బాలీవుడ్ నటీనటుల పారితోషికాల్లో చాలా తేడా ఉంటున్నదని ఆరోపిస్తున్నది బాలీవుడ్ నటి వామికా గబ్బి. హీరోలే ఎక్కువమంది ప్రేక్షకులను ఆకర్షించగలరని నమ్మడమే ఇందుకు కారణమని చెబుతున్నది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలో వేతన అంతరాన్ని ఎత్తి చూపింది. ఈ సందర్భంగా వామిక మాట్లాడుతూ.. “స్టార్ హీరోల సినిమాలు కూడా విఫలమైన సందర్భాలు ఉంటాయి. మరి అలాంటప్పుడు వారి రెమ్యునరేషన్లను ఎందుకు పరిశీలించరు. వారి పారితోషికాన్ని ఎందుకు తగ్గించరు?” అని ఘాటుగానే ప్రశ్నించింది.
ఇదే హీరోయిన్ల విషయంలో జరిగితే.. వారి రెమ్యునరేషన్లను తగ్గిస్తారనీ, వారిపై విమర్శలు గుప్పిస్తారని చెప్పుకొచ్చింది. “ఇండస్ట్రీలో నటీనటులకు అందించే పారితోషికాల్లో ఎంతో వ్యత్యాసం ఉన్నదనే వాస్తవం అందరికీ తెలియాలి. మగవారితో పోలిస్తే.. ఆడవాళ్లకు తక్కువ పారితోషికం లభిస్తున్నది. మీరు ఒక మహిళ అని.. మీకు తక్కువ జీతం వస్తుందనే భావన మీ మనసుల్ని మెలిపెడుతుంది. మగవాళ్లే ప్రేక్షకులను ఆకర్షించగరని దర్శకనిర్మాతలు నమ్మడమే దీనికి కారణం” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
ఇక బీటౌన్‌లో వేతన అంతరాన్ని ఎదుర్కోవడానికి తనదైన మార్గాన్ని కనుగొంటానని చెబుతున్నది వామిక. “నేను సంతోషంగా ఉండేలా.. నా కోసం వేతన అంతరాన్ని తగ్గించుకునేలా సృజనాత్మక మార్గంలో పనిచేయాలని అనుకుంటున్నా!” అని వెల్లడించింది. ఇక వామికా గబ్బి విషయానికి వస్తే.. చండీగఢ్‌లో పుట్టి పెరిగిందీ పంజాబీ బ్యూటీ. ‘జబ్ వి మెట్’ చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. సుధీర్‌బాబు హీరోగా ‘భలే మంచిరోజు’ చిత్రంతో తెలుగు సినిమాల్లోకీ ఎంట్రీ ఇచ్చింది.
హిందీ, తెలుగు, తమిళం, మలయాళం సహా పలు భాషల్లోనూ సినిమాలు చేసింది. 2023లో వచ్చిన ‘ఖుఫియా’ సినిమాతో.. దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నది. బోల్డ్ సీన్స్‌తో.. యూత్ మొత్తాన్నీ తనవైపు తిప్పుకొన్నది. సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీకి మంచి ఫాలోయింగ్ ఉంది. అడివి శేష్ హీరోగా వస్తున్న ‘గూఢచారి – 2’తో మళ్లీ తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వనుంది.