ప్రస్తుతం తెలుగుతో పాటు బాలీవుడ్లో కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది మరాఠీ భామ మృణాల్ ఠాకూర్. తమిళ అగ్ర హీరో ధనుష్‌తో ఆమె ప్రేమలో ఉందని గతకొంతకాలంగా రూమర్స్ వస్తున్నాయి. మృణాల్ ఠాకూర్ నటించిన ‘సన్ ఆఫ్ సర్దార్-2’ స్క్రీనింగ్షోకు ధనుష్ హాజరుకావడం, ఆ వేదికపై తారలిద్దరూ సన్నిహితంగా ఉండటంతో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. తాజాగా వీటిపై మృణాల్ ఠాకూర్ స్పందించింది. ధనుష్ స్క్రీనింగ్షోకు ఎందుకు వచ్చారో కారణాల్ని వివరించింది. ‘ధనుష్‌కు నేను పెద్ద అభిమానిని.
‘అసురన్’ సినిమాను ఎన్నోసార్లు చూశాను. ఏ పాత్రలోనైనా ఆయన అద్భుతంగా ఒదిగిపోతారు. నటనతో పాటు గీత రచయితగా, గాయకుడిగా, డైరెక్టర్‌గా బహుముఖ ప్రజ్ఞ ఆయన సొంతం. ‘తేరే ఇష్క్ మే’ షూటింగ్ సందర్భంగా ధనుష్‌ని కలిసి ‘సన్ ఆఫ్ సర్దార్-2’ స్క్రీనింగ్‌కి వస్తారా?’ అని రిక్వెస్ట్ చేశాను. నా అభ్యర్థనను మన్నించి ఆయన రావడం ఎంతో సంతోషంగా అనిపించింది. ధనుష్ నాకు మంచి మిత్రుడు. అంతకుమించి ఏమీ లేదు. అవకాశం వస్తే ఆయనతో కలిసి పనిచేయాలనుకుంటున్నా’ అని చెప్పుకొచ్చింది మృణాల్‌ఠాకూర్.