40 ఏళ్ల వయసులో మీరు తినే ఆహారం.. వృద్ధాప్యంలో మీకు మానసిక సమస్యలు రాకుండా కాపాడుతుందట. ఆరోగ్యకరమైన భోజనం తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యాలు మెరుగుపడతాయట. జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ప్రచురించిన ఓ అధ్యయనం ఈ విషయాన్ని తేల్చింది. ఇందులో భాగంగా, 1.5 లక్షల మందికి పైగా వయోజనులను పరిశీలించారు. మధ్యవయసు (40 – 50 ఏళ్ల)లో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చేపలను ఎక్కువగా తిన్నవారిలో జ్ఞాపకశక్తి క్షీణత తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. భవిష్యత్తులో డిమెన్షియా, అల్జీమర్స్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉండదని చెబుతున్నారు.
ఒక మనిషి జీవితంలో మధ్యవయస్సు అనేది కీలకమైన దశ. జీవనశైలి మార్పులు, ముఖ్యంగా ఆహారపు అలవాట్లు వారి జీవితంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. ఈ దశలో తీసుకునే ఆహారం.. వారి మెదడు సామర్థ్యాన్ని పెంచడంలో సాయపడుతుంది. మెదడు ఆరోగ్యంలోనూ ఆహారం ప్రత్యక్ష పాత్ర పోషిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు, విత్తనాలు, ఆలివ్ నూనె, చేపలు, మొక్కల ఆధారిత ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. మెదడులోని నరాల అనుసంధానాన్ని సమతులాహారం ప్రభావితం చేస్తుందట.
ఈ వయసులో పోషకాహారం లోపిస్తే.. భవిష్యత్తులో డిమెన్షియా, అల్జీమర్స్ వచ్చే అవకాశం 20% ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. అదే సమయంలో రెడ్‌మీట్, ప్రాసెస్ చేసిన ఆహారం, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, చక్కెర పానీయాల వినియోగాన్ని తగ్గించాలని అంటున్నారు. రక్తంలో చక్కెర స్థాయులు పెరిగితే మెదడులోని ‘హిప్పోక్యాంపస్’ కుంచించుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఇక అధికంగా ప్రాసెస్ చేసిన, నూనెలో వేయించిన పదార్థాలు.. మెదడుకు రక్త ప్రసరణను తగ్గిస్తాయట. దాంతో, భవిష్యత్తులో మెదడుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.