ఆమె అందమైన కలలు కన్నది. అలా ఇలా కాదు, కనిపించే ఆకాశాన్ని దాటి అల్లంత దూరాన ఉన్న అంతరిక్షంలోకి ప్రవేశించాలని గొప్ప గొప్ప కలలు కన్నది. వాటి సాకారానికే ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నది. అంతలోనే ఆమె లక్ష్యానికి అగాధంలాంటి అడ్డంకి ఏర్పడింది. చదువుకునే రోజుల్లోనే ఆమె లైంగిక దాడికి గురైంది. చట్టాలు ఆడపిల్లల చుట్టాలేమీ కావని ఆ సమయంలో తెలుసుకుందామె! అందుకే వాటి మార్పు కోసం గొంతెత్తింది. అమెరికాలో అత్యాచార బాధితుల హక్కులకు సంబంధించిన చట్టం అచ్చంగా ఆమె పోరాట ఫలితమే. ఆ తర్వాత రోదసినీ తన సొంతం
చేసుకుంది. ఇదంతా ఇటీవల అంతరిక్ష యాత్రకు వెళ్లిన అమెరికన్ ఆస్ట్రోనాట్ అమందా నుయెన్ గురించే. ఆ యాత్రల్లాగే ఆమె కథ కూడా సాహసోపేతమే!
జీవితంలో చాలామందికి ఎన్నో రకాల లక్ష్యాలు ఉంటాయి. వాటిని చేరే క్రమంలో ఏవేవో అడ్డంకులూ ఏర్పడుతుంటాయి. వాటి వెంట సాగిపోయి లక్ష్యాన్ని మర్చిపోయేవాళ్లు కొందరైతే, వాటన్నిటికీ సమాధానం చెప్పి మరీ గమ్యాన్ని చేరుకునే వారు మరికొందరు. అమంద రెండో కోవలో వ్యక్తి. పరిస్థితులు ఏవైనా అనుకున్న తీరానికి చేరేదాకా చేతులెత్తే సమస్యే లేదన్నది ఆమె విధానం. యూనివర్సిటీ చివరి పరీక్షలకు మూడు నెలల ముందు అఘాయిత్యానికి గురైన ఆమెకు కళ్ల ముందు చీకటి తప్ప మరేమీ కనిపించలేదు. అలాంటి సందర్భంలోనూ ‘ఓటమిని ఎన్నడూ అంగీకరించకూడదు’ (నెవర్, నెవర్, నెవర్ గివ్‌అప్) అని ఓ కాగితం మీద పెన్నుతో రాసుకుందామె. ఆ కాగితమే తన గెలుపు మంత్రంగా భావించింది. ఇటీవలి అంతరిక్ష యాత్రకూ దాన్ని తీసుకెళ్లింది. అక్కడినుంచి పంపిన వీడియోలో ఆ కాగితాన్ని చూపుతూ భావోద్వేగానికి గురైన అమంద మొక్కవోని దీక్షకు నిలువెత్తు నిదర్శనం.
హార్వర్డ్ వర్సిటీలో చివరి సెమిస్టర్లో ఉన్న అమంద స్నేహితులతో కలిసి ఓ పార్టీకి హాజరైంది. ఆ సమయంలోనే ఆమె మీద అఘాయిత్యం జరిగింది. కళ్లు తెరిచే సరికి ఆసుపత్రిలో ఉందామె. డిశ్చార్జ్ సమయానికి నాలుగున్నర లక్షల రూపాయల బిల్లును అమంద చేతిలో పెట్టారు ప్రభుత్వ వలంటీరు. అంతేకాదు, తన మీద లైంగిక దాడి జరిగిందని నిర్ధారించే రేప్ ఎవిడెన్స్ కిట్‌ను కేవలం 6 నెలలు మాత్రమే దాచి ఉంచుతారనీ, ఆ తర్వాత దాన్ని పారేస్తారని కూడా తెలిపారు. కానీ ఇలాంటి సందర్భాల్లో బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు అక్కడి చట్టాల ప్రకారం 15 సంవత్సరాల వరకూ సమయం ఉంటుంది.
అంటే, రేప్‌లాంటి సందర్భాల్లో మనుషులు కుంగిపోతారు కనుక, వాళ్లు కోలుకునే దాకా సమయం ఇచ్చి మానవతా దృక్పథంతో కోర్టు వ్యవహరిస్తుంది. కానీ వీళ్లు కోర్టును ఆశ్రయించే సమయానికే నేరాన్ని నిరూపించే అత్యంత విలువైన రేప్కిట్ ఆధారాలు ఉండవు. అంతేకాదు, ఆ కిట్ కోసమూ బాధితులే డబ్బులు కట్టాలి. తన మీద జరిగిన ఘోరం కన్నా ఇది మరింత దారుణంగా తోచిందామెకు. శారీరకంగా, మానసికంగా దుర్బలంగా ఉన్న అమందను ఇది మరింత బలహీన పరిచింది. ఇది చాలా అన్యాయం… అని గట్టిగా అరిచింది ఆమె లోపలి గొంతుక. అందుకే కాస్త కోలుకోగానే తనలాంటి బాధితులందర్నీ ఓ చోట చేర్చింది.
వాళ్ల కథలన్నిటినీ రకరకాల మాధ్యమాల ద్వారా జనానికి చేరువ చేసింది. అవన్నీ ఆ చట్టంలోని లోపాలను విస్పష్టంగా ఎత్తి చూపాయి. అసలు తమలాంటి వాళ్లు ప్రభుత్వపరంగా ఎలాంటి హక్కులు కావాలనుకుంటున్నారు అన్నది డ్రాఫ్టులా రూపొందించింది అమంద. బాధితులతో కలిసి తమ ప్రాంతంలోని చట్టసభల ప్రతినిధికి దాన్ని సమర్పించింది. దాన్ని అమెరికా పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించడంతో, అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా చేతుల మీదుగా ‘సెక్సువల్ అసాల్ట్ సర్వైవర్స్ బిల్ ఆఫ్ రైట్స్’ 2016లో చట్ట రూపం దాల్చింది. దీన్ని అమెరికాలోని అన్ని రాష్ర్టాలూ ఆమోదించేలా కృషి చేసింది అమంద. అందుకోసం రైజ్ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పింది. దశాబ్ద కాలానికి పైగా ఆమె మహిళల సమస్యల మీద పోరాడుతూనే ఉంది. ఈ కొత్త చట్టం ప్రకారం 15 సంవత్సరాలపాటు ఎవిడెన్స్ కిట్‌ను భద్రపరచాలి. అలాగే కిట్ కోసం బాధితులు డబ్బులు చెల్లించనక్కర్లేదు.
అమంద మీద దాడి 2013లో జరిగితే తాను కావాలనుకున్న చట్టం రూపొందడానికి 2016 దాకా పట్టింది. అంటే మూడు సంవత్సరాల కాలం ఆమె కోల్పోయింది. అయినా సరే తన వ్యోమగామి కలను మళ్లీ సుసాధ్యం చేసుకునే దిశగా అడుగులు వేసింది. ఇప్పుడు తన స్వప్నాన్ని సాకారం చేసుకుంటూ అంతరిక్షంలోకి దూసుకుపోయింది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కి సంబంధించిన అంతరిక్ష సంస్థ బ్లూ ఆరిజిన్ అచ్చంగా ఆడవాళ్లతోనే మొన్న ఓ స్పేస్‌షిప్‌ని పంపింది. అందులో అమంద కూడా ఒకరు. అక్కడ ఆమె అంతరిక్షంలో మహిళల రుతుచక్రం, శరీర మార్పుల్లాంటివి పరిశోధిస్తుంది.
ఇక, లైంగిక దాడి తర్వాతి పరిణామాల నేపథ్యంలో ‘సేవింగ్ ఫైవ్’ పేరిట ఓ పుస్తకాన్ని తీసుకొచ్చింది అమంద. ఇందుకుగానూ 2019 సంవత్సరానికి నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయ్యింది. 2022లో టైమ్స్ మ్యాగజైన్లో ఆ ఏడాది మహిళగా ఎంపికైంది. ‘ఒక మహిళగా నేను సాధించిన దానిని ప్రతి ఒక్కరూ సాధించగలరు. మనమీద మనకు నమ్మకం, నిరంతర కృషి, స్పష్టమైన లక్ష్యం ఉంటే ఏ వ్యక్తి అయినా తాను కోరుకున్న గమ్యానికి చేరుకోగలరు’ అని చెబుతుంది అమంద. లక్ష్యసాధకుల లక్షణాల విషయంలో అమందను మించి అద్భుతమైన ఉదాహరణ ఇంకోటి ఉండదేమో అనిపిస్తుంది కదూ… ఆమె గురించి చదువుతుంటే!