న్యూఢిల్లీ: భారత సైన్యం మాజీ అధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకానికి ప్రచురణ సంస్థగా ఉన్న ‘పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా’కు ఢిల్లీ స్పెషల్ పోలీస్ సెల్ బుధవారం నోటీసులు జారీచేసింది.
చైనా బలగాలతో సైన్యం పోరాటానికి సంబంధించి పలు వివాదాస్పద అంశాలను ప్రస్తావిస్తూ నరవణే రాసిన ఈ పుస్తకం ఆన్లైన్లో ఎలా అందుబాటులోకి వచ్చిందని నోటీస్‌లో పోలీసులు ప్రశ్నించారు. ఆ పుస్తకాన్ని ఇప్పటిదాకా ముద్రించలేదని, ఆన్లైన్ వేదికలపై ప్రత్యక్షమైనవన్నీ అనధికార కాపీలుగా పెంగ్విన్ ఇప్పటికే స్పష్టతనిచ్చింది.