‘మంటను చూస్తే మీరు దూరంగా పరిగెడతారేమో… మేం దగ్గరగా దూసుకుపోతాం!’ అని ధైర్యంగా చెప్పగలిగే ఏకైక వర్గం మనుషులు ఫైర్ ఫైటర్లు. ఇప్పటికీ ఆ పేరు చెప్పగానే ఖాకీ రంగు డ్రెస్‌లో ఉండే మగమనిషే గుర్తొస్తాడు. కానీ ఇరవై ఏండ్ల నాడే ఆ మాటను చెరిపేస్తూ దేశ తొట్టతొలి మహిళా ఫైర్ ఫైటర్‌గా విధుల్లో చేరారు హర్షిణి కాన్హేకర్. ‘నేను యూనిఫామ్ వేసుకుంటే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్‌కి వెళ్తున్నా అని చూసినవాళ్లు అనుకున్నార’ంటూ… తన తొలినాటి ఉద్యోగ అనుభవాలను పంచుకుంటారామె.
ఇన్నాళ్లలో అగ్నిమాపక విభాగంలో ఎన్నో పదవుల్లో పనిచేసిన హర్షిణి తన స్ఫూర్తిదాయక ప్రయాణం గురించి ఆసక్తికర సంగతులెన్నో చెబుతారు. మనం ఏదైనా సాధించాలి అనుకుంటే ముందు దాని గురించి తెలుసుకోవాలి. అప్పుడే అది మనకు ఇష్టమో కాదో తెలుస్తుంది. చదువుకునే పిల్లలైనా అంతే! పెద్దయ్యాక ఏమవ్వాలి అని ఆలోచించే ముందు ఏమేం అవ్వచ్చు అన్నదీ తెలుసుకోవాలి. అప్పుడే ఎవరో వేసిన బాటలో నడవడం కాకుండా మన బాట మనమే పరచుకునే అవకాశం ఉంటుంది.
భారతదేశపు తొలి ఫైర్ ఫైటర్‌గా పేరుగాంచిన ఆమె, తొలుత ఇంజినీర్ కావాలనుకుంది. దానికి కారణం వాళ్ల నాన్న ఇంజినీర్ అవ్వడమే. అయితే సీట్ కేటాయింపులకు సంబంధించి సరైన మార్కులు రాకపోవడంతో దాన్నుంచి విరమించుకుంది. తర్వాత ఎయిర్ ఫోర్స్‌లో శిక్షణ తీసుకోవాలని ఆశపడ్డా కుదర్లేదు.. అయినా సరే యూనిఫామ్ సర్వీసుల్లో పనిచేయాలన్న పట్టుదల ఆమెను దేశంలోనే ప్రత్యేక మహిళగా నిలబెట్టింది.
విద్యార్థిగా ఉండగా హర్షిణి ఎన్సీసీ క్యాడెట్‌గా పనిచేసింది. ప్రత్యేకమైన దుస్తులు ధరించి, క్రమశిక్షణతో చేసే ఆ పని ఆమెను ఎంతో ఆకట్టుకుంది. అదే సమయంలో దేశపు తొలి మహిళా ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా విదర్భ ప్రాంతానికి చెందిన శివాని కులకర్ణి ఎంపికయ్యారు. ఆమె గురించి పేపర్లో చదివింది హర్షిణి. ఎలాగైనా తాను కూడా యూనిఫామ్ ధరించే ఆఫీసర్ అవ్వాలని నిశ్చయించుకుంది. దాంతో ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ… ఈ మూడిటిలో ఏదో ఒక దాంట్లో చేరాలని అనుకుంది. అందుకోసం గణితం, రసాయన భౌతిక శాస్ర్తాలు చదవాలని తెలుసుకుని కాలేజీలో ఆ సబ్జెక్టులే తీసుకుంది.
ముఖ్యంగా తాను కూడా మహిళా పైలట్ అవ్వాలని కలలు కన్నది. ఎయిర్ ఫోర్స్‌లో చేరేందుకు రెండు ఎంట్రన్స్ టెస్ట్‌లు ఉండేవి. కానీ అందులో ఆమె ఉత్తీర్ణత సాధించలేకపోయింది. ఇక, తనకు ప్రపంచమే లేదనిపించిందామెకు. కంటికి మింటికి ధారగా ఏడ్చింది. కొన్నాళ్లకు కోలుకుని, బ్లూ యూనిఫామ్ చేజారితే ఖాకీకి ప్రయత్నించవచ్చు కదా అనుకుంది.
ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం ట్రైనింగ్ తీసుకోవడం ప్రారంభించింది. కెప్టెన్ చింతామణ్ చాపేకర్ అప్పట్లో సర్వీస్ సెలెక్షన్ బోర్డుకు (ఎస్ఎస్బీ) నాగ్‌పూర్‌లో శిక్షణ ఇచ్చేవారు. ఆ సమయంలోనే ఆసియాలోనే అతిపెద్ద మెడికల్ కాలేజీ, అందులోనే ఆసియాలోని ఏకైక నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజీ (ఎన్ఎఫ్ఎస్సీ) నాగ్‌పూర్‌లోనే ఉందంటూ చెప్పారాయన. దీంతో హర్షిణికి ఆ కాలేజీలో చదవాలన్న ఆసక్తి ఏర్పడింది. ఎంతో కష్టపడి అందులో సీటు సంపాదించింది.
ఫైర్ సర్వీస్ కాలేజీలో చేరేనాటికి అక్కడ చదువుకున్న వాళ్లలో హర్షిణే తొలి ఆడపిల్ల. అడ్మిషన్ ఫామ్ నింపడానికి వెళ్లినప్పుడు, నీకేమైనా పిచ్చా… ఇది మగపిల్లల కాలేజీ అంటూ అక్కడి అభ్యర్థులు గేలిచేశారు. కానీ హర్షిణి తండ్రి ఆమెకు అండగా ఉన్నారు. మెడికల్ టెస్ట్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్లినప్పుడు… మంట, ధూళి దగ్గర గంటల తరబడి నిలబడి పనిచేయగలవా… అంటూ డాక్టర్లూ అడిగారట. ఆమె ధైర్యంగా సమాధానం ఇచ్చిందట. అలాగే అగ్నిమాపక విభాగంలో పనిచేయడానికి ట్రక్ నడపడమూ అత్యవసరం.
అందుకే ట్రక్ డ్రైవింగ్ కూడా నేర్చుకుంది. అప్పుడూ అందరూ ఆమెను విచిత్రంగానే చూశారట. తరగతిలో అయితే ఒకే ఒక్క ఆడపిల్ల ఆమె. అగ్నిమాపక దళ సభ్యురాలిగా ఖాకీ డ్రెస్ వేసుకుంటే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్‌కి వెళుతున్నానేమో అనుకునేవారంటూ చెబుతుందామె. మొత్తానికి ఫైర్ సర్వీసెస్‌లో శిక్షణ పొంది ప్రభుత్వ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాసెస్ సంస్థ (ఓఎన్జీసీ)లో ఉద్యోగంలో చేరింది. రెండు దశాబ్దాలకు పైగా వివిధ స్థాయుల్లో పనిచేసి జనరల్ మేనేజర్ గ్రేడ్‌కి చేరుకుంది.
ఆ విధంగా ఆమే తొట్టతొలి మహిళా ఫైర్ ఫైటర్. ‘మా పనిలో నీళ్లు చల్లేందుకు, నీటిని లాగేందుకు పెద్ద పెద్ద పైపులు ఉంటాయి. వాటిని సరిగ్గా పట్టుకోవడం, లాగడం లాంటివి చేయాలి. ఆ బరువుల్ని మోసేందుకు ముందు స్టోర్ రూమ్‌లో ప్రాక్టీస్ చేసేదాన్ని. లేకపోతే అమ్మాయిలకు అవసరమా అంటూ గేలి చేస్తారు. అలా అవ్వకూడదంటే మనం మరింత కష్టపడాలి. ఇక, నన్ను మా కాలేజీలో అగ్నిమాపక దళ కిరణ్ బేడీ అని మా లెక్చరర్లు పిలవడం చాలా గొప్పగా అనిపించేది’ అంటూ తన విజయ రహస్యాలను, ఆనందాలను పంచుకుంటూ ఉంటుంది హర్షిణి. నిజంగానే ఆమె ఫైర్ లేడీ కదూ!