నేటితరం అమ్మాయిలు నోరు కట్టేసుకుంటున్నారు. యుక్త వయసులో.. ముక్తసరిగా తింటున్నారు. ‘పోషకాహారం.. ఆరోగ్యప్రదం’ అని న్యూట్రిషనిస్టులు ఎంత చెబుతున్నా.. టీనేజర్లు ‘లైట్’గా తీసుకుంటున్నారు. అయితే, పిల్లల నుంచి పెద్దలుగా మారే కీలక సమయమిది. ఇప్పుడు తీసుకునే ఆహారం.. నేటి ఆరోగ్యంపైనేకాదు, రేపటి అనారోగ్య సమస్యల నుంచి కూడా అమ్మాయిల్ని కాపాడుతుంది. అంతేకాకుండా.. ఈ సమయంలో వారిలో ఆకలి కూడా పెరుగుతుంది. అందువల్ల మంచి పోషక విలువలున్న ఆహారాన్ని ఎంచుకుంటేనే ఆరోగ్యానికి మంచిది.
క్యాలరీలు : కౌమార దశలో అమ్మాయిల శరీరంలో అనేక మార్పులు సంభవిస్తుంటాయి. వీరు ఆరోగ్యంగా పెరగాలంటే.. ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారం తీసుకోవాలి. 10 నుంచి 14 ఏళ్ల అమ్మాయిలకు రోజుకు 2,200 క్యాలరీలు, 15 నుంచి 18 ఏళ్ల వారికి 2,400 క్యాలరీల శక్తి అవసరం పడుతుంది. ఈ శక్తిని పొందడానికి తక్కువ కొవ్వు ఉండే మాంసాహారం, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి.
ప్రొటీన్ : చలాకీగా ఉండాల్సిన బాలికలు నీరసంగా ఉంటున్నా, చిన్నచిన్న పనులకే అలసిపోతున్నా.. ప్రొటీన్ లోపం ఉన్నట్టే! 14 నుంచి 18 ఏళ్ల వయసు గల అమ్మాయిలకు సగటున 45 నుంచి 60 గ్రాముల ప్రొటీన్ అవసరం. లేకుంటే, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, కండరాల బలహీనత, బరువు తగ్గడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. వీటినుంచి తప్పించుకోవడానికి తరచుగా చికెన్, గుడ్లు, బాదంతోపాటు పాల ఉత్పత్తులను తీసుకోవాలి.
కాల్షియం : ఎముకలు గట్టిపడే దశ ఇది. యుక్త వయసులో వాటి ద్రవ్యరాశి గరిష్ఠంగా 45 శాతానికి చేరుకుంటుంది. ఈ సమయంలో రోజుకు 1,135 మిల్లీగ్రాముల కాల్షియం అవసరం పడుతుంది. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ సిఫారసు ప్రకారం.. పాలు, జున్ను, పెరుగు, తృణధాన్యాలను రోజూవారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.
ఐరన్ : ఈ వయసులో నెలసరి వల్ల అమ్మాయిలు రక్తం ఎక్కువగా కోల్పోతారు. ఐరన్లోపం ఉంటే.. రక్తహీనతకు దారితీస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది ప్రాణాంతకంగానూ మారుతుంది. కౌమారదశలో ఉన్న ఆడపిల్లలకు కనీసం 15 మి.గ్రా. ఐరన్ అవసరం అవుతుంది. అందుకోసం ఐరన్ అధికంగా లభించే లివర్, టూనా చేప, చిక్కుళ్లు, సోయా, పాలకూర, బ్రకోలీ లాంటివి ఎక్కువగా తినడం మంచిది.
జింక్ : ఈ దశలో శరీరంలో జింక్ లోపిస్తే.. ఎదుగుదల కుంటుపడుతుంది. జుట్టు రాలడం, మొటిమలు రావడం లాంటి సమస్యలూ ఎదురవుతాయి. జింక్లోపం.. మెదడు పనితీరుపైనా ప్రభావం చూపుతుంది. అందుకే.. కావాల్సినంత ‘జింక్’ మీ శరీరంలోకి చేరాలంటే.. తృణధాన్యాలు, చిక్కుళ్లు, చేపలను ఎక్కువగా తీసుకోవాలి.
విటమిన్లు : విటమిన్ ఎ, బి6, ఇ, డి, సి, ఫోలిక్ యాసిడ్ లాంటివీ శరీరానికి సరిపడా అందేలా చూసుకోవాలి. అందుకోసం రోజువారీ ఆహారంలో మార్పులు చేసుకోవాలి.