జయ జయ ధ్వానాలు.. పూల వానలు.. దేవతలు వెలిగించిన దీపాల వరుసలు.. విజయ దరహాసంతో సత్యాకృష్ణులు. నరకాసుర సంహారం జరిగింది. దీపావళి పుట్టింది. సత్యాదేవి విక్రమ పరాక్రమాలను శ్రీకృష్ణుడితోపాటు లోకమూ సంభ్రమాశ్చర్యాలతో తిలకించింది. అతి సుకుమారి అయిన శ్రీకృష్ణుడి ప్రియసఖి అలవిగాని రాక్షసులను అలవోకగా మట్టుబెట్టింది. ఈ సన్నివేశానికి ముందు సత్య వేరు, తర్వాతి సత్య వేరు! కన్నయ్య ప్రణయ రాణిగా పరిచయమున్న ఆమె వీరనారిగా వెలిగిన సందర్భమది. గరుత్మంతుడి మీద నిలబడి వింటినారిని సంధించిన ఆమె నారీలోకానికి సాటిలేని సూచనలు చేసింది. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు మానవాళికి గీతను బోధిస్తే, ఈ యుద్ధక్షేత్రంలో సత్యాదేవి మహిళామణులకు మన్నికైన సంగతుల్ని నేర్పింది. రణరంగానికి వెళ్లడం నుంచి విజయంచేజిక్కించుకునేంత వరకూ ఆమె వేసిన ప్రతి అడుగూ ఓ పాఠమే!
యుద్ధం ఎప్పుడూ కఠినంగానే ఉంటుంది. సత్య కాలమైనా.. సత్యా కాలమైనా. అప్పుడూ ఇప్పుడూ విజయానికి శక్తి ఒక్కటే చాలదు, యుక్తి కూడా ఉండి తీరాల్సిందే. గెలుపు పొందాలంటే ఎంత శ్రద్ధతో శ్రమించి పనిచేస్తామో అంతే ప్రశాంతంగా దాన్ని కొనసాగించాలంటుంది సత్యగీత. మనసైన వాడిని మనువాడటమే కాదు, మనవాడిని చేసుకోవడమూ మనసున పట్టాలంటుంది. స్త్రీగా సుందర సుకుమార సౌరభాలు ఎంత అవసరమో, ధీర వీర గుణసమూహాలూ అంతే అవసరం అంటుంది. అలాగని మనమేం రుద్రకాళిలా భద్రకాళిలా కనిపించనక్కర్లేదు. అవసరమైన చోట అనితరమైన శక్తిని అనుసంధానం చేస్తే సరి! దుర్గమ్మ చేసింది అదే… సత్యమ్మ చేసిందీ అదే… నేటి ప్రతి అమ్మా చేయాల్సిందీ కచ్చితంగా అదే!!
ఓ క్లిష్టమైన పనిలో ముందడుగు వేసే ముందు మనకు దగ్గరి వాళ్లు తప్పకుండా అందులో కష్టనష్టాలను చెబుతారు. ఇప్పుడు ఆ పనిచేయడం అంత అవసరమా అన్న సందేహాన్నీ వెలిబుచ్చుతారు. సాక్షాత్తూ కృష్ణపరమాత్మ కూడా సత్యాదేవి యుద్ధరంగానికి వస్తానంటే అలాగే చెప్పాడు.
‘సమద పుష్పంధయ ఝంకారములు గావు,
భీషణకుంభీంద్ర బృంహితములు
వాయు నిర్గత పద్మవనరేణువులు గావు,
తురగ రింఖాముఖోద్ధూతరజము…
కన్య! నీవేడ? రణరంగ గమన మేడ?’ అంటాడు.
‘సత్యా… యుద్ధ రంగమంటే ఏం అనుకున్నావు. పువ్వుల మీద వాలే తుమ్మెదల ఝంకారాలు కాదు, భయంకరమైన ఏనుగుల ఘీంకారాలు వినిపిస్తుంటాయక్కడ. అక్కడ కనిపించేవి పిల్లగాలికి తామరపువ్వుల మీద రేగే పుప్పొడి రేణువులు కాదు, వేగంగా పరిగెత్తే గుర్రపు డెక్కల చివరల నుంచి లేచిన దుమ్ము దుమారాలు. ఆ చోటంతా శూలాలూ, ఖడ్గాలూ, రాక్షసులూ. సుకుమారీ నువ్వెక్కడ, ఆ రణరంగం ఎక్కడ? నేను ఇప్పుడే వచ్చేస్తానుగా… ఉండు’ అంటాడు కృష్ణుడు. భామ వదలదు. అన్ని చెప్పాడని భయపడదు. తనను వద్దన్నాడని చిన్నబుచ్చుకోదు. ప్రాణ సఖుడికి మరింత దగ్గరగా చేరుతుంది. భుజం మీద గడ్డం ఆన్చి ఆయనకు మాత్రమే వినిపించేలా… ‘దానవులు ఉంటేనేం… రాక్షస సమూహాలు ఉంటేనేం… శత్రు దుర్భేద్యమైన కోటల్లాంటి మీ భుజాల వెనుక నేనుంటే… నాకేం భయం’ అన్నది. కాస్త పక్కకు జరిగి రెండు చేతులూ జోడించి నమస్కరించింది. ఆ మాటలకు కృష్ణుడు తబ్బిబ్బయ్యాడు. అభిమానంగా ఓ చూపు చూశాడు. ‘దా… ఎక్కు’ అన్నాడు పక్షీంద్రుడి వంక చూపుతూ. అదీ సత్యాసతీ సంధత!! సత్యమ్మ యుద్ధంలో తొలిమెట్టు ఎక్కింది ఇక్కడే. పెద్ద సవాళ్లు, మన వాళ్ల సలహాలు, ముందుకు వెళ్లే ఆలోచనలు.. అన్నిటినీ ఎలా నిర్వహించుకోవాలి అన్నదానికి చక్కనైన ఉదాహరణ ఈ సందర్భం.
నరకుడు భయంకరమైన రాక్షసుడు. పద్నాలుగు లోకాలనూ ఆక్రమించాడు. ఎంతో బలగం ఉన్నవాడు. యుద్ధం అనగానే లక్షల సైన్యాన్ని మోహరించాడు. శ్రీకృష్ణుడు పాంచజన్యం పూరించగానే వాళ్లంతా గోలగోలగా కదిలారు. ఢంకాలూ బూరలూ పెద్దపెద్ద వాయిద్యాలతో చప్పుళ్లు చేస్తూ అరుస్తున్నారు. అయితేనేం, సత్య వెరవలేదు. అవసరం అనుకున్నప్పుడు అడుగు ముందుకు వేయడమే తప్ప వెనక్కి తిరిగే లక్షణమే లేదు ఆమెకు. నరకుడు ముందుకు ఉరకడం చూసి స్వామి చేతి నుంచి ధనుస్సును అందుకుంది. యుద్ధం నేను చేస్తాగా, నీకెందుకు… అంటూనే విలాసంగా వింటిని అందించిన కృష్ణుడే విస్తుపోయేలా శస్ర్తాలు ప్రయోగించింది. తను బాణాలు సంధించడానికి ఎక్కడా ఇబ్బంది రాకుండా పొడవాటి జడను ముడివేసింది. చీర నడుముకు చుట్టింది. నగలన్నిటినీ సర్ది పెట్టింది. రాక్షస సంహారానికి స్వామి వినియోగించే మహత్తరమైన ధనువును చేతితో పట్టుకుని వంగి వింటినారిని కట్టి… టంకారం చేస్తుంటే సాక్షాత్తూ శ్రీకృష్ణుడే విస్తుబోయి చూశాడట. ఎంత వేగంగా విల్లును పట్టుకుందో, అంతే వేగంగా అస్ర్తాలు సంధించడం మొదలుపెట్టింది. ఎడమకాలు ముందు పెట్టి, కుడికాలిని వంచి పట్టి ఆమె బాణాలు వేసే తీరుకు శ్రీహరి ముగ్ధుడైపోయాడు. ప్రచండమైన వేగంతో ప్రయాణించే గరుత్మంతుడి మీద ఆమె నిలబడి శరం సంధిస్తుంటే ప్రళయ కాలపు సూర్యుడిలా కనిపించిందట. ఒక్కో అస్ర్తాన్నీ మంత్రించి
రాక్షసుల మీదకు వదులుతుంటే కుప్పలకొద్దీ జనం చచ్చారట.
బొమ్మ పెండ్లిండ్లకు బోనొల్లనను బాల
రణరంగమున కెట్లు రాదలంచె?
మగవారి గనిన దా మఱుగు జేరెడు నింతి
పగవారి గెల్వ నే పగిది జూచె?
బసిడియుయ్యెల లెక్క భయ మందు భీరువు
ఖగపతి స్కంధ మే కడిది నెక్కె?
అనుకుంటూ ముక్కున వేలేసుకున్నాడట నారాయణుడు. రుక్మిణమ్మ బొమ్మల పెండ్లిండ్లు చేస్తున్నదట పల్లకీలో పోయిరామ్మా… అంటే అలసిపోతాను నావల్ల కాదు అని చెప్పే ఈ సుకుమారి రణరంగానికేల వచ్చింది. మగవాళ్లను చూస్తేనే పక్కకు తప్పుకొనే ఈ పడతి పగవాళ్లని మట్టికరిపిస్తున్నదా. బంగారపు ఉయ్యాలనెక్కమంటేనే భయమంటుందే… ప్రచండ వేగంతో ప్రయాణించే ఈ గరుత్మంతుడి మీద ఎక్కి యుద్ధం చేస్తున్నదా… అనుకున్నాడట పరంధాముడు. నిజంగానే… బంగారు ఉయ్యాల ఎక్కమంటే భయం అనేంత పిరికిగా కనిపించిందీ ఆ సత్యే. ఇవాళ ఖగపతి మీద వీర విహారం చేస్తున్నదీ ఆ సత్యే. అవును అవసరాన్ని బట్టి అవతారం ఎత్తాల్సిందే! కావాలనుకున్న చోట ఆత్మవిశ్వాసంతో కనిపించాల్సిందే! సమస్యను తీర్చాలంటే తెగించి వచ్చి తెలిసిన శస్ర్తాలన్నీ ప్రయోగించాల్సిందే! ఆడది అంటే అబల కాదు… సబల అని త్రేతాయుగంలోనే నిరూపించిన సత్యభామ బాట… రోజువారీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలుకీ అష్టాక్షరీ మంత్రంలా పనిచేస్తుంది.
సత్య శ్రీకృష్ణుడితో కలిసి నరకుడి మీద యుద్ధం చేస్తున్నది. శత్రువుల నుంచీ వచ్చే బాణాల పరంపర కొనసాగుతూ ఉంది. వాళ్లు అరుస్తున్నారు. ఈవిడా గర్జిస్తున్నది. సవాళ్లు… ప్రతి సవాళ్లు. కన్ను తిప్పే వల్ల లేదు. క్షణం ఏమరుపాటు ప్రమాదాన్ని కొని తెస్తుంది. అలాంటప్పుడు ఎవరైనా ఎలా ఉంటారు. భీకరమూర్తిలా కనిపిస్తారు. వీరత్వానికి ప్రతీకలా ఉంటారు. కానీ సత్యలో వీర, శృంగార, భయ, రౌద్ర, విస్మయ భావాలన్నీ ఒకేసారి కనిపించాయట. రౌద్రమూ, శృంగారమూ ఒకేసారి అదీ యుద్ధరంగంలో ఎలా కనిపిస్తాయి… అన్న అనుమానం కలగడం సహజమే. కానీ ఆమెలో కనిపించాయి. తన ప్రియసఖుడితో కలిసి శత్రువు మీద యుద్ధం చేస్తున్నది. అసురుడి మీదికి ఓ అస్త్రం విసురుతున్నది. స్వామి వైపు వెనక్కి తిరిగి ‘చూశారా…’ అన్నట్టు ఓ నవ్వు నవ్వుతున్నది. మళ్లీ బాణం ఎక్కుపెట్టి… ప్రాణనాథుడిపైకి ఓ క్రీగంటి చూపు విసురుతున్నది. కోమలాంగి వీరత్వం చూసి మురారి ముచ్చట పడుతూ అలా చూస్తూ ఉండిపోయాడట.
రాకేందుబింబమై రవిబింబమై యొప్పు
నీరజాతేక్షణ నెమ్మొగంబు,
కందర్పకేతువై ఘన ధూమకేతువై
యలరు బూబోడి చేలాంచలంబు
భావజు పరిధియై ప్రళయార్కు పరిధియై
మెఱయు నాకృష్టమై మెలత చాప,
మమృత ప్రవాహమై యనలసందోహమై
తనరారు నింతి సందర్శనంబు
అంటుంది పోతన భాగవత పద్యం. యుద్ధం చేస్తున్న సత్యాదేవి ముద్దుల ముఖం నందనందనుడికి చంద్రబింబంలా కనిపిస్తున్నదట. నరకాసురుడికి మాత్రం మండే సూర్యుడిలా గోచరమైందట. గాలికి ఎగురుతున్న ఆమె చీరకొంగు ఆయనకు మన్మథ పతాకంలా కనిపిస్తే.. రాక్షసుడికి ధూమకేతువు (పొగతో కూడుకున్న తోకచుక్క)లా కనిపించిందట. ఆమె అటూ ఇటూ తిప్పుతూ బాణాలు వేస్తున్న విల్లు స్వామికి కాముడి వలయంలా కనిపిస్తే, రాక్షసుడికి కాలుడి భాను పరివేషంలా తోచిందట. శత్రువులకు నీరసం తెప్పిస్తూ, సొంత వారి ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ సాగిందామె యుద్ధం.
ముఖ్యమైన పనుల్లో పడి నవ్వడాన్ని మరిచిపోయే వాళ్లు తప్పకుండా గమనించాల్సిన అంశం ఇది. హడావుడిగా ఉన్నామంటూ భాగస్వామిని పక్కన పెట్టే వాళ్లు పరిశీలించాల్సిన విషయం ఇది. మనది సత్య చేసిన దానికన్నా పెద్ద యుద్ధమా! నరకాసురుడికన్నా పెద్ద ఇబ్బందా!! ఎంత ప్రశాంత చిత్తంతో పనులు చేస్తే అంత విజయం అన్నది ఇక్కడ సత్య చెప్పిన పాఠం. అవును అలాగే సత్య గెలిచింది. సత్యాకృష్ణులు గెలిచారు. నరకుడు ఓడాడు. దీపావళి వచ్చింది. ఇంతులంతా ఇదే రీతిలో సత్యగీతను పాటిస్తే… ఇంటింటా నిత్య దీపావళే!
– లక్ష్మీహరిత ఇంద్రగంటి