తక్కువ ఎత్తు ఉన్నవారిలో చాలామంది ఆత్మన్యూనతకు గురవుతున్నారట. తాము పొడవుగా కనిపించడానికి హైహీల్స్‌ను ఆశ్రయిస్తున్నారట. అయితే, ఇలా హీల్స్ వేసుకోవడం వల్ల లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయి. అసౌకర్యంతోపాటు పాదాల నొప్పి, ఆస్టియో ఆర్థరైటిస్, మోకాలి నొప్పి లాంటివి వేధిస్తాయి. అయితే.. వేసుకొనే దుస్తులతోనే ఎత్తుగా కనిపించవచ్చని స్టయిలిస్ట్‌లు సెలవిస్తున్నారు. వారి సూచనలేంటో చూసేద్దామా!
‘మోనోక్రోమ్ లుక్’లో ఉంటే కాస్త హైట్ ఎక్కువ ఉన్నట్లు కనిపిస్తారట. ఒకే రంగు దుస్తులు, పై నుంచి కిందకి ఒకే రకమైన షేడ్స్ ఉన్న దుస్తులు ధరించడమే.. మోనోక్రోమ్ లుక్. టాప్ టూ బాటమ్ డ్రెస్ మొత్తం ఒకే రంగులో ఉంటే.. శరీరంలో బ్రేక్ లైన్లు కనిపించవు. దాంతో పొడవుగా ఉన్నట్లు కనిపిస్తారు. నలుపు, లేత గోధుమరంగు, తెలుపు, పాస్టెల్ షేడ్స్.. మనుషుల్ని మరింత హైట్‌గా చూపిస్తాయని చెబుతున్నారు.
సంప్రదాయాన్ని పాటిస్తూనే, ఎత్తును కూడా పెంచుకోవాలంటే.. లాంగ్ కుర్తీలను ఆశ్రయించాల్సిందే! ఇందులోనూ స్ట్రెయిట్ ప్యాంట్లు, పలాజోలతో జత చేసినప్పుడు.. మొత్తం లుక్ మారిపోతుంది. మనుషులు మరింత పొడగరిగా కనిపిస్తారు. ఇక వదులుగా ఉండే కుర్తీకి బదులుగా స్ట్రెయిట్ ఫిట్ కుర్తీని ఎంచుకుంటే.. బ్యాలెన్స్ లుక్‌ను అందిస్తుంది.
ప్రస్తుతం హై వెయిస్ట్ బాటమ్ జీన్స్‌పై యువత ఎక్కువ మక్కువ చూపుతున్నది. ఈ రకమైన దుస్తులు కింద భాగంలో చాలా వెడల్పుగా ఉంటాయి. ఇలాంటి డ్రెస్‌లు ట్రెండీగా ఉండటమే కాదు.. మిమ్మల్ని పొడుగ్గా చూపించడంలోనూ సాయపడతాయి. హై వెయిస్ట్ బాటమ్స్ మీ కాళ్లకు సరైన లుక్ అందిస్తాయి. వీటిని వేసుకోవడం వల్ల కాస్త పొడుగ్గా కనిపిస్తారట.