వాళ్లకు ఏం చేతకాదు.. ఏ పనీరాదు.. దివ్యాంగుల విషయంలో చాలామందికి ఉండే అభిప్రాయం! ఆ ఉద్దేశం తప్పని.. అవకాశం కల్పిస్తే, దివ్యాంగులు దివ్యంగా పనిచేస్తారని నిరూపించింది ‘యూత్ ఫర్ జాబ్స్’. లక్షలాది మందిని వైకల్యం గీసిన పేదరిక వలయం నుంచి బయటపడేసింది ఈ సంస్థ. సుమారు ఐదున్నరల లక్షల మంది దివ్యాంగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించింది. పెట్రోల్ బంకులో బాయ్ నుంచి అమెజాన్‌లో అయిదంకెల జీతాల కొలువుల దాకా వీళ్లు కుదురుకున్నారు. ఇలా వైకల్యాన్ని లక్షలసార్లు ఓడించిన ఘనత ‘యూత్ ఫర్ జాబ్స్’ నాయకురాలు మీరా షెనాయ్కే దక్కుతుంది. ఎన్నో అంతర్జాతీయ అవార్డులు గెలిచిన ‘యూత్ ఫర్ జాబ్’ ఆరంభానికి ప్రేరణ నుంచి స్ఫూర్తిమంతమైన విజయగాథ ఆమె మాటల్లోనే…
Meera Shenoy | ఇరవై ఏళ్ల క్రితం.. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి మార్గాలు లేవు. పట్టణ ప్రాంతాల్లో ఉండే అవకాశాల గురించి అవగాహన లేక యువత ఊళ్లలోనే ఉండిపోయేది. నిరుద్యోగం, పేదరికం వల్ల దయనీయమైన జీవితం గడిపేవాళ్లు. నగరాల్లోని పరిశ్రమలు, కంపెనీల్లో చిన్నస్థాయి ఉద్యోగాలు ఉండేవి. అయితే, గ్రామీణ యువతకు వాటి గురించి సరైన అవగాహన ఉండేది కాదు. జీవన నైపుణ్యాలు కూడా లేకపోవడం అదనపు సమస్య. గ్రామాలకు టీవీ మరింత దగ్గరయ్యాక సుదూరమైన ప్రపంచం కనిపించింది. ఉద్యోగాలు చేయాలనే ఆశలు వారిలో కలిగాయి.
ఉపాధి వారధి
ఉద్యోగాలు కోరుకునే గ్రామీణ యువతకు ఉపాధి కల్పించడం కోసం ఉమ్మడి రాష్ట్రంలో.. అప్పటి ప్రభుత్వం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మార్కెటింగ్ మిషన్ (ఈజీఎంఎం) ఏర్పాటు చేసింది. గ్రామీణ, ఆదివాసీ యువతకు వృత్తి నైపుణ్యాల శిక్షణ, ఉపాధి కల్పన ఈజీఎంఎం ప్రధాన లక్ష్యం. దీనికి బాధ్యత వహించాల్సిందిగా ప్రభుత్వం నన్ను కోరింది. నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఈజీఎంఎం ప్రారంభమైంది. గ్రామీణ, ఆదివాసీ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు దేశంలోనే మొదటి కార్యక్రమం ఇది. పట్టణాల్లోని రిటైల్, హాస్పిటల్, ఫార్మా రంగాల్లో ఉద్యోగాలున్నాయి. గ్రామాల్లో నిరుద్యోగులు ఉన్నారు. కానీ, మధ్యలో ఓ అగాధం. గ్రామీణ యువతకు శిక్షణ ఇస్తే ఈ ఉద్యోగాలు వాళ్లకు వస్తాయి. ఎక్కడ ఏ అవకాశాలు ఉంటే దానికి సంబంధించిన నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చాం. గ్రామాల్లోని మహిళా స్వయం సహాయక (డ్వాక్రా) సంఘాల సహకారంతో గ్రామీణ యువతకు ఈజీఎంఎం నైపుణ్య శిక్షణ మొదలుపెట్టింది. ఉద్యోగాలు ఇప్పించింది. ప్రైవేటు సంస్థలు, కంపెనీల్లో పని చేయడానికి అవసరమైన కంప్యూటర్ కోర్సులు, సాఫ్ట్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ నేర్పించేవాళ్లం. రాష్ట్ర వ్యాప్తంగా 200 శిక్షణా కేంద్రాలను నిర్వహించాం. ఆరేండ్లలో లక్ష మందికిపైగా శిక్షణ పొందారు. ఆ తర్వాత ఈజీఎంఎం నుంచి బయటికి వచ్చాను. ఏ లక్ష్యం కోసం ఈజీఎంఎం పని చేసిందో, అదే లక్ష్యం కోసం ఆగ్నేయాసియాలో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో పేదరిక నిర్మూలన కార్యక్రమం చేపట్టింది. భౌగోళిక, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరుగా శిక్షణ ఇచ్చాం. ఆ సమయంలోనే అప్పటి భారత ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కి స్కిల్ డెవలప్మెంట్ సలహాదారుగా ఉన్న రామదొరైతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఆయన దగ్గర పనిచేసిన రెండేండ్లలో దేశమంతా తిరిగాను.
గెలిచే దారి
రామదొరై దగ్గర పనిచేస్తున్న కాలంలో ఏ ఊరికి వెళ్లినా కనీసం అయిదారుగురు దివ్యాంగులు కనిపించేవాళ్లు. అవకాశం ఉన్నంత వరకు చదువుకొని ఇంటిపట్టునే ఉండేవారు. చాలామంది వాళ్లను ఎందుకూ కొరగానివారిగా చూసేవాళ్లు, ఇంట్లోవాళ్లే భారంగా భావించేవాళ్లు. రామదొరై దగ్గర పని ముగిసిన తర్వాత వికలాంగులకు ఉపాధి కల్పన కోసం ‘యూత్ ఫర్ జాబ్స్’ ప్రారంభించాను. ‘వైకల్యం వల్ల ఉద్యోగం రాదు’ అనే భ్రమలో ఉన్న వికలాంగులు మాకు తారసపడేవారు. ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించమని అడుగుతుండేవారు. కానీ, వాళ్ల సామర్థ్యం వాళ్లే గుర్తించరు. బయటి అవకాశాల గురించి అవగాహన ఉండదు. వికలాంగులు స్వతంత్రంగా, సంతోషంగా, ఆత్మగౌరవంతో బతకడం కోసం యూత్ ఫర్ జాబ్స్ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని జూబ్లీహిల్స్‌లో ప్రారంభించాం. చిన్న భవనంలో ఆఫీస్, శిక్షణ నడిచేవి.
దేశమంతటా సేవలు..
ఒక గ్రామంలో ఒకరికి ఉద్యోగం ఆ ఊరంతా తెలిసేది. చుట్టుపక్కల ఊళ్లకు తెలిసిపోయేది. ఆ తర్వాత మాపై నమ్మకంతో వాళ్ల పిల్లలను వెంటబెట్టుకుని తల్లిదండ్రులు వచ్చేవాళ్లు. పన్నెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ శిక్షణ అన్ని జిల్లాలకు విస్తరించింది. తెలుగు రాష్ర్టాలు దాటి భారత దేశమంతటా సేవలు అందిస్తున్నది. దేశవ్యాప్తంగా 57 శిక్షణా కేంద్రాలను నిర్వహిస్తున్నాం. ఇప్పుడు ఆఫ్‌లైన్‌లోనే కాకుండా ఆన్‌లైన్‌లోనూ ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇప్పటి వరకు 5 లక్షల 60 వేల మంది దివ్యాంగులను మా సంస్థ కలిసింది. వారందరికీ శిక్షణ ఇచ్చాం. ఉద్యోగం, ఉపాధి కల్పించాం. వికలాంగుల కోసమే ఒక జాబ్ పోర్టల్ నిర్వహిస్తున్నాం. దీనికి ఏఐ టెక్నాలజీని అనుసంధానించాం. అంధులకు ఇది జాబ్ నోటిఫికేషన్స్‌ని వినిపిస్తుంది. వినలేనివాళ్లకు సైన్ లాంగ్వేజ్‌లో చూపిస్తుంది. దక్షిణాసియాలో ఏఐ టెక్నాలజీతో ఇలాంటి సేవను అందుబాటులోకి తెచ్చాం. రెండేండ్లలో లక్షా ఎనభైవేల మంది ఇందులో పేర్లు నమోదు చేసుకున్నారు. మా కృషికి భారత రాష్ట్రపతి ‘నేషనల్ అవార్డ్ ఫర్ ది ఎంప్లాయ్మెంట్ ఆఫ్ డిజెబిలిటీ’ అవార్డు ప్రదానం చేశారు. మసాచుసెట్స్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, హార్వర్డ్ యూనివర్సిటీలు అవార్డులు ఇచ్చాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్‌లో ‘మీరా షెనాయ్ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ రూరల్ ట్రైబల్ డిజేబుల్ యూత్ ట్రైనింగ్’ అని ప్రశంసించడం గొప్ప అనుభూతిని ఇచ్చింది.
జీవితకాలం ఇతరులపై ఆధారపడి బతకకుండా తమకాళ్లపై తాము నిలబడేలా దివ్యాంగులు ఉద్యోగం లేదా వ్యాపారం చేసేలా ప్రోత్సహించేవాళ్లం. ఇప్పటికీ ఇది కొనసాగుతున్నది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వారితో దరఖాస్తు చేయిస్తున్నాం. బహుళజాతి కంపెనీలు, భారీ పరిశ్రమలు, చిన్న పరిశ్రమలను సంప్రదించినప్పుడు ‘మాకు కావాల్సిన పని చేయగలిగితే చాలు’ ఎవరికైనా ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చాయి. ఆ ఉద్యోగాలు ఇప్పించడం కోసం దివ్యాంగులకు సంబంధిత కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నాం. వీరిలో చాలామంది ఇంటర్, డిగ్రీ చదివిన వాళ్లు ఉంటారు. వాళ్లకు యూత్ ఫర్ జాబ్స్ ఆధ్వర్యంలో కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ కోర్సులు, సాఫ్ట్‌స్కిల్స్, సోషల్ మీడియా, యాప్స్ వినియోగించడం నేర్పుతున్నాం. బాగా చదువుకున్న వాళ్లు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించేలా ప్రోత్సహిస్తున్నాం. పలు కంపెనీల ప్రతినిధులు మా కేంద్రానికి వస్తుంటారు. మా దగ్గర శిక్షణ పొందిన వాళ్ల నైపుణ్యం చూసి ‘అరె ఎంతబాగా చేస్తున్నారు!’ అని ఆశ్చర్యపోతుంటారు.