అతివల అలంకరణలో ఆభరణాలదే పైచేయి. ప్రత్యేకించి బంగారం, వెండి, ప్లాటినం మెరుపులను మగువలు మరింత ఇష్టపడతారు. ఆ లోహాలకు కొత్త సొగసులద్దుతూ రాళ్లు, రత్నాలు పొదిగిన ఆభరణాలు ధరించి మెరిసిపోతారు, మురిసిపోతారు. ఆ తళుకులన్నీ కలగలిసినట్టు, విభిన్న లోహాల మేళవింపుగా.. బంగారం మెరుపునకు వెండి సొగసులు జతచేసిన సరికొత్త నగలు వచ్చేశాయి. ‘మిక్స్డ్ మెటల్ జువెలరీ’ దీపావళి సీజన్లో హల్చల్ చేస్తున్నది.
బంగారం అంటే గుర్తొచ్చేది పచ్చని పసిమి. వెండి పేరు చెప్పగానే పండు వెన్నెలకు ఘనరూపం ఇచ్చినట్టు ధవళకాంతులేవో కండ్లముందు కనిపిస్తాయి. ఈ రెండు లోహాల మిశ్రమంతో వస్తున్నవే.. మిక్స్డ్ మెటల్ ఆభరణాలు. సాధారణ నగలతో పోలిస్తే చాలా భిన్నంగా కనిపిస్తాయి. కళాత్మకంగానూ అనిపిస్తాయి. కాబట్టే, ఈతరం మహిళలు వీటిపై ఆసక్తి చూపుతున్నారు. రోజువారీ నగలనుంచి భారీ ఆభరణాల వరకూ రకరకాల డిజైన్లలో ‘మిక్స్డ్’ జువెలరీకి ప్రాణం పోస్తున్నారు.
ధర తక్కువ
తక్కువ ధరలోనే భారీ ఆభరణాలు ధరించాలని ఆశ పడేవారికి ఇవొక వరం. కొద్దిమొత్తంలో బంగారం, ఎక్కువ మొత్తంలో వెండి జోడిస్తే చాలు. అదనంగా రోజ్ గోల్డ్‌ను కూడా ఈ నగలకు జతచేస్తున్నారు. దీంతో మువ్వన్నెలు సమకూరుతున్నాయి. వజ్రాలు, రాళ్లు, రత్నాలు పొదిగిన కంఠాభరణాలు, ఉంగరాలు, బ్రేస్లెట్లు, గొలుసులు.. ఇలా రకరకాల ‘మిక్స్డ్’ ఆభరణాలు అందుబాటులో ఉన్నాయి. ఈతరం ఫ్యాషన్లకు నప్పేలా సన్నని గొలుసులు, ఆకర్షణీయమైన పెండెంట్లు, హ్యాంగింగ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
వీరాభిమానులు
దీపిక పదుకొణె, కృతిసనన్లాంటి బాలీవుడ్ సెలెబ్రిటీలు ‘మిక్స్డ్ జువెలరీ’ వీరాభిమానులు. ఆమ్రపాలి లాంటి ప్రఖ్యాత బ్రాండ్స్ కూడా మిశ్రమ ఆభరణాల తయారీలో చురుకైన పాత్ర పోషిస్తున్నాయి. కొందరు ఫ్యాషన్ కాంతలు రెండు లోహాల మిశ్రమంతో తయారు చేసిన నగలను కాకుండా.. ఓ వెండి గాజు, రెండు బంగారు గాజులు.. ఓ వెండి ఉంగరం, పక్కనే వజ్రపుటుంగరం.. ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ పద్ధతిలో అలంకరించుకుని మెరిసి
పోతున్నారు. కాకపోతే, ఆ జోడింపులో బ్యాలెన్స్ ఉండేలా జాగ్రత్తపడితే చాలు. ‘సంప్రదాయమైన డిజైన్‌లోని బంగారు ఆభరణాన్ని, ఆధునిక డిజైన్‌తో రూపొందించిన వెండినగతో కలిపి ధరిస్తే.. ఎబ్బెట్టుగా ఉంటుంది. సాధ్యమైనంత వరకూ డిజైన్లను కలగాపులగం చేయకపోవడమే మంచిది’ అంటారు దివాసింగ్ అనే జువెలరీ ఎక్స్పర్ట్.