నమస్తే డాక్టర్ గారు. నా వయసు 52 సంవత్సరాలు. నాకు నెలసరి ఆగిపోయి అయిదు సంవత్సరాలు అవుతున్నది. నేను ఒక మోస్తరు లావు ఉంటాను. అయితే ఇటీవల ఉన్నట్టుండి లావయ్యాను. 5 అడుగుల రెండు అంగుళాల ఎత్తు ఉండే నేను 64 కిలోల బరువు ఉన్నాను. ఈ మధ్య విపరీతంగా నీరసం వస్తున్నది. ఇంటి పనులు కూడా చేసుకోలేక పోతున్నాను. ఏమైనా మందులు వాడాలా?!
– ఓ సోదరి
లావుకు, మెనోపాజ్‌కు సంబంధం లేదు. సమతులాహారం తీసుకోండి. నడకలాంటి వ్యాయామాలు చేయండి. మెనోపాజ్ తర్వాత విటమిన్-డి, క్యాల్షియం మాత్రలు రోజూ క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఒంట్లో శక్తి తగ్గకుండా, ఎముకలు బలహీనపడకుండా చూసుకోవచ్చు. మరో విషయం క్యాన్సర్లు కూడా ఈ సమయంలోనే త్వరగా దాడి చేస్తాయి. అందుకే మీరు మమోగ్రామ్, పాప్‌స్మియర్ టెస్టులు చేయించుకోండి. మెనోపాజ్ తర్వాత బీపీ, షుగర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. తప్పకుండా ఆ పరీక్షలు కూడా చేసుకోండి. ఉన్నట్టుండి ఒళ్లు వేడి కావడం, చెమటలు పట్టడం లాంటివి జరిగినా, గర్భాశయ ముఖద్వారం దగ్గర నొప్పి ఉన్నా, మూత్రం మంటగా వస్తున్నా గైనకాలజిస్టుని సంప్రదించి పరీక్షలు చేయించుకోండి. అవసరమైతే హార్మోన్ మాత్రలు ఇస్తారు. వాటిని వాడండి. సమస్య వచ్చినప్పుడే కాదు, మెనోపాజ్ దాటిన తర్వాత తప్పకుండా ఏడాదికి ఒకసారి గైనకాలజిస్టును కలవాలి. అన్ని పరీక్షలూ చేయించుకోవడం ద్వారా ఏ ఇబ్బందినైనా త్వరగా గుర్తించి, సరైన చికిత్స అందించగలిగే అవకాశం ఉంటుంది.
– డాక్టర్ పి. బాలాంబ సీనియర్ గైనకాలజిస్ట్