అందివస్తున్న ఆధునిక సాంకేతికత.. ఆపదలో ఉన్న ఆడవాళ్లకు సహాయం అందిస్తున్నది. అర్ధరాత్రి వేళ విధులు నిర్వహించే మహిళలకు రక్షణగా నిలుస్తున్నది. ఈ క్రమంలోనే హర్యానా పోలీసులు.. మహిళల రక్షణ కోసం కొత్త భద్రతా ఫీచర్స్ రూపొందించారు. ప్రస్తుతం ప్రతి స్మార్ట్‌ఫోన్‌లోనూ ఉంటున్న ‘వాట్సాప్’లో సరికొత్తగా రియల్ టైమ్ ట్రాకింగ్‌ని ప్రవేశపెట్టారు.
దీన్ని ఆ రాష్ట్ర పోలీస్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్‌కు అనుసంధానించారు. మహిళా ప్రయాణికులు, ముఖ్యంగా రాత్రిపూట ఒంటరిగా ప్రయాణించే మహిళల కోసం ‘ట్రిప్ మానిటరింగ్ సిస్టమ్’ని రూపొందించినట్లు హర్యానా పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగా మహిళలు 112 నెంబర్‌కు కాల్చేసి.. వారి పేరు, మొబైల్ నెంబర్, ఎక్కడినుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ఆ ప్రయాణానికి ఎంత సమయం పడుతుంది? అనే వివరాలను పోలీసులతో పంచుకోవచ్చు.
దీంతో హర్యానా డయల్ 112 బృందం.. సదరు మహిళల లొకేషన్‌ను ట్రాక్ చేస్తుంది. వాళ్లు తమ గమ్యాన్ని చేరుకునే వరకూ వాళ్లతో కాంటాక్ట్‌లో ఉంటుంది. ఏదైనా ఆపద వచ్చిందని గుర్తించిన వెంటనే.. దగ్గర్లోని పోలీసులను అప్రమత్తం చేస్తుంది. అలా.. మహిళల రక్షణకు భరోసానిస్తుంది.