చలికాలం రాబోతున్నది. ప్రకృతికాంత పొగమంచుతో మేకప్ వేసుకొని.. సరికొత్తగా ముస్తాబు కానున్నది. ఇలాంటి వాతావరణంలో హిల్ స్టేషన్ల పర్యటన.. అత్యద్భుతంగా సాగుతుంది. అయితే, సాధారణ హిల్ స్టేషన్ల కన్నా.. సరిహద్దుల్లో పర్యటిస్తే యాత్ర ఆసక్తికరంగా మారుతుంది. ప్రకృతిని ఆస్వాదించడంతోపాటు సరిహద్దు పట్టణాలు సంస్కృతి, వాణిజ్యం, అక్కడి చరిత్రను కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇతర దేశాలతో సరిహద్దును పంచుకునే మనోహరమైన భారతీయ పట్టణాలను వీక్షించి రండి.
కాలుష్యానికి దూరంగా వెళ్లాలని అనుకుంటే.. మేఘాలయలోని ‘డాకీ’కి ప్రయాణం కట్టేయండి. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి ఉన్న ఈ పట్టణం చూడ ముచ్చటగా ఉంటుంది. స్వచ్ఛమైన జలాలకు కేరాఫ్ అయిన ‘ఉమ్‌గోట్ నది’లో విహారం మనసును ఆహ్లాదపరుస్తుంది. పడవ సవారీలు, సస్పెన్షన్ వంతెనలు సహా.. సుందరమైన ఉమ్‌గోట్ నదీ పరిసరాలను సందర్శించొచ్చు. బంగ్లాదేశ్‌తో బలమైన సాంస్కృతిక, వాణిజ్య సంబంధాలను గమనిస్తూనే.. మేఘాలయ సహజ సౌందర్యాన్నీ ఆస్వాదించవచ్చు.
మణిపూర్‌లోని ఒక చిన్న పట్టణం మోరే. ఇది భారత్‌ను మయన్మార్‌తో కలుపుతుంది. భారత్-మయన్మార్-థాయిలాండ్ రహదారి వెంట ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా ఉన్నది. ఈ పట్టణంలో అడుగడుగునా భారత్-బర్మాల మిశ్రమ సంస్కృతి కనిపిస్తుంది. ముఖ్యంగా వస్ర్తాలు, హస్తకళలు, వంటకాలలో.. మయన్మార్ సంప్రదాయాలు కట్టిపడేస్తాయి. ఈ పట్టణాన్ని సందర్శించేవారికి.. పొరుగు దేశాల మధ్య వాణిజ్యం, సంస్కృతి ఎలా సాగుతుందో అనుభవంలోకి వస్తుంది.
భూటాన్ సరిహద్దులో సందడిగా ఉండే భారతీయ పట్టణం.. జైగావ్. ఇది భూటాన్‌కు ప్రవేశ ద్వారం కూడా! ఈ ప్రదేశాన్ని సందర్శిస్తే.. రెండు దేశాల సంస్కృతులనూ తెలుసుకోవచ్చు. టిబెటన్ రుచులను ఆస్వాదించవచ్చు. ప్రశాంతమైన మఠాలతోపాటు మంచు పర్వతాల అంచున ఉన్న జీవితాలను స్పృషించవచ్చు. సందడిగా ఉండే కలర్‌ఫుల్ మార్కెట్లు, టిబెట్ తినుబండారాలు, వారి వస్త్రశైలిలో ప్రత్యేకమైన సాంస్కృతిక సమ్మేళనాన్ని కళ్లారా వీక్షించవచ్చు. జైగావ్ వీధుల్లో సందర్శిస్తుంటే, ఆహారం మొదలుకొని వాస్తుకళ దాకా.. భారత్-భూటాన్ సంస్కృతులు ఎంతగా కలిసిపోయాయో గమనించవచ్చు.