సీజన్ ఏదైనా సరే జామపండు మార్కెట్లో దొరుకుతుంది. వేరే పండ్లతో పోలిస్తే ధర కూడా అందుబాటులో ఉంటుంది. శరీరానికి అవసరమైన పోషకాలు కూడా మెండు. జామలో విటమిన్ ఎ, సి, బి2, ఇ, కె, ఫైబర్, మాంగనీస్, పొటాషియం, ఐరన్, ఫాస్పరస్ సమృద్ధిగా ఉంటాయి. ప్రతిరోజూ జామపండు తింటే ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతారు. జామతో ఆరోగ్యం మాత్రమే కాదు.. అందం కూడా సొంతమవుతుంది.
జామపండు ఫేస్‌ప్యాక్‌తో ముఖంపై చర్మం మృదువుగా మారుతుంది. ఇందులో ఉండే లైకోపీన్, క్వెర్సెటిన్, విటమిన్ సి.. శరీరంలో ఉత్పత్తి అయ్యే ఫ్రీ రాడికల్స్‌ను బ్యాలెన్స్ చేసే యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రిస్తాయి.
జామలో తేనె కలిపి ప్యాక్ తయారు చేసుకోవాలి. చర్మవ్యాధులను తగ్గించడంలో తేనె బాగా పనిచేస్తుంది. ఈ ప్యాక్‌తో చర్మానికి సరిపడా తేమ అందుతుంది. మచ్చలు తగ్గి, స్కిన్ టోన్ మెరుగవుతుంది. తేనెలోని సహజ యాంటీమైక్రోబియల్, యాంటీఫంగల్, యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమల సమస్యల్ని దూరం చేస్తాయి. చర్మంపై ఉండే రంధ్రాల నుంచి మృతకణాలను, దుమ్ము, ధూళిని తొలగించి బ్యాక్టీరియాని చంపి, ఎండ కారణంగా వచ్చే మచ్చల్ని దూరం చేస్తాయి.
జామపండును శుభ్రంగా కడిగి గుజ్జు తీసి మిక్సీలో వేసి ముద్దగా చేసుకోవాలి. అందులోనే శనగపిండి, తేనె వేసి కలపాలి. ముఖాన్ని శుభ్రంగా కడిగి.. ఆ పేస్ట్‌ను ఐప్లె చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. దీనివల్ల ముఖం కాంతిమంతంగా, మృదువుగా తయారవుతుంది. మొటిమల బాధ దూరమవుతుంది. పొడిచర్మం ఉన్నవారికి ఈ ప్యాక్ బాగా పనిచేస్తుంది. అయితే, చర్మం మరీ పొడిగా ఉంటే మాత్రం శనగపిండి కలపకూడదు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి, ఎవరైనా సరే ఈ ప్యాక్ వేసుకోవచ్చు. జామపండు బదులు, జామ ఆకులతో కూడా ఈ ప్యాక్ తయారు చేసుకోవచ్చు.