మధుమేహం అనగానే చాలామందికి రక్తంలో చకెర స్థాయులు, ఆహార నియమాలు, గుండె లేదా కిడ్నీ సమస్యలే గుర్తొస్తాయి. కానీ, ఈ మహమ్మారి కంటి చూపును కూడా గుల్ల చేస్తుందనే విషయాన్ని చాలామంది గుర్తించరు. డయాబెటిస్ వల్ల కంటి లోపల తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఇండియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ఆప్తమాలజీ నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ దిగ్భ్రాంతికర నిజాలు వెల్లడయ్యాయి. కంటి చూపు బాగుంది కదా అని భావిస్తూ, దాదాపు 60 శాతానికి పైగా బాధితులు కంటి పరీక్షలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఈ పరిశోధన పేరొంది. డయాబెటిస్ వల్ల వచ్చే కంటి సమస్యలు ఎలాంటి నొప్పి లేదా చూపులో మార్పులు లేకుండానే ఏళ్ల తరబడి లోపల పెరిగిపోతుంటాయి. నగరాల్లోని ఐటీ ప్రొఫెషనల్స్, మధ్య వయసులు, యువతలో షుగర్ వ్యాధి వేగంగా విస్తరిస్తున్నది.
సాధారణంగా మధుమేహ బాధితులు బ్లడ్, షుగర్ లెవెల్స్ తరచూ చెక్ చేయించుకుంటారు కానీ, కంటి పరీక్షల జోలికి వెళ్లరు. చూపు మసకబారడం, కళ్ల ముందు నల్లటి చుకలు రావడం లేదా చదవడంలో ఇబ్బంది తలెత్తే వరకు కంటి వైద్యుడిని సంప్రదించరు. ఇలాంటి లక్షణాలు బయటపడే సమయానికే జరగాల్సిన నష్టం జరిగిపోతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రక్తంలో చకెర స్థాయులు దీర్ఘకాలంపాటు నియంత్రణలో లేనప్పుడు, అవి కంటి లోపల ఉండే సూక్ష్మ రక్తనాళాలను దెబ్బతీస్తాయి. మనం స్పష్టంగా చూడటానికి కారణమైన రెటీనా సక్రమంగా పనిచేయాలంటే ఈ రక్తనాళాలే ఆధారం. షుగర్ తీవ్రత వల్ల ఈ నాళాలు బలహీనపడటం, వాపు రావడం లేదా రక్తం కారడం జరుగుతుంది. ప్రారంభ దశలో దీనివల్ల ఎలాంటి స్పష్టమైన హెచ్చరికలు ఉండవు. లోపల నష్టం జరుగుతున్నా సరే, బాధితుడు ఎప్పటిలాగే చదవడం, డ్రైవింగ్ చేయడం వంటి పనులు చేసుకోగలడు. మధుమేహం వల్ల కంటి శుక్లాలు, గ్లకోమాతో పాటు రెటీనా మధ్య భాగంలో వాపు వచ్చే ప్రమాదం ఉంది.
దీనిని డయాబెటిక్ మాక్యులర్ ఎడెమా అని పిలుస్తారు. ఈ సమస్యలు ముదిరితే చిన్న అక్షరాలు చదవడం, ఫోన్ వాడటం, మనుషుల ముఖాలను గుర్తుపట్టడం, రాత్రి పూట డ్రైవింగ్ చేయడం కష్టంగా మారుతుంది. అందుకే చూపు మసకబారే వరకు వేచి చూడకుండా ముందే జాగ్రత్త పడాలి. కంటి చూపు బాగున్నంత మాత్రాన కళ్లు ఆరోగ్యంగా ఉన్నాయని అనుకోవడం పెద్ద పొరపాటు. చూపు స్పష్టంగా ఉన్నవారిలో కూడా డయాబెటిక్ రెటినోపతి అంతర్గతంగా ఉండే అవకాశం ఉంది. క్రమం తప్పకుండా రెటీనా పరీక్షలు చేయించుకోవడం ద్వారా కంటి లోపలి మార్పులను ముందే పసిగట్టవచ్చు. సరైన సమయంలో చికిత్స ప్రారంభించి, షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుకుంటే చూపు కోల్పోయే ప్రమాదాన్ని పూర్తిగా నివారించవచ్చు. డయాబెటిస్ నిర్వహణ అంటే కేవలం బ్లడ్ టెస్టులు, ఇన్సులిన్, మాత్రలకే పరిమితం కాకూడదు. మూడు నెలలకొకసారి చేయించుకునే హెచ్‌బీఏ1సీ పరీక్ష ఎంత ముఖ్యమో, రెటీనా పరీక్ష కూడా అంతే ప్రధానం అని గ్రహించాలి. షుగర్ ఉన్నవారు ఏటా కనీసం ఒకసారైనా పూర్తి కంటి పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి. ఇంట్లోని వృద్ధులను ముందస్తు పరీక్షలకు తీసుకెళ్లడంలో కుటుంబ సభ్యులు చొరవ చూపాలి. ఏటా చేయించుకునే ఒకే ఒక సాధారణ కంటి పరీక్ష.. జీవితాంతం వెలుగును కాపాడుతుందనే సత్యాన్ని గ్రహించాలి.