వంటల్లో ఉపయోగించే రకరకాల నూనెలు.. ఆరోగ్యానికి మంచి కన్నా చెడే ఎక్కువ కలిగిస్తాయి. అనేక పరిశోధనలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయి. అందుకే, ఆరోగ్యంపై శ్రద్ధ చూపేవారు నూనెలను అల్లంత దూరం పెడతారు. వాటిని అనుమానాస్పద దృష్టితోనే చూస్తారు. అయితే, శరీరానికి మేలుచేసే నూనెలు కూడా కొన్ని ఉన్నాయి. గుండె ఆరోగ్యం మొదలుకొని, పోషకాహారం వరకు.. మీ శారీరక, మానసిక ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. అందులో ముఖ్యమైనది.. చేప నూనె. దీని ప్రయోజనాలు అనేకం. నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రకారం.. చేప నూనెలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికశాతం లభిస్తాయి. ముఖ్యంగా, సాల్మన్, మాకేరెల్, ట్యూనా, హెర్రింగ్, సార్డిన్ వంటి చేపలలో ఈ ఒమేగా-3 ఎక్కువగా ఉంటుంది. ఇది, మన ఆరోగ్యానికి ఎన్నోరకాలుగా ఉపయోగపడుతుంది. మూత్రపిండాల వైఫల్యంతో డయాలసిస్ తీసుకుంటున్నవారిలో హృదయ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
ఇలాంటివారు చేప నూనె సప్లిమెంట్లు తీసుకోవడం ద్వారా.. గుండె జబ్బుల ప్రమాదం 43 శాతం తగ్గినట్లు న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైన పరిశోధన వెల్లడించింది. గుండెపోటు, స్ట్రోక్, వాస్క్యులర్ సమస్యలను తగ్గించే సుగుణాలు.. ఫిష్ ఆయిల్లో ఉన్నట్లు తేల్చింది. ఇక చేప నూనె సప్లిమెంట్లు తీసుకోవడం ద్వారా.. మధుమేహం నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో గ్లూకోజ్‌ను తగ్గించడంలో ఇవి సాయపడతాయి. చేప నూనెలోని ఔషధ గుణాలు.. మెదడు అభివృద్ధి, పనితీరును మెరుగుపరుస్తాయి. బాధ, అసంతృప్తి, భయం, అసహనం, ఉద్రిక్తత లాంటి మానసిక లక్షణాలను తగ్గిస్తాయి. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ.. కీళ్లు, ఎముకలు బలహీనపడతాయి. నొప్పికి గురవుతాయి. ఇలాంటి సందర్భంలో ఆరోగ్యకరమైన చేప నూనెలను తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఆస్టియో ఆర్థరైటిస్ నొప్పులు, సమస్యలను ఫిష్ ఆయిల్ సప్లిమెంటేషన్ తగ్గిస్తుందని చెబుతున్నారు.