అందానికి తొలి శత్రువులు మొటిమలు. సెబాషియస్ గ్రంథులు ఉత్పత్తి చేసే అదనపు నూనె వల్ల ఈ సమస్య వస్తుంది. వెల్లుల్లి సాయంతో మొటిమలను అధిగమించవచ్చు.
వెల్లుల్లి: వెల్లుల్లికి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియాను నివారించడంలో సాయపడతాయి. వెల్లుల్లిలోని సల్ఫర్ సమ్మేళనాలు మొటిమలను అరికడతాయి.
వెల్లుల్లి-పెరుగు: పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. పెరుగుకు వెల్లుల్లిని జతచేసి మొహానికి పూస్తే మృతకణాలు తొలగిపోతాయి. చర్మం కాంతిమంతం అవుతుంది.
వెల్లుల్లి-వెనిగర్: వెనిగర్‌లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మంపై వాపును తగ్గిస్తాయి. వెల్లుల్లి రెబ్బలను మెత్తగా నూరి, దాంట్లో వెనిగర్ కలపాలి. ఆ మిశ్రమాన్ని పూసుకుని.. కొద్దిసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
వెల్లుల్లి-కలబంద: కలబందలో సుగుణాలు అనేకం. చర్మం ఎర్రబడటం, దురద తదితర సమస్యలకు కలబంద మంచి ఔషధంగా పనిచేస్తుంది. వెల్లుల్లి రెబ్బలను దంచి రసం తీయాలి. దానిని తాజా కలబంద జెల్‌తో కలిపి చర్మానికి పట్టించాలి. పదిహేను నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.
వెల్లుల్లి-గుడ్డుసొన: గుడ్డులోని తెల్లసొనలో ప్రొటీన్లు, ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి చర్మ రంధ్రాలను చైతన్యమంతం చేస్తాయి. తెల్లసొనలో వెల్లుల్లి పేస్ట్ కలిపి దానిని మొటిమల మీద రాయాలి. ఆరిన తర్వాత శుభ్రమైన నీటితో కడిగేయాలి.
వెల్లుల్లి-ఆలివ్ ఆయిల్: వెల్లుల్లి పేస్ట్‌లో ఆలివ్ ఆయిల్ కలిపి మొటిమలు ఉన్నచోట పూసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.