వంటింటి పనులు, ఆఫీస్ వర్క్ ఒక్కచేత్తో చేసే ఆడవాళ్లు ఇల్లు ఊడ్చే దగ్గరికి వచ్చేసరికి కంగారుపడతారు. నడుం వంచి చేసే ఈ స్వచ్ఛయజ్ఞం ఇంటిని పరిశుభ్రంగా మారుస్తుందేమో కానీ, రెండు గదులు ఊడ్చేసరికి వారి నడుము సడుగులు విరిగినంత పనవుతుంది. అందుకే ఈ పనికి భారంగా ఉపక్రమిస్తారు. ఇలాంటి అతివల కోసమే చైనాకు చెందిన ‘డ్రీమ్’ సంస్థ సరికొత్త వాక్యూమ్ క్లీనర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఎఫ్10 పేరుతో తయారైన ఈ రోబో వాక్యూమ్ క్లీనర్.. మహిళల శ్రమను గణనీయంగా తగ్గిస్తుంది. ఇది టైల్స్, ఉడెన్, కార్పెటింగ్ లాంటి అన్నిరకాల ఉపరితలాలను ఇట్టే శుభ్రం చేస్తుంది. దుమ్ము-ధూళితోపాటు వెంట్రుకలు, కిందపడిన ఆహార పదార్థాలు, పెంపుడు జంతువుల బొచ్చునూ చక్కగా తొలగిస్తుంది. ఇందులో 2-ఇన్-1 క్లీనింగ్ ఫంక్షన్‌ను ఏర్పాటుచేశారు. చెత్తను సేకరించడానికి 570 ఎంఎల్ డస్ట్బిన్తోపాటు మాపింగ్ కోసం 235 ఎంఎల్ వాటర్ ట్యాంక్నూ జతచేశారు.
మ్యాపింగ్, నావిగేషన్ కోసం స్మార్ట్ పాత్‌ఫైండర్ టెక్నాలజీని వాడారు. యంత్రంలోని ఆన్‌బోర్డ్ సెన్సార్ల సాయంతో శుభ్రం చేయాల్సిన ప్రాంతాన్ని మొత్తం స్కాన్ చేస్తుంది. ఎక్కడెక్కడ ఎలాంటి దుమ్ము పేరుకుపోయిందో గుర్తించి.. అందుకు తగ్గట్టుగా క్లీన్ చేసేస్తుంది. ఇందులో 5200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఒకసారి చార్జ్ చేస్తే 300 నిమిషాల వరకు చక్కగా పనిచేస్తుంది. ఒకవేళ చార్జింగ్ తక్కువగా ఉంటే.. వెంటనే చార్జింగ్ డాక్‌కు తిరిగి వచ్చేస్తుంది. బ్యాటరీని చార్జ్ చేసుకొని.. ఎక్కడైతే పని ఆపేసిందో మళ్లీ అక్కడినుంచే శుభ్రం చేయడం మొదలుపెడుతుంది. ఇక ‘డ్రీమ్ మొబైల్ యాప్’ ద్వారా ఈ వాక్యూమ్ క్లీనర్‌ను ఆపరేట్ చేయొచ్చు. అలెక్సా, గూగుల్ అసిస్టెంట్, సిరి ద్వారా వాయిస్ ఆదేశాలను పాటిస్తుంది.