దీపావళి వచ్చిందంటే ఇంటింటా మహాలక్ష్ములు దీపాల్ని సిద్ధం చేసుకుంటారు. ఇల్లంతా అందంగా అలంకరించి, దివ్వెలు వెలిగించి పండుగ సందడిని పదింతలు చేస్తారు. మరి, వర్చువల్ వరల్డ్ సంగతేంటి? డిజిటల్ తెరపై దీపావళి వెలుగులు ఏం లేవా? ఒకసారి.. మీ వర్క్ చేసే ల్యాపీనో, స్మార్ట్ఫోనో చేతిలోకి తీసుకోండి. గూగుల్ దీపావళి సెలెబ్రేషన్స్‌లో పాల్గొనండి. అందుకు మీరేం చేయాలంటే? క్రోమ్ సెర్చింజన్ ఓపెన్ చేసి Diwali అని టైప్ చేయండి.
వచ్చిన సెర్చ్ రిజల్ట్స్‌లో మొదటే పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఓ గ్రాఫిక్ ప్రత్యక్షమవుతుంది. దాంట్లోనే ఓ దీపం యానిమేట్ అవుతూ కనిపిస్తుంది. ఒకసారి దానిపై క్లిక్ చేయండి. అంతే.. తెర మొత్తం కాస్త చీకటై.. వరుసగా దీపాలు ప్రత్యక్షమవుతాయి. వెలుగుతున్న దీపంతో మిగతా అన్ని దీపాల్ని మీరే వెలిగించాలి. దీప ప్రజ్వలన కాగానే తెర మొత్తం ప్రకాశవంతంగా మారిపోతుంది. సో.. వర్చువల్ సెలెబ్రేషన్ బాగుంది కదూ! ఈ ఆటవిడుపును దోస్తులకు కూడా షేర్ చేయొచ్చు. అందుకు షేర్ బటన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి పలు ఫార్మాట్లలో షేర్ చేయొచ్చు.