రామ్-జెనీలియా జంటగా 2008లో వచ్చిన ‘రెడీ’.. బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్గా.. ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చి, బాక్సాఫీస్‌ను బద్దలుకొట్టింది. ఇందులో జెనీలియా.. ‘పూజ’ పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. దక్షిణాదిలో ఘనవిజయం సాధించిన రెడీ చిత్రం.. అదేపేరుతో బాలీవుడ్లో రీమేక్ అయ్యింది. అందులో సల్మాన్ ఖాన్ హీరో కాగా, ‘పూజ’ పాత్రను సీనియర్ నటి అసిన్ పోషించింది. అప్పటికే బాలీవుడ్లో కొన్ని సినిమాలు చేసిన జెనీలియా.. రెడీ హిందీ రీమేక్‌లో నటించకపోవడంపై తాజాగా స్పందించింది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘రెడీ’ సినిమాల సంగతులను పంచుకున్నది. “దక్షిణాదిలోనే కాదు.. హిందీలోనూ ‘రెడీ’ చిత్రం ఘనవిజయం సాధించింది. తెలుగులో నా పాత్రకు మంచి పేరొచ్చింది. హిందీలోనూ చేద్దామనుకున్నా! కానీ, దర్శకనిర్మాతలు నన్ను సంప్రదించలేదు. అయినా.. అది నా సినిమా! దక్షిణాదిలో నన్ను స్టార్ హీరోయిన్గా నిలబెట్టిన సినిమా. అందుకే, బాలీవుడ్లో అవకాశం రాకపోయినా నాకు బాధగా అనిపించలేదు” అని చెప్పుకొచ్చింది.
ఇక సల్మాన్ ఖాన్‌లాంటి అగ్రనటుడి సరసన నటించే అవకాశం చేజారడంపైనా జెనీలియా స్పందించింది. “ఏమో.. సల్మాన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి వేరే ఏదైనా సినిమా ‘రెడీ’గా ఉందేమో!” అంటూ చెప్పింది. తెలుగులో ‘రెడీ’ మొత్తం నవ్వుల జల్లులా సాగుతుంది. బాలీవుడ్లో రీమేక్ అయినప్పుడు.. హంగులు, ఆర్భాటాలతోపాటు మరిన్ని మసాలా వైబ్స్ జతకలిశాయి. 2011లో విడుదలైన హిందీ వెర్షన్.. పండుగ సీజన్ కాకపోయినా, మంచి వసూళ్లు రాబట్టింది.
ఇక జెనీలియా సినిమాల విషయానికి వస్తే.. 2003లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘బాయ్స్’తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అదే ఏడాది వచ్చిన ‘సత్యం’తో టాలీవుడ్‌కు మరింత దగ్గరైంది. రామ్‌చరణ్, ఎన్టీఆర్, వెంకటేశ్, అల్లు అర్జున్, నితిన్, రానా వంటి స్టార్ హీరోల సరసన నటించింది. తాజాగా.. బాలీవుడ్ అగ్రనటుడు ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ‘సితారే జమీన్పర్’లో కథానాయికగా నటించింది.