నేటితరంలో చాలామంది కాలేజీ క్యాంపస్ నుంచే.. కొలువులు కొట్టేస్తున్నారు. డిగ్రీ పట్టాకు ముందే.. ఆఫర్ లెటర్ పట్టేస్తున్నారు. ఇక ఉద్యోగం వచ్చింది కదా! అని కొందరు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో నిరాసక్తంగా ఉంటున్నారు. కాలేజీ పుస్తకాలతో వచ్చిన జ్ఞానంతోనే.. ఉద్యోగంలో నెట్టుకొస్తున్నారు. ఈ క్రమంలో కొత్త ఉద్యోగులు.. సరికొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నారు. కెరీర్లో ముందుకు సాగలేక.. ఉన్నచోటే ఉండిపోతున్నారు. ఇలాంటి వ్యవహార శైలి.. భవిష్యత్తును దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉంటేనే.. కెరీర్ కూల్‌గా సాగిపోతుందని సలహా ఇస్తున్నారు.
ఉద్యోగం రావడంతోనే చాలామంది రిలాక్స్ అయిపోతుంటారు. కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి ఆసక్తి చూపించరు. సీనియర్లు, లెక్చరర్లతో మాట్లాడటం, కొత్త విషయాలను చర్చించడం ఆపేస్తారు. ఇలా చేయడం వల్ల.. వారి ఉద్యోగ భవిష్యత్తు అక్కడితోనే ఆగిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా నిత్య విద్యార్థిగానే ఉండాలని సలహా ఇస్తున్నారు. ఉద్యోగం రావడం ఎంత ముఖ్యమో.. అక్కడ నిలదొక్కుకోవడం కూడా అంతే ముఖ్యం. అందుకోసం కొత్తకొత్త సాంకేతికతలను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి.
తాము ఎంచుకున్న రంగంలో అనుభవం ఉన్నవారితో ఎప్పుడూ టచ్‌లో ఉండాలి. కెరీర్‌కు సంబంధించిన సలహాలు, సూచనలు తీసుకోవాలి. ఆ రంగంలో వస్తున్న కొత్తకొత్త మార్పులు గురించి తెలుసుకుంటూ, సంబంధిత నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి. అదే రంగంలో ఉన్న స్నేహితులతో సరికొత్త నెట్వర్క్ ఏర్పరుచుకోవాలి. ఇందుకోసం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను ఉపయోగించుకోవాలి. ఇక మరికొందరు ఉద్యోగంపై అసంతృప్తితో ఉన్నా.. అందులోనే కొనసాగుతుంటారు. ఇలాంటివారు కూడా మరో రంగాన్ని ఎంచుకోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కొత్త కెరీర్లో నిలదొక్కుకోవడానికి కొంత సమయం పట్టినా.. దీర్ఘకాలంలో మంచి ఫలితాలు పొందవచ్చని అంటున్నారు.