‘జిమ్‌కు ఎందుకు వెళ్తున్నావ్?’ అని ఎవరినైనా అడిగితే.. స్లిమ్ కావడానికనో.. కండలు పెంచడానికనో సమాధానం చెప్పడం సహజం. కానీ, నేటి యంగ్ తరంగ్‌లు దీనికి భిన్నంగా స్పందిస్తున్నారు. ‘ఫిట్నెస్ కోసం మాత్రమే కాదు.. ఫ్రెండ్షిప్ కోసం కూడా’ అని చెబుతున్నారు. జిమ్‌లో కేవలం చెమటలు కక్కడమే కాదు.. చనువుగా మాటలూ కలుపుతున్నారు. కండలు మాత్రమే కాదు.. నెట్వర్క్ కనెక్షన్లూ పెంచుకుంటున్నారు. ‘ఫిట్నెస్.. ఫ్లెక్సింగ్.. ఫ్రెండ్షిప్’ అన్నీ కలిపి జెన్ జెడ్ కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతున్నది.
ఆన్లైన్లో దొరికే దోస్తుల కన్నా.. జిమ్‌లో కలిసే ఫ్రెండ్ బెస్ట్ అంటున్నది నేటి తరం. ఇతర వేదికల్లో పరిచయాలైన తర్వాత.. అభిరుచులు కలిస్తేనే స్నేహం చిగురించే అవకాశాలు ఉంటాయి. అదే జిమ్ స్నేహాల్లో అందరి కామన్ మంత్రం ఫిట్నెస్. అభిరుచులు కలిసిన తర్వాత అభిప్రాయాలు కలవడం ఎంతసేపు? అందుకే, జిమ్ స్నేహాలు ఇటీవల తెగ వర్కవుట్ అవుతున్నాయని పలు డేటింగ్ యాప్‌లు నిర్వహించిన సర్వేల్లో తేటతెల్లమైంది. డేటింగ్ యాప్ బంబుల్ ‘ఫిట్నెస్ సెంట్రిక్ డేట్స్’ కోసం క్యాంపెయిన్లు కూడా మొదలుపెట్టింది. వీళ్లు నిర్వహించిన ఓ సర్వేలో 52 శాతం జెన్ జెడ్ ఇండియన్ సింగిల్స్.. ఫిట్నెస్ సెంట్రిక్ డేట్‌కి ఆసక్తి చూపిస్తున్నారట. 95 శాతం మంది ‘స్పోర్ట్స్ ఫస్ట్ డేట్’కి ఓటేస్తున్నారట. తమ పార్ట్నర్కు గానీ, ఫ్రెండ్‌కు గానీ ఆటలపై మోజు లేకుంటే 44 శాతం మంది వారితో ‘డీల్ బ్రేకప్’ అని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారట. అంతేకాదు, వర్కవుట్ ప్లేస్‌లో చిగురించిన స్నేహాలు.. యువతను జిమ్‌కు ఉత్సాహంగా వెళ్లడానికి ప్రేరణగా నిలుస్తున్నాయట కూడా!
2024లో స్పోర్ట్ అండ్ ఫిట్నెస్ యాప్ స్ట్రావా విడుదల చేసిన ‘ఇయర్ ఇన్ స్పోర్ట్’ సర్వే రిపోర్ట్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 58 శాతం మంది తమకు జిమ్‌లో కొత్త ఫ్రెండ్ కలిశారని చెప్పుకొచ్చారు. ఇక ప్రతి ఐదుగురిలో ఒకరు తమ వర్కవుట్ ఫ్రెండ్‌తో డేటింగ్‌కు కూడా వెళ్తున్నారని వెల్లడైంది. వీరిలో కొందరు కొంగుముడి కూడా వేసుకుంటున్నారట. పబ్ కన్నా.. జిమ్‌లో ఏర్పడే పరిచయాలు సురక్షితం, సున్నితం, ఉపయోగకరం అని ఈ జనరేషన్ భావిస్తున్నది. జిమ్‌లు కొందరికి డేటింగ్‌కు దారి చూపితే.. మరికొందరికి కెరీర్ నెట్వర్కింగ్ హబ్‌లా పనిచేస్తున్నాయి. ‘నా జిమ్ ఫ్రెండ్ ద్వారా నాకు జాబ్ రిఫరల్ కూడా వచ్చింది’ అని హ్యాపీగా పోస్టు చేస్తున్నారు పలువురు.
నయా జనరేషన్ ఆసక్తులను గమనించిన జిమ్ నిర్వాహకులు తమ కార్యకలాపాల్లో మార్పులు తీసుకొస్తున్నారు. కల్ట్‌ఫిట్ లాంటి సంస్థలు క్లయింట్స్ కోసం గ్రూప్ వర్కవుట్స్ అందిస్తున్నాయి. మైక్రో ఈవెంట్లు, జాయింట్ వర్కవుట్స్, టీమ్ బేస్డ్ ఇలా రకరకాల చాలెంజెస్‌ని పరిచయం చేస్తున్నాయి. జిమ్‌లో చిగురించిన బంధాలు మరింత బలపడటానికి క్రాఫ్ట్ వర్క్‌షాప్స్, మారథాన్స్, పెయింటింగ్ సెషన్స్ కూడా నిర్వహిస్తున్నాయి. అందుకే, జిమ్ అంటే తమకు రొటీన్ కాదనీ, రిలేషన్స్‌కు వారధి అని భావిస్తున్నారు యువతీయువకులు. కలిసి వర్కవుట్ అయినప్పుడు కలిసి జీవించేందుకు ఇష్టపడుతున్నారు. ట్రెడ్‌మిల్‌పై పరుగులు తీస్తూ… ట్రెండింగ్‌గా పార్ట్నర్ని వెతుక్కుంటున్నారు. మొత్తంగా జిమ్ బాట పట్టినవారు ఫిట్నెస్ సంపాదించుకోవడంతో పాటు బోనస్‌గా సామాజికంగా యాక్టివ్‌గా మారుతున్నారు. ఈ ట్రెండ్‌ను మనమూ స్వాగతిద్దాం!!