Valentines Day | జెన్-జెడ్‌గా పేరున్న ఈతరం సరికొత్తగా ఆలోచిస్తున్నది. చదువు మొదలుకొని కెరీర్ వరకూ.. ప్రతీది కొత్తగానే ఉండాలని కోరుకుంటున్నది. ప్రేమ విషయంలోనూ ‘జెన్-జెడ్’ తీరు కొత్తగానే ఉంటున్నది. ముఖ్యంగా.. ‘వాలెంటైన్స్ డే’పై నవతరం ఆలోచనా దృక్పథం.. విభిన్నంగా కనిపిస్తున్నది. ఒకప్పుడు ‘వాలెంటైన్స్ డే’ అంటే.. మధ్యాహ్నం పార్కుల్లో కలుసుకోవడం, సాయంత్రం సినిమాలు, రాత్రిపూట క్యాండిల్ లైట్ డిన్నర్లు! లేకుంటే.. క్లబ్‌లు, డిస్కోలు, పార్టీలు! కొన్నేళ్లుగా ‘ప్రేమికుల దినోత్సవం’ ఇలానే జరుగుతున్నది. కానీ, ‘జెన్-జెడ్’ మాత్రం.. ప్రేమను అనేక రూపాల్లో వ్యక్తం చేయడానికి, ఈ వేడుకను ఓ వేదికగా మార్చుకుంటున్నది. సంప్రదాయానికి భిన్నంగా ఈ రోజును జరుపుకొంటున్నది. ప్రేమికుల రోజున బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం.. వీరికి అంతగా నచ్చడం లేదు. ఖరీదైన ఆభరణాలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, పూల బొకేలు..
ఇవన్నీ ఓల్డ్ ఫ్యాషన్ అని వాళ్ల ఫీలింగ్. ఎందుకంటే.. వీరు బహుమతులను కూడా డిజిటల్ రూపంలోనే చూస్తున్నారు. ‘స్పాటిఫై’లో ఇష్టమైన ప్లేలిస్ట్.. కస్టమైజ్ చేసిన డిజిటల్ ఆర్ట్.. క్యూరేటెడ్ మీమ్స్.. ఇవే వీరి వాలెంటైన్ బహుమతులు. ప్రేమించిన వ్యక్తి మనసు తెలుసుకొని, వారి భావోద్వేగాలకు అనుగుణంగా బహుమతులు ఇస్తున్నారు. సోషల్ మీడియాతోపాటు ఎదిగిన ఈతరం వాలెంటైన్ డే వేడుకలకూ ఆన్లైనే వేదిక. ఇన్‌స్టా రీల్స్, ఫేస్‌బుక్‌లలో పోస్టులతోనే నవ ప్రేమికులు సంబురాలు చేసుకుంటున్నారు. అంతేకాదు, వీరు అన్నిరకాల ప్రేమలనూ కోరుకుంటారు. ఫ్యామిలీ లవ్, సెల్ఫ్ లవ్, సోషల్ లవ్.. ఇలా అన్నిటికీ సమాన ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రేమ, భావోద్వేగాలను కేవలం బాయ్‌ఫ్రెండ్/ గర్ల్‌ఫ్రెండ్ నుంచే కాకుండా.. అందరినుంచీ పొందవచ్చని చెబుతున్నారు.