీపాల ముందు ఉంచి.. పూజలు చేస్తారు.
ఉత్తర్ప్రదేశ్లో లక్ష్మీదేవిని పూజించి, దీపాలను వెలిగించి ఆరాధించడంతో పాటు ‘భరత్ మిలాప్’ పేరిట శ్రీరాముడిని కొలుస్తారు. రావణ సంహారం చేసిన తర్వాత శ్రీరాముడు.. సీతాసమేతంగా అయోధ్యకు చేరుకొని పట్టాభిషిక్తుడు అయిన రోజును దీపావళిగా భావించి ఈ వేడుకను చేసుకుంటారు.
పశ్చిమబెంగాల్లో నరక చతుర్దశి అర్ధరాత్రి వేళ మహిళలు చేటలు తీసుకొని కొడుతూ ఇంటి నుంచి బయటికి వస్తారు. దీన్ని ఇంట్లోని అలక్ష్మిని తరిమివేసేందుకు ప్రతీకగా భావిస్తారు. తర్వాత ఇంటి ముందు ముగ్గులు తీర్చిదిద్ది, దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు. ఆనాటి సాయంత్రం కాళీమాతను కూడా పూజిస్తారు.
ఎవరు ఏ రకంగా పండుగ చేసుకున్నా.. అజ్ఞానమనే చీకట్లు తొలగి తమ జీవితాల్లో జ్ఞాన కాంతులు నింపడమే దీపావళి పరమార్థం. అలక్ష్మి తొలగిపోయి లక్ష్మి సిద్ధించాలని ఆశించడమే అంతరార్థం!
ఆశ్వయుజ బహుళ త్రయోదశి: ధన త్రయోదశి (లక్ష్మీదేవి ఇలకు దిగి.. ఇంటింటికీ వస్తుందని నమ్మకం)
ఆశ్వయుజ బహుళ చతుర్దశి: నరక చతుర్దశి (సత్యభామ నరకాసురుణ్ని ఇదేరోజు సంహరించిందని పురాణ కథనం)
ఆశ్వయుజ అమావాస్య: దీపావళి
కార్తిక శుద్ధ పాడ్యమి: బలి పాడ్యమి (కేరళలో చేసుకుంటారు. వామనుడు త్రివిక్రమ రూపం దాల్చి.. రాక్షస రాజైన బలిని పాతాళానికి తొక్కేసింది ఇదే రోజని చెబుతారు)
కార్తిక శుద్ధ విదియ: భ్రాతృ విదియ (దీనినే యమ ద్వితీయ అంటారు. ఈ రోజు యమధర్మరాజు తన సోదరి అయిన యమున ఇంటికి భోజనానికి వెళ్తాడట. ఈ సందర్భంగా సోదరులు పెండ్లి అయిన తమ సోదరి ఇంటికి వెళ్లి భోజనం చేస్తే.. రెండు కుటుంబాలకూ మేలు జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి)