ధర్మారం/రామడుగు/ఇల్లంతకుంట రూరల్, సెప్టెంబర్ 27: కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2 పరిధిలో గోదావరి జలాల ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. ఈ నెల 4 నుంచి 12వ తేదీ వరకు మోటర్లను నడిపి మూడురోజుల విరామం ఇవ్వగా, మళ్లీ ఈ నెల 15 నుంచి 24 వరకు రెండు మోటర్ల ద్వారా ఎత్తిపోతలు కొనసాగించారు. ఇటీవల కురిసిన వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద రావడం.. బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేయడం, మాజీ మంత్రి హరీశ్‌రావు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాయడంతో స్పందించిన ప్రభుత్వం మోటర్ల సంఖ్య పెంచింది.
ఈ నెల 25న పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలోని నంది పంప్‌హౌస్‌లో నాలుగు మోటర్ల ద్వారా 12,600 క్యూసెకులు, 26న 5 మోటర్లను నడిపించి 15,750 క్యూసెకుల నీటిని ఎత్తిపోశారు. ఆదివారం నంది పంప్‌హౌస్‌లో ఒక మోటర్‌ను నిలిపివేసి నాలుగు మోటర్ల ద్వారా 12,600 క్యూసెకులు ఎత్తిపోయగా, అక్కడి నుంచి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్‌హౌస్‌కు తరలించారు. అక్కడి నాలుగు బాహుబలి మోటర్లను ఆన్ చేసి శ్రీరాజరాజేశ్వర (మిడ్‌మానేరు) జలాశయానికి తరలించారు.
ఈ నెల 15 నుంచి ఇప్పటి వరకు 5.5 టీఎంసీల నీటిని మిడ్‌మానేరుకు తరలించినట్టు అధికారులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ పంప్‌హౌస్ ద్వారా మూడు పంపుల నుంచి ఆదివారం ఉదయం 5 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనంతగిరి అన్నపూర్ణ రిజర్వాయర్‌లోకి 8,511 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోశారు. అక్కడి నుంచి సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలంలోని రంగనాయకసాగర్ రిజర్వాయర్‌లోకి 3,300 క్యూసెక్కుల నీటిని తరలించారు.