Women’s Day | గువ్వలా ఎగరాలనీ… నింగిని తాకాలనీ ఆశపడే ఆడపిల్లలెందరో. చదువులో ర్యాంకులు, కళాశాలలో పట్టాలు మొట్టమొదట ఒడిసి పట్టేదీ వాళ్లే. ముద్దార నేర్పిస్తే ముదితలు నేర్వలేని విద్య లేదని కవీంద్రులు చెప్పిన మాట అక్షర సత్యమే. అయితే జీవితం అన్నిటినీ ముద్దుగా నేర్పదు. పడేశాకే పరుగెలా పెట్టాలో చెబుతుంది. చిన్ననాటి ఆ విషయాన్ని పెద్దయ్యాక కూడా గుర్తుంచుకోవాలి. మనకెదురయ్యే సవాళ్లను ఒడుపుగా అధిగమించడం తెలుసుకోవాలి. విద్యాలయం బయటికొచ్చాక కావాల్సిన నైపుణ్యాలు వేరు. అవే బతుకు పోటీలో ర్యాంకుల్ని కట్టబెడతాయి. ఆకాశపుటంచులు అందుకొనేందుకు రెక్కలవుతాయి. ఎదగాలన్న కోరిక ఉన్న ఆడపిల్లగా, మరి మీకున్నాయా… ఆ రెక్కలు!
ఉద్యోగం, వ్యాపారం… మనం ఎంచుకున్న వృత్తి ఏదైనా సరే పని చేసేటప్పుడు కాన్ఫిడెంట్‌గా కనిపించడం చాలా ముఖ్యం. అప్పుడే ఎదుటివారు మనల్ని నమ్మగలుగుతారు. మనం ఎంత సమర్థులమైనా సరే, అది మన మాటలో, హావభావాల్లో సుస్పష్టంగా కనిపించకపోతే మనం ఆ పనిలో విజయాన్ని సాధించడం కష్టమవుతుంది. ముఖ్యంగా ఆఫీసుల్లో పెద్ద ప్రాజెక్టులు, వ్యాపారాల్లో పెద్దమొత్తంలో సొమ్ములు మనచేతిలో పెట్టాలంటే మనం అందుకు తగ్గ మనిషిలా అనిపించాలి, అలాగే కనిపించాలి. అందుకు ముందుగా మనల్ని మనం నమ్మడం ముఖ్యం. మన సమర్థతకు మనమే కొన్ని పరీక్షలు పెట్టుకుంటూ వాటిని దాటుతూ వెళితే మన మీద మనకు భరోసా వస్తుంది. ఎన్ని పరీక్షలు ఎదుర్కొంటే అంత గట్టిపడతాం. అదే మనల్ని మరోమెట్టు ఎక్కేలా చేస్తుంది. అందుకే గడపదాటే ముందు తప్పనిసరిగా ధరించాల్సిన ఆభరణాల్లో ధైర్యాన్నీ చేర్చుకోవాలి.
పుస్తకం చదవాలంటే ముందు మనం అక్షరం నేర్వాలి. అలాగే వృత్తిలో రాణించాలంటే కొన్ని నైపుణ్యాలు పెంచుకోవాలి. ఇంగ్లిష్ అవసరం అయినచోట దాన్ని స్పష్టంగా ఆత్మవిశ్వాసంతో మాట్లాడగలిగేలా సాధన చేయాలి. దానిమీద పట్టు సాధించాలి. మనమేంటో ఎదుటివాళ్లకు తెలియజేసేది మన మాటే. అందులో తడబడ్డామంటే ఎంత సబ్జెక్ట్ ఉన్నా అవతలి మనుషులకు అది తెలిసే అవకాశం లేదు. అలాగే చదువు పూర్తయ్యాక ఆఫీసులో పనిచేయడానికి కొన్ని కంప్యూటర్ లాంగ్వేజ్‌లు అవసరం అవుతాయి. కొన్ని ప్రాజెక్టులు పూర్తిచేయాల్సి ఉంటుంది. వాటిని ప్రాక్టికల్ పద్ధతిలో పూర్తిచేసి బయటికి వస్తే సులభంగా ఉద్యోగ వ్యాపారాల్లో రాణించవచ్చు. అక్కడి యుద్ధానికి ఇవే ప్రధానమైన ఆయుధాలు మరి!
ఎవరైనా కంఫర్ట్‌జోన్ నుంచి బయటికి రావడానికి అంతగా ఇష్టపడరు. కానీ దాన్నుంచి బయటపడి కాస్త రిస్క్ తీసుకోగలిగిన వాళ్లే విజయం సాధించిన వాళ్లలో ముందు ఉంటారన్నది తిరుగులేని నిజం. ఆడపిల్లలమంటూ అనవసరమైన అడ్డుగోడలు పెట్టుకోకుండా, కాస్త ముందుకువచ్చి పనుల్లో భాగస్వాముల కాగలిగితే ముఖ్యమైన వ్యక్తులుగా మీకు తప్పకుండా గుర్తింపు లభిస్తుంది. మనకు చేతగాని విషయాన్ని చూసి నేర్చుకోవడం, చేతనైన పనిని చొరవగా తీసుకోవడం… రెండూ ఇక్కడ ముఖ్యమే. అలా కాకుండా, మనకు తెలిసిన పనిని కాస్త అలవాటైన చోటే ఉండి చేయాలనుకుంటే మనల్ని మనం ఎదుగుదలకు దూరం చేసుకున్నట్టే. ఇప్పుడు మీరు కూర్చున్న చోటు కూడా అంతకుముందు మీకు కొత్తదే అన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.
గాసిపింగ్ అన్నది ఓ నెగెటివ్ వైబ్రేషన్ అంటాడు ‘గుడ్ వైబ్స్’ పుస్తక రచయిత వెక్స్ కింగ్. ఒక మనిషిని చూస్తే లేదా వాళ్ల చుట్టుపక్కల ఉంటే ఎలాంటి అనుభూతి కలుగుతుంది అనేదే వైబ్ అన్నమాట. అక్కడ మంచి వైబ్ ఉంది బ్రో… అని కొన్ని ప్రదేశాల గురించి చెప్పినా అదే అర్థం. మనం తినే ఆహారానికీ, మన ఆలోచనలకూ కూడా ఈ వైబ్ ఉంటుందంటాడు రచయిత. అందులో, గాసిప్.. అంటే ఒకరి గురించి లేనిపోనివి మాట్లాడుతూ ఉండటం, ప్రచారం చేయడంలాంటివి బ్యాడ్ వైబ్ లేదా నెగెటివ్ వైబ్ కిందికి వస్తుందంటాడు. నిజంగానే కూడా గాసిపింగ్ చేయడం అన్నది అస్సలు మంచి విషయం కాదు. వ్యక్తుల పరోక్షంలో వారి గురించి మాట్లాడటం ఆఫీసుల్లో ఒక్కొక్కసారి మనకు ఇబ్బందుల్నీ తెచ్చిపెట్టే అవకాశం ఉంది.
నలుగురిలో మెదిలేటప్పుడు హుందాగా మన పని మనం చేసుకుపోవడమే తప్ప ఇలాంటి ప్రచారాల్లో తలదూర్చకపోవడమే మంచిది. ఒకవేళ అలాంటి సందర్భం ఎదురైనా తప్పించుకునే ప్రయత్నం చేయాలి. మన పై అధికారి లేదా సహచరులు మనల్ని ఇబ్బంది పెట్టేలా మాట్లాడితే నేరుగా వారితోనే దాన్ని చర్చించండి. అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో కనుక్కొనే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయమూ చెప్పండి. అలా కాకుండా మీ ఫీలింగ్స్ ఇతరులతో పంచుకుంటే అది వక్రమార్గంలో వారికి చేరి, అపార్థం మరింత పెరిగే ప్రమాదం ఏర్పడుతుంది.