చిన్నారులకు ఎంతగానో నచ్చే కథల పుస్తకాలకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. కానీ అవన్నీ ఊహాజనిత రూపాల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆ కథలను చదువుతున్న చిన్నారుల రూపాలే… పాత్రలుగా పుస్తకంలో ప్రచురితమైతే! భలేగా ఉంటుంది కదా!! హైదరాబాద్‌కు చెందిన అక్షత మస్తిష్కంలో మెదిలిన ఈ ఆలోచనే ఆమెను ‘ట్రెజర్ టాట్స్’ స్టార్టప్‌ను ప్రారంభించేలా చేసింది. మొదలుపెట్టిన నాలుగు నెలల్లోనే 125కిపైగా పుస్తకాలకు రూపాన్నిచ్చి ఆంత్రప్రెన్యూర్‌గా సక్సెస్ఫుల్ జర్నీకి శ్రీకారం చుట్టిన ‘ట్రెజర్ టాట్స్’ వ్యవస్థాపకురాలు అక్షత స్టార్టప్ స్టోరీ చదివేయండి..
ఐటీ రంగంలో స్థిరపడిన అక్షత మణికొండలో నివాసం ఉంటుంది. భర్త కూడా ఐటీ ఉద్యోగే! ఇద్దరికీ టెక్నాలజీపై మంచి పట్టు ఉంది. దీనికితోడు అక్షతకు సృజనాత్మక కార్యక్రమాలు అంటే ఆసక్తి. ఓసారి తన కూతురి పుట్టినరోజు కోసం ఏదైనా అరుదైన కానుక ఇవ్వాలని అనుకుంది. అలా మొదలైన ఆలోచనల పరంపర ఆమె స్టార్టప్ జర్నీకి నాంది పలికింది. కూతురు పుట్టినరోజుకు అందరు పేరెంట్స్లా బొమ్మలు, నగలు, దుస్తులు లాంటి బహుమతులు కాకుండా, తన ముద్దుల చిన్నారి ఇష్టంగా చదివే కథల పుస్తకాలు అందించాలని భావించిందామె! అలాగని ఓ బుక్‌స్టోర్‌కు వెళ్లి ఖరీదైన పుస్తకం కొనలేదు. తను ఇచ్చే కానుక కూతురికి మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోవాలని అనుకుంది. నెట్టింట్లో వెతికితే కథల్లో ఉండే పాత్రల పేరుతో పుస్తకాలు కనిపించాయి. పుస్తకంలో పేరు మార్చినంత మాత్రాన స్పెషల్ ఏముంది అనుకొని అక్షత తన ఆలోచనలకు మరింత పదును పెట్టింది. సాంకేతిక పరిజ్ఞానానికి, సృజనాత్మకతను జోడించి తన ముద్దుల కూతురి ఫొటోలతో కూడిన ఓ కథల పుస్తకాన్ని ముద్రించింది. దానిని అపురూపంగా తన కూతురికి బహుమానంగా ఇచ్చి ఆశ్చర్య పరిచింది. పుస్తకాన్ని చూడగానే అవధుల్లేని ఆనందంతో మురిసిపోయిన ఆ కూతురు ఇచ్చిన తొలి ఫీడ్‌బ్యాకే… ట్రెజర్ టాట్స్కు బాటలు వేసిందని అక్షత చెబుతుంది.
మార్కెట్లో రకరకాల కథల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. వేటికవే ప్రత్యేకం కూడా! ఊహాజనిత బొమ్మలను చూసే చిన్నారులు ముచ్చట పడిమరీ చదువుతుంటారు. కానీ ఆ పాత్రలలో తమను చూసుకునే అవకాశాన్ని అక్షత కల్పిస్తున్నది. 24-30 పేజీలతో ఉండే స్టోరీ బుక్‌ను చిన్నారుల ఫొటోలతో తీర్చిదిద్దడమే ట్రెజర్ టాట్స్ వ్యాపారం. ఓవైపు కథ నడుస్తూనే… పాత్రకు తగినట్టుగా కస్టమైజ్డ్ ఫొటోలు పొందుపరుస్తారు. ఆ పుస్తకాన్ని చదువుతున్నంత సేపు ఆ కథలో హీరో తానే అనే భావన కలిగేలా ఫొటోలను ముద్రిస్తారు. ఇన్నోవేటివ్ స్టోరీలకు అనుగుణంగా చిన్నారుల చిత్తరువులు ముద్రించడంతో.. ఆ బుక్స్ ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి. వాటిని చదువుతున్న చిన్నారులు తెలియకుండానే కథలో లీనమై, ఆ పాత్రల్లో తమనే ఊహించుకుంటూ మురిసిపోతున్నారు. సమ్‌థింగ్ స్పెషల్ ఐడియాతో మార్కెట్లోకి రావడంతో ‘ట్రెజర్ టాట్స్’ ప్రారంభించిన నాలుగు నెలల వ్యవధిలో అక్షత 125 పుస్తకాలను ముద్రించగలిగింది. వీటిలో వీర హనుమాన్, పద్మాక్షి ఆండాల్, మౌర్య, బాలాత్రిపుర సుందరి జననం, స్పైడర్ మ్యాన్, రాణిరుద్రమ, మైరా, మహాభారతంలోని విదుర నీతి కథలు ఇలా ఎన్నో పౌరాణిక, ఆధ్యాత్మిక, చారిత్రక, ఊహాజనిత కథలలో చిన్నారుల ఫొటోలను జోడించి ఆకట్టుకునే స్టోరీలను అందిస్తున్నది.
ఇద్దరు పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూనే… వీలు దొరికిన సమయంలో అక్షత మనసు పెట్టి స్టోరీ బుక్స్ రూపకల్పన చేసేది. తనతో మొదలైన ఈ వ్యాపారంలో మరో ఇద్దరు కూడా జతకట్టడంతో మల్టిపుల్ ఆర్డర్లను సొంతం చేసుకుంటున్నారు. తమకున్న కళానైపుణ్యంతో జీవం పోసుకున్న కథల పుస్తకాలకు సోషల్ మీడియా ద్వారా ప్రాచుర్యాన్ని కల్పిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో విదేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. ‘ఇటీవల హనుమాన్ చాలీసాలోని దోహాలకు అనుగుణంగా బొమ్మల రూపంలో 200 బుక్స్ కోసం అమెరికా నుంచి ఆర్డర్ రావడం మంచి గుర్తింపుగా భావిస్తున్నాను’ అని అక్షత గర్వంగా చెబుతుంది. ఎడిటింగ్, పేజ్ డిజైన్ అంశాల్లో నిష్ణాతుణురాలైన ఆమె… తన క్రియేటివిటీ పెట్టుబడిగా అందమైన కథల పుస్తకాలను తీసుకువచ్చి చిన్నారుల మనసును దోచుకుంటున్నది. ఇన్‌స్టాలో @treasuretots2025 హ్యాండిల్ ద్వారా తాను రూపొందించిన పుస్తకాలను ప్రాచుర్యంలోకి తీసుకువస్తూ, ఆర్డర్లను సొంతం చేసుకుంటున్నది.
భర్త ప్రోత్సాహంతో తన ఆలోచనలను వ్యాపారంగా మలిచే క్రమంలో ఆమెకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. వీ హబ్‌తో తనలోని సృజనాత్మక కళకు మెరుగులు దిద్దుకునే అవకాశం ఏర్పడిందంటారు అక్షత. మార్కెటింగ్, అకౌంటింగ్‌తోపాటు, ఈ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చే నైపుణ్యాలపై సమగ్రమైన అవగాహన పొందే వీలు కలిగిందంటారు. ఆరు నెలల వీ రీచ్ ప్రోగ్రాం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నది. ప్రస్తుతం ఖాళీ సమయాల్లో పలువురు గృహిణులతో కలిసి స్టార్టప్ నిర్వహిస్తూ కస్టమైజ్డ్ వాల్‌పోస్టర్లు, స్టిక్కర్లు, పుస్తకాలతోపాటు బొమ్మలు కూడా అందిస్తున్నది. తన వ్యాపారాన్ని మరింత విస్తరించే యోచనలో ఉన్నది. త్వరలో పూర్తిస్థాయి పబ్లికేషన్ సంస్థను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నది. ప్రస్తుతం ముగ్గురికి ఉపాధినిచ్చే స్థాయిలో తన వ్యాపారం సాగుతున్నదనీ, వ్యాపార విస్తరణలో భాగంగా చిల్డ్రన్స్ రూమ్ డిజైన్లు, వాల్ పోస్టర్లు, రూమ్ స్టిక్కరింగ్ లాంటి సేవలు కూడా అందిస్తామని చెబుతున్న అక్షతకు మనమూ ఆల్ ద బెస్ట్ చెబుదాం.
– కడార్ల కిరణ్