వేసవి సెలవులు ఇచ్చేశారు. ఈ రెండు నెలలూ.. పిల్లలు ఇంటికే పరిమితం అవుతారు. ఎండల భయానికి బయటికి వెళ్లలేరు. దాంతో, చిన్నారులంతా ‘స్క్రీన్’లకే అతుక్కుపోతారు. రోజంతా స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లు, టీవీలు చూస్తూ గడిపేస్తారు. అందులోనూ అధికశాతం మంది కార్టూన్స్కే కళ్లప్పగించి.. యానిమేషన్ మాయా ప్రపంచంలో విహరిస్తుంటారు. అయితే.. ఇలా కార్టూన్స్ ఎక్కువగా చూసే పిల్లల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే.. వారి ఎదుగుదలపైనా ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కార్టూన్స్.. ఈ కదిలే బొమ్మలు ఈనాటివి కావు. వందేళ్ల క్రితం నుంచే తెరపై సందడి చేస్తున్నాయి. అయితే.. కొన్నాళ్ల ముందువరకూ వీటిని కేవలం టీవీల్లో మాత్రమే చూసేవారు. కానీ, నేటితరం మాత్రం టీవీతోపాటు కంప్యూటర్లు, ట్యాబ్లు, స్మార్ట్ఫోన్లు.. ఇలా అనేక రకాల గ్యాడ్జెట్లలో వీక్షిస్తున్నారు. ఇలా నిత్యం కార్టూన్స్ చూస్తూ గడపడం.. పిల్లలకు ఏమాత్రం మంచిది కాదు.
కార్టూన్స్ ఎక్కువగా చూసే పిల్లల మానసిక ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అలాంటివాళ్లు దేనిపైనా శ్రద్ధ పెట్టలేరు. ఎక్కువసేపు ఫోన్, ట్యాబ్, టీవీలు చూస్తూ ఉండటం వల్ల నిద్రలేమి వేధిస్తుంది.
బయటి ఆటలకు దూరం కావడం వల్ల శారీరక సమస్యలు మొదలవుతాయి. దాంతో ఇట్టే బరువు పెరుగుతారు. దృష్టి సమస్యలూ పలకరిస్తాయి.
ఎక్కువగా ఇష్టపడే కార్టూన్ పాత్రలను పిల్లలు అనుకరిస్తారు. నిజ జీవితంలోనూ వారిలాగే ఉండాలని అనుకుంటారు. పాజిటివ్ పాత్రలను ఆదర్శంగా తీసుకుంటే ఫర్వాలేదు.. కానీ, పిల్లలు చెడుకే ఎక్కువగా ఆకర్షితులు అవుతారు. మరి, మీ పిల్లలు ఎవరిని ఫాలో అవుతున్నారో ఓ కంట కనిపెడుతూ ఉండండి.
హింసాత్మక ధోరణిలో వస్తున్న కార్టూన్స్ పెరుగుతున్నాయి. తుపాకులు, కత్తులు వాడే కార్టూన్స్ చూస్తూ.. అలాంటి బొమ్మలే కావాలని మారాం చేస్తారు. వాటితో ఆడుతూ.. ‘నిన్ను కాల్చేస్తా.. నిన్ను పొడిచేస్తా!’ అంటూ హింసా ప్రవృత్తికి అలవాటుపడే ప్రమాదం ఉంటుంది. అలాంటి కార్టూన్స్పై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.
టీవీల్లో కార్టూన్స్, రైమ్స్ ఎక్కువగా చూసేవారిలో మాటలు రావడం ఆలస్యం అవుతుంది. దాంతో.. చాలామంది పిల్లలు సైగలకే పరిమితం అవుతున్నారు. భాషాభివృద్ధి ఆలస్యమై.. చదువులోనూ వెనకబడుతుంటారు.