రొమ్ము క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడంలో కృత్రిమ మేధ అద్భుతంగా పనిచేస్తున్నది. రేడియాలజిస్టులపై పనిభారాన్ని తగ్గించడంతోపాటు ఫలితాలను మెరుగుపరచడంలోనూ సాయపడుతున్నది. స్వీడన్‌లోని లండ్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనం.. ఈ విషయాలను వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వివరాలను ‘ది లాన్సెట్’ ప్రచురించింది. పరిశోధనలో భాగంగా, స్వీడన్‌కు చెందిన లక్ష మంది మహిళలకు రొటీన్ మామోగ్రఫీ స్క్రీనింగ్ నిర్వహించారు. సాధారణ పద్ధతి కంటే ఏఐ వాడకం వల్ల రొమ్ము క్యాన్సర్ గుర్తింపు 29 శాతం పెరిగినట్లు ఈ సందర్భంగా గుర్తించారు.
ఇంటర్వెల్ క్యాన్సర్లు (రెండు స్క్రీనింగ్‌ల మధ్య బయటపడే ప్రమాదకర క్యాన్సర్లు) 12 శాతం తగ్గినట్లు వెల్లడించారు. ముఖ్యంగా వ్యాప్తిచెందే అవకాశం ఉన్న కొన్నిరకాల క్యాన్సర్లను ప్రారంభదశలోనే గుర్తించడంలో కృత్రిమ మేధ మెరుగైన ఫలితాలను ఇచ్చినట్లు పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాకుండా.. రేడియాలజిస్టుల పనిభారాన్ని తగ్గించడంలోనూ కృత్రిమమేధ సాయపడుతున్నదని అంటున్నారు. సాధారణంగా మామోగ్రఫీ స్క్రీనింగ్‌ను ఇద్దరు రేడియాలజిస్టులు విశ్లేషించాల్సి ఉంటుంది. అయితే ఏఐని ఉపయోగించడం ద్వారా రేడియాలజిస్టుల పనిభారం 44 శాతం వరకూ తగ్గిందట.
తక్కువ రిస్క్ ఉన్న కేసులను నేరుగా ఒక రేడియాలజిస్టుకు, అనుమానాస్పదంగా ఉన్న కేసులను ఇద్దరు నిపుణులకు పంపడం ద్వారా సమయం ఆదా అయ్యింది. ఏఐలోని సాంకేతికత మామోగ్రామ్ చిత్రాలను కొన్ని సెకన్లలోనే స్కాన్ చేస్తుంది. అసాధారణంగా, గడ్డలు ఉన్న ప్రాంతాలను హైలైట్ చేస్తుంది. ఇది మానవ కళ్లు గుర్తించలేని అతి సూక్ష్మమైన మార్పులను కూడా పసిగడుతుంది. దాంతో, వ్యాధిని ముందస్తుగా గుర్తించి.. మరింత వేగంగా, సమర్థంగా చికిత్స అందించే అవకాశం ఉంటుందని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.