Heart Disease | మహిళల గుండె.. ఓ నిశ్శబ్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. హృదయ సంబంధ వ్యాధుల కారణంగా.. ఆడవాళ్లలో మరణాల రేటు ఆందోళనకరంగా పెరిగిపోతున్నది. భారత మహిళల్లో 16.9 శాతం మరణాలకు గుండె అనారోగ్యమే కారణమని ‘గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్’ డేటా తేల్చింది. అన్నిరకాల క్యాన్సర్ల కంటే.. గుండె జబ్బులతోనే (Heart Disease) మహిళల్లో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇందుకు ప్రధానకారణం.. మహిళల్లో హృద్రోగాలపై సరైన అవగాహన లేకపోవడమేనట! వైద్య నిపుణులు కూడా మహిళల గుండె ఆరోగ్యాన్ని అంత సీరియస్గా తీసుకోవడంలేదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఆడవాళ్లలో కనిపించే చిన్నచిన్న లక్షణాలను ప్రారంభదశలో గుర్తించడంలో వైద్యులు పొరబడుతున్నారనీ, దీర్ఘకాలంలో అక్యూట్ కరోనరీ సిండ్రోమ్ వంటి పరిస్థితులకు దారితీస్తుందని చెబుతున్నారు. దీని ప్రభావంతో గుండెకు రక్త ప్రవాహం అకస్మాత్తుగా తగ్గిపోతుంది. ఫలితంగా, గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మహిళల్లో గుండె సంబంధ వ్యాధుల లక్షణాలు.. చాలా భిన్నంగా కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందులోనూ ఎక్కువ నొప్పి లేకుండానే గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.
ఇక మహిళలు మానసిక ఒత్తిడి కారణంగానే ఎక్కువగా ఛాతీ నొప్పిని అనుభవిస్తారట. అంతేకాకుండా.. పని ఒత్తిడిలో అసౌకర్యంగా ఉండటం, అలసట, అజీర్ణం వంటి లక్షణాలను అంతగా పట్టించుకోరు. వీటిని సాధారణ సమస్యలుగానే భావిస్తారు. కానీ, ఇవన్నీ గుండెపోటుకు ముందు కనిపించే లక్షణాలేనని నిపుణులు చెబుతున్నారు. ఇక ‘మెనోపాజ్’కు చేరుకున్న వారిలోనూ గుండె వ్యాధుల ప్రమాదం పెరుగుతుందని అంటున్నారు. అందుకే, చిన్నచిన్న అసౌకర్యాలను అలక్ష్యం చేయొద్దని, వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నారు. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని చెబుతున్నారు.