శరీర అవయవాల పనితీరు సాఫీగా సాగిపోవడానికి అయోడిన్ అవసరమవుతుంది. శరీరంలో అతి ప్రధానమైన గ్రంథుల్లో థైరాయిడ్ ఒకటి. ఈ గ్రంథి హార్మోన్లను తగినంతగా విడుదల చేయకపోవడానికి అయోడిన్ స్థాయులు తక్కువగా ఉండటమే కారణం. థైరాయిడ్ హార్మోన్లు మన శరీర జీవక్రియలు, ఇతర విధులను క్రమబద్ధం చేస్తాయి. అయోడిన్ లోపిస్తే శరీరంలో థైరాయిడ్ గ్రంథి తగిన మోతాదులో
హార్మోన్లను విడుదల చేయలేదు. దీంతో ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం అయోడిన్ లోపం వల్ల నివారించదగిన మానసిక, శారీరక అభివృద్ధికి సంబంధించిన అవకరాలు తలెత్తుతాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండువందల కోట్ల మంది అయోడిన్ లోపంతో బాధపడుతున్నారు. దీనివల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలు ప్రధానంగా గర్భిణులు, పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తాయి.
ఆహారంలో అయోడిన్ తగినంతగా లేకపోతే లోపం తలెత్తుతుంది. గర్భిణులు, బాలింతలకు ఇతరులతో పోలిస్తే ఎక్కువ అయోడిన్ అవసరం అవుతుంది. ఆహారం ద్వారా అయోడిన్ తగినంత లభిస్తే గర్భిణుల ఆరోగ్యంతోపాటు కడుపులో ఉన్న పిల్లల అభివృద్ధికి హామీ లభిస్తుంది. గర్భిణులు, బాలింతలు అయోడిన్ తగినంతగా తీసుకోకపోతే ఆరోగ్య సమస్యలు పొంచి ఉంటాయి.
మూత్రపరీక్ష, రక్తపరీక్ష ద్వారా థైరాయిడ్ హార్మోన్ స్థాయులను పరీక్షించి అయోడిన్ లోపాన్ని నిర్ధారిస్తారు. గాయిటర్ ఉంటే అల్ట్రా సౌండ్ అవసరం పడుతుంది. కొన్ని కేసులలో డాక్టర్లు రేడియో యాక్టివ్ అయోడిన్ అప్టేక్ పరీక్ష కూడా సిఫార్సు చేస్తారు. అయితే ఇది థైరాయిడ్ గ్రంథి పనితీరును మదింపు వేయడానికి అత్యవసరమైన పరీక్ష.
సమస్య తీవ్రతను బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. అయోడిన్ సమృద్ధిగా ఉన్న ఆహార పదార్థాలు తినడం, అయోడిన్ సప్లిమెంట్లు వాడటం వల్ల అయోడిన్ లోపాన్ని నిర్వహించుకోవచ్చు. సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్లు థైరాయిడ్ హార్మోన్లను సిఫార్సు చేస్తారు.
గొంతు భాగంలో థైరాయిడ్ ఉబ్బుతో వచ్చే గాయిటర్
అలసట, బలహీనత
బరువు పెరగడం
జుట్టు ఊడిపోవడం
చర్మం పొడిబారడం
ఏకాగ్రత కుదరకపోవడం
జ్ఞాపకశక్తి తగ్గడం
శరీర అభివృద్ధి మందగించడం