వరుస వానలతోపాటు గాలిలో చల్లదనం కూడా పెరిగింది. ఈ సమయంలోనే వాతావరణ మార్పు వల్ల వచ్చే జలుబు, దగ్గు, కఫంతో సతమతం అవుతుంటారు చాలామంది. ఉపశమనం కోసం దవాఖాన మెట్లు ఎక్కకుండా.. ఈ సహజమైన చిట్కాలు పాటించండి.
ఉదయాన్నే తాగండి: ప్రకృతి మనకు ఇచ్చిన అద్భుతమైన మూలికలు తులసి, అల్లం, మిరియాలు. వీటిని కలిపి చేసిన కషాయం జలుబు, దగ్గులను నయం చేసే అద్భుతమైన మందుగా పనిచేస్తుంది. ఉదయం పూట వీటితో చేసిన ఒక కప్పు కషాయం తాగడం వల్ల జలుబు నుంచి ఉపశమనం లభించడంతోపాటు ఇమ్యూనిటీ పెరుగుతుంది.
గొంతు రక్షణకు: తేనెలో అల్లం రసం కలిపి రోజుకు రెండుసార్లు తాగితే చాలు గొంతు నొప్పి తగ్గి, దగ్గు క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ఇది యాంటి బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగిన సహజ రక్షణ కవచంలా పనిచేస్తుంది.
తక్షణ ఉపశమనం: ముకు బ్లాక్ అయినప్పుడు వేడి నీటిలో పుదీనా లేదా నీలగిరి ఆకులు వేసి ఆవిరి పీల్చండి. దీనివల్ల శ్వాస సులభం అవుతుంది. గొంతులో పేరుకుపోయిన కఫం తీవ్రత తగ్గుతుంది.
హెల్దీ హాట్ డ్రింక్స్: రెగ్యులర్ టీకి బదులు అల్లం టీ, దాల్చిన చెక టీ, తులసి టీ వంటి నేచురల్ డ్రింక్స్ చలివేళలో బాగా పనిచేస్తాయి. ఇవి చలిని తగ్గించి శరీరాన్ని చురుకుగా ఉంచుతాయి.
ఇవీ పాటించండి: పై చిట్కాలు పాటిస్తూనే చల్లని నీళ్లు, ఐస్ క్రీమ్స్ వంటి చల్లని పదార్థాలకు దూరంగా ఉండండి. వర్షంలో తడిసిన వెంటనే పొడి బట్టలు వేసుకోవాలి. మంచి నిద్రతో పాటు వేడిగా ఉన్న ఆహారాన్ని మాత్రమే తినండి.