మా భూములు మాకేనని హెచ్‌సీయూ విద్యార్థులు మర్లబడ్డారు. పోలీసులు లాఠీలతో విరుచుకుపడుతున్నారు. బంతిని ఎంత బలంగా తన్నితే అంతెత్తుకు లేచినట్టే… ఎంతటి నిర్బంధం ప్రయోగిస్తే.. అంతకంతా ప్రతిఘటిస్తున్నది తెలంగాణ. ప్రకృతి వైవిధ్యం, జీవవైవిధ్యం ఉన్న కంచె గచ్చిబౌలి వనాన్ని కాపాడుకుందాం అంటున్నారు విశ్రాంత ప్రొఫెసర్, రామన్ మెగసెసే అవార్డ్ గ్రహీత ప్రొఫెసర్ శాంతా సిన్హా. ఆ నేల, ఆ అడవి విశేషాలు, ఆ కానతో అక్కడి ప్రజలకు ఉన్న అనుబంధాన్ని ‘జిందగీ’తో ఇలా పంచుకున్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నేచర్ క్లబ్ ఉండేది. ఇంగ్లిష్ ప్రొఫెసర్ సుధాకర్ మరాఠే దానిని ప్రారంభించారు. ఈ క్లబ్ తరఫున నెలనెలా ఒక న్యూస్ లెటర్ వచ్చేది. చేతితో రాసిన ఆ న్యూస్ లెటర్లో హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఉన్న వృక్ష జాతులు, చేపలు, తాబేళ్లు, కీటకాలు, జంతువులు, పాములు, పక్షులు, వలస పక్షుల గురించి చాలా ఆసక్తిగా రాసేవారు. చీమల నుంచి దుప్పుల దాకా ఎన్నో రకాల జంతువుల గురించి అందులో ఆయన చక్కగా తెలియజేసేవారు. అవన్నీ చదువుతుంటే ఇవన్నీ చూడాల్సిందేననే ఆసక్తి కలిగేది. నేచర్ క్లబ్ ఆధ్వర్యంలో నెలనెలా నేచర్ వాక్ ఉండేది. మా పిల్లల్ని వెంటబెట్టుకుని నేచర్ వాక్‌కి వెళ్లేది. చాలామంది ఉద్యోగులు, వాళ్ల పిల్లల్ని తీసుకుని వచ్చేవాళ్లు. స్టూడెంట్స్ కూడా జాయిన్ అయ్యేవాళ్లు. అందరం అక్కడ ఆహ్లాదంగా తిరుగుతూ రకరకాల చెట్ల గురించి తెలుసుకున్నాం. రకరకాల పక్షుల్ని గమనించాం. ఆ రోజుల్లో జరిగిన బర్డ్ వాచ్‌లో యాభై తొమ్మిది రకాల పక్షుల్ని గుర్తించాం. అందులో వలస పక్షులూ ఉన్నాయి. ఆ తర్వాత కాలంలో అక్కడ ఎనభై రకాల పక్షులు ఉంటున్నట్టుగా తేలింది. బర్డ్ వాచ్‌కి వెళ్లడం వల్ల పక్షుల్ని లెక్కగట్టడం అలవాటైంది.
హైదరాబాద్ విశ్వవిద్యాలయం చుట్టుపక్కల గ్రామాల్లో ఒకప్పుడు కట్టు బానిసత్వం ఉండేది. ముఖ్యంగా దళితులు, కొంతమంది ఇతర కులాల పేదలు జీతం చేసేవాళ్లు. వాళ్లకు రోజుకు అయిదు రూపాయల కూలీ వచ్చేది. ఇది చాలా తక్కువ మొత్తం. వాళ్లు ఆ పని కాదని వేరే పనికి పోలేరు. చిన్న మొత్తంలో అప్పు ఇచ్చి, అది తీరేదాకా యజమాని పని చేయించుకునేవాడు. స్వేచ్ఛ రాజ్యాంగ హక్కు. దానికి వ్యతిరేకంగా ఉన్న కట్టుబానిసత్వాన్ని ప్రభుత్వం నిషేధించింది. అలా పని చేయించుకోవడం నేరం. అయినా గ్రామాల్లో ఆ అమానుషం అమలవుతూనే ఉండేది. ఆ సందర్భంలోనే శ్రామికుల్లో చైతన్యం పెంపొందించేందుకు హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో శ్రామిక్ విద్యాపీఠం ఏర్పాటైంది. దానికి నన్ను డైరెక్టర్‌గా నియమించారు. అప్పుడు హెచ్‌సీయూ చుట్టుపక్కల ఉండే అయిదారు గ్రామాల్లో ఎంతమంది జీతగాళ్లు (కట్టు బానిసలు) ఉన్నారో సర్వే చేశాం. వాళ్లకు చట్టాల గురించి అవగాహన కల్పించాం. మేమింక జీతాలు చేయమని వాళ్లంతా ఒక్కటయ్యారు. జీతం (కట్టు బానిసత్వం) నుంచి విముక్తి కల్పించాలని వాళ్లందరితో కలెక్టర్‌కి దరఖాస్తు చేయించాం. ఈ చట్టం ద్వారా జీతం నుంచి విముక్తితోపాటు అప్పు కూడా రద్దయిపోయింది. అలా విముక్తి పొందిన దళితులకు ఊళ్లో ఉపాధి లేకుండా చేశారు. వాళ్లకే కాదు ఆ కుటుంబాల ఆడవాళ్లను పొలం పనుల్లో పెట్టుకోవట్లేదని తెలిసింది. ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఆ మహిళల్ని కలిశాం. వాళ్లకు ఉపాధి కల్పించడం గురించి మాట్లాడుతుంటే.. ‘అమ్మా.. యూనివర్సిటీలో గడ్డి ఉంది. ఆ గడ్డిని అమ్ముకుని బతుకుతాం’ అని అడిగారు.
ఊరి జనం చెప్పిన జాడల్లో గడ్డిని చూసి ఆశ్చర్యపోయాం. ఆరు అడుగుల పొడవైన గడ్డి ఉంది. దాన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయానికి తీసుకుపోయి ‘ఈ గడ్డి విలువేమిటి? ఇందులో ఏముంటాయి?’ అని చెప్పమన్నాం. ‘ఇది చాలా శ్రేష్ఠమైన గడ్డి. ఆసియాలోనే ఇలాంటి గడ్డి దొరకడం అరుదు. దక్కన్ పీఠభూమిలో తప్ప మరెక్కడా లేని ఈ గడ్డిలో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. గుర్రాలు దీనిని ఇష్టంగా తింటాయి’ అని వ్యవసాయ విశ్వవిద్యాలయం రిపోర్ట్ ఇచ్చింది. ఈ గడ్డిని ఎక్కడ అమ్మాలి? ఎవరు కొంటారనే సందేహాలొచ్చాయి. గుర్రాలను పెంచేవాళ్లు ఎక్కడెక్కడున్నారో ఆరా తీశాం. వాళ్లకు గడ్డిని అమ్మేందుకు మహిళలు లేబర్ కో ఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాం. దీని ద్వారా గడ్డి అమ్ముకున్నారు. చుట్టుపక్కల దళిత మహిళలతోపాటు మరికొంతమందికి ఉపాధి లభించింది. మూడేండ్ల తర్వాత నా పదవీ కాలం ముగిసింది. ఆ తర్వాత కూడా యూనివర్సిటీ పేదలకు అన్నం పెట్టింది.
ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజలదే. అది ప్రజలకే ఉపయోగపడాలి. వందల ఏండ్ల నుంచి ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వ సంస్థలే ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ఇది మనదేశంలో కొనసాగుతున్న సంప్రదాయం. భూమి సరుకు కాదు, వనరు. భూమిని ఎవరూ తయారు చేయలేరు, పెంచలేరు. పరిమితమైన వనరును బాధ్యతగా ఉపయోగించాలి. ప్రభుత్వ స్థలాల్లో చేపట్టే అభివృద్ధి అందరికీ అందుబాటులో ఉండేదై ఉండాలి. ప్రభుత్వాలకు ఆదాయం లేకుంటే ప్రజల భూమిని అమ్ముతామనడం తప్పు. ఆదాయం కావాలంటే ఉత్పత్తిని పెంచాలి. చట్ట సభల్లో నిధుల ఖర్చు కోసం చర్చించినంత సమయం కూడా భూముల వినియోగం కోసం చర్చ జరగట్లేదు. ఇది మన వ్యవస్థలోని లోపం. ఇప్పటికే హైదరాబాద్ ఎన్నో సహజ వనరుల్ని కోల్పోయింది. అడవులు, చెరువులు పోయాయి. రేపటి తరాల కోసం ఉన్నవాటినైనా కాపాడుకోవాలి. వీటిని కాపాడేలా నగర ప్రణాళిక ఉండాలి. అంతేకానీ సహజ వనరుల్ని నాశనం చేసేలా ఉండకూడదు.
యూనివర్సిటీ విద్యాబోధనకు, జ్ఞాన వికాసానికి దోహదపడే ప్రజల సంస్థ. ఇది మేధావులను తయారుచేసే కేంద్రం. ఇక్కడున్న భూమి ప్రజలకే ఉపయోగపడాలి. ఇక్కడ అసంఖ్యాకమైన జీవజాతులు ఉన్నాయి. ముఖ్యంగా వాటి గురించి సర్వే చేయాలి. వాటిని కాపాడుకోవాలి. ప్రభుత్వాలు తాత్కాలిక ప్రయోజనాల కోసం కాకుండా దీర్ఘకాల ప్రయోజనాల కోసం పనిచేసేలా చట్టాల్లో మార్పులు చేయాలి. అభివృద్ధి పేరుతో సహజ వనరుల్ని బలిపెట్టవద్దు. ఈ తప్పు చేస్తున్నవాళ్లకు అది తప్పని కూడా తెలియట్లేదు. దూరదృష్టి లోపించింది. సేవ్ హెచ్‌సీయూ.
హైదరాబాద్ యూనివర్సిటీ ఏర్పాటు కాకముందు ఆ భూమి స్థానిక ప్రజలకు జీవనోపాధి కల్పించేది. అడవిలో కట్టెలు ఏరుకునేవాళ్లు. బర్లను, మేకలను, గొర్రెల మందలను మేపేవాళ్లు. అందులో చాలా చెరువులు ఉన్నాయి. గ్రామదేవత దగ్గర ఏడాదికోసారి జాతర జరుపుకొనేవాళ్లు. ఆ జాతరకు ఊరిజనంతోపాటు ఆడబిడ్డలు, బంధువులు ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్లు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఏర్పాటు వల్ల రెండు వేల మూడు వందల ఎకరాల విస్తీర్ణంలోని అడవికి, నల్లగండ్ల, వట్టినాగులపల్లి, గోపనపల్లి మరికొన్ని ఊళ్లకు మధ్య అడ్డుగోడ ఏర్పాటైంది. దానివల్ల వాళ్లు ఉపాధి కోల్పోయారు. అంతటితో ఆ అడవితో ఉన్న సాంస్కృతిక అనుబంధం తెగిపోయింది.