మరణం! ఆ మాట వింటేనే తెలియని భయం ఆవరిస్తుంది. మన సర్వస్వాన్ని లాక్కుపోవడానికి సిద్ధంగా ఉన్న ఓ శక్తి స్ఫురిస్తుంది. నేను, నాది అనుకున్న ప్రతిదీ… మన ఉనికి, స్పృహతోపాటే అదృశ్యమైపోయే మాయ ఆవరిస్తుంది. అది తప్పదని తెలుసు, సహజం అనీ తెలుసు. కానీ బుద్ధుడి నుంచీ భగవద్గీత వరకూ ఎన్ని బోధలు విన్నా చావు రాకపోతే బాగుండు అనే ఆశ అందరిదీ. వెళ్తూవెళ్తూ ఖాళీ చేతులు చూపించిన అలెగ్జాండర్, చావు రాకూడదు అన్న కోరిక చుట్టూ తిరిగిన పురాణ గాథలు ఏవీ కూడా మనకు ఉపశమనం కలిగించవు. సిద్ధాంతాలు, మతాలు, సంప్రదాయాలు… అన్నిటి మీదా మృత్యువు ప్రభావం అంతాఇంతా కాదు. ఇంతకూ భౌతికశాస్త్రం లేదా అందులోని కొన్ని విభాగాలు మృత్యువును ఎలా చూస్తున్నాయి అన్నది కాస్త ఆసక్తిగా ఉంటుంది. మరీ ముఖ్యంగా క్వాంటం ఫిజిక్స్ లాంటి రంగాల్లో మృత్యువును కాస్త భిన్నంగా చూసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా చావనేది మనం అనుకున్నంత అశనిపాతం కాదనీ, అంతకు మించినదేదో ఉందనీ, మృత్యువు ఓ ముగింపు కాదనే ధైర్యాన్ని ఇస్తాయి.
పుట్టుక అనే ప్రయాణం మరణంతో పూర్తవుతుంది. అదో వలయం. కొత్త తరం కోసం ప్రకృతి ఏర్పరచిన నియమం. అలాగని ఇదేదో అకస్మాత్తుగా రాదు. పుట్టినప్పటి నుంచే మరణం వైపుగా అడుగులు వేస్తాడు మనిషి. నిరంతర విభజనతో బలహీనపడే కణాలు, జన్యువులలో పెరిగే పొరపాట్లు, పటుత్వం తప్పే కండరాలు, తగ్గిపోయే రోగ నిరోధక శక్తి, బలహీనపడే ఇంద్రియాలు, వయసును పెంచేసే ఫ్రీ రాడికల్స్, ఇన్ఫెక్షన్లు, కుంచించుకుపోయే క్రోమోజోమ్… అన్నీ కూడా మృత్యువుకు దారితీస్తాయి. తను చేసిన పాపపుణ్యాలు మాత్రం అంటిపెట్టుకుని ఉంటాయనీ, కర్మానుసారంగా మనిషి మరో జన్మను ఎత్తుతాడనీ అంటాయి కొన్ని మతాలు. అబ్బే! శక్తికి జననం మరణం అంటూ ఉండదు… అది రూపం మారుతుంది! అలాగే మనిషి శరీరం కూడా పంచభూతాల్లో కలిసిపోతుంది అంటుంది సైన్స్. ఈమధ్య వెలువడుతున్న కొన్ని భావాలు ఈ రెండిటికీ మధ్యేమార్గంగా కనిపిస్తున్నాయి.
మీరు ఏదో ఆట ఆడుతున్నారు. అందులో పాచికలను విసిరారు. వాటి ఫలితం మూడు అనే అంకె పడింది. మన కళ్లకు కనిపించిన ఫలితం మూడే! కానీ మిగతా ఫలితాల సంగతి ఏంటి? సున్నా నుంచి ఆరు వరకు ఏదైనా పడవచ్చు కదా! మల్టీ యూనివర్స్ సిద్ధాంతం ప్రకారం ప్రతి ఎంపికకూ ఓ లోకం ఉంటుంది. ఈ లోకంలో పాచికల అంకె మూడు కనిపిస్తే మరో లోకంలో నాలుగు, ఇంకో లోకంలో అయిదు… అలా కనిపిస్తాయి. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా సాక్షాత్తు కొందరు శాస్త్రవేత్తలే ప్రతిపాదించిన సిద్ధాంతం ఇది. 2015లో వీరు మరో అడుగు ముందుకేసి… సౌరకుటుంబంలో కనిపించే కొన్ని పరమాణువుల తీరును చూస్తే, అవి ఇతర ప్రపంచాల నుంచే మనకు వచ్చాయని చెప్పుకొచ్చారు.
స్టీఫెన్ హాకింగ్ వంటి ప్రముఖ శాస్త్రవేత్తలు సైతం మల్టీవర్స్ భావనను పూర్తిగా కొట్టిపారేయలేదంటే, దీన్ని శాస్త్రలోకం ఎంత తీవ్రంగా పరిగణిస్తున్నదో అర్థమవుతుంది. ఒకవేళ నిజంగా మల్టీవర్స్ ఉంటే అది ఎలా ఉంటుందనే భావనలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అదీ భూమిలాగే ఉంటుందని కొందరు, లేదు లేదు అక్కడి భౌతిక సిద్ధాంతాలు వేరేలా ఉంటాయని మరికొందరు, భూమిని ప్రతిఫలించేలా (Twin-world) ఉంటుందని ఇంకొందరు వాదిస్తుంటారు. మరి మరణానికీ ఈ మల్టీవర్స్కీ ఏంటి సంబంధం! పాచికల విషయంలో చెప్పుకొన్నట్టుగానే… ఓ మనిషి తీసుకునే ప్రతి ఎంపికా, తనను మరో లోకంలోకి నడిపిస్తుంది అంటుంది మల్టీవర్స్ సిద్ధాంతం. ఉదాహరణకు వ్యాపారం చేయాలా చదువుకోవాలా అనే సందిగ్ధంలో ఒకరు వ్యాపారాన్ని ఎంచుకున్నారు అనుకుందాం. ఆ ఎంపిక ఈ భూమ్మీద సాకారం అయితే, చదువుకోవడం అనే ఎంపిక మరో లోకంలో సాకారం అవుతుంది. అలాగే ఓ వ్యక్తి ఇక్కడ మరణిస్తే తను మరో ప్రపంచంలో జీవిస్తాడనీ, అలా తన ఉనికి నిరంతరాయంగా కొనసాగుతూ ఉంటుందని చెబుతుంది మల్టీవర్స్కి అనుబంధమైన క్వాంటం ఇమ్మోర్టాలిటీ (Quantum immortality) అనే సిద్ధాంతం. అయోమయంగా, అనుమానాలకు దారితీసేలా ఉన్న ఈ భావనల మీద మరిన్ని పరిశోధనలు జరగాలి, మరిన్ని సాక్ష్యాలూ రావాలి. అన్నట్టు మన పెద్దలు ఏడేడు లోకాలు అంటూ చెప్పుకొచ్చిన వర్ణనలు ఆ మల్టీవర్స్వేనేమో!
ప్రపంచం ఉంది కాబట్టే మనం ఉన్నాం అంటుంది అనుభవం. మనం ఉన్నాం కాబట్టే ఈ ప్రపంచం ఉంది అని ఎవరన్నా చెబతే? ఇది ఊసుపోక చేసిన వితండవాదం కాదు. రాబర్ట్ లాంజా అనే ప్రముఖ శాస్త్రవేత్త చెబుతున్న సిద్ధాంతం. దీన్ని బయోసెంట్రిజం అంటారు. రాబర్ట్ సామాన్యుడేం కాదు. మానవ పిండాన్ని తొలిసారిగా క్లోన్ చేసిన జట్టులో సభ్యుడు. మూలకణాలతో అంధత్వానికి సైతం చికిత్స చేయగలిగిన నిపుణుడు. బయోసెంట్రిజం చుట్టూ తను రాసిన పుస్తకాలు సంచలనం సృష్టించాయి. ఓ చిన్న ఉదాహరణతో చెప్పుకోవాలి అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచంలో గాలి, నీరు, నేల, రుచి లాంటి అంశాలను మనం అనుభూతి చెందుతాం. వీటి ద్వారానే మన ఉనికిని గుర్తిస్తాం. విచక్షణతో మెలుగుతాం. మన సామూహిక విచక్షణతోనే ఈ లోకం ఏర్పడింది. అది లేని రోజున లోకమే లేదు. సాలీడు లేకపోతే సాలెగూడు లేనట్టు జీవులు లేనిదే లోకం లేదు. వారితో అల్లుకునే ఈ లోకం నిర్మితమైంది అంటారు రాబర్ట్. క్వాంటం సిద్ధాంతం ప్రకారం ఎలక్ట్రాన్, ఫోటాన్ లాంటి పరమాణువులు మనిషి చూస్తున్నప్పుడు ఒకలా చూడనప్పుడు ఒకలా ప్రవర్తిస్తుంటాయి. మనల్ని బట్టే ఈ ప్రపంచం ఉంది అనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏముంటుంది అని వాదిస్తాడు.
బయోసెంట్రిజం మీద తీవ్రమైన వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఒకవేళ ఈ సిద్ధాంతాన్ని ఒప్పుకొంటే కనుక ఇప్పటిదాకా మన జీవితాల మీద పరిసరాల ప్రభావాన్ని గమనిస్తున్న శాస్త్రవేత్తలు, అందుకు విరుద్ధంగా పరిశోధనలు మొదలుపెట్టాల్సి ఉంటుంది. అదేమంత తేలిక కాదు. ఇంతకూ అమరత్వం గురించి బయోసెంట్రిజం ఏం చెబుతుంది? మృత్యువు అనేది అంతం కాదు, మార్పు అంటుంది. మరోచోట మరో ఉనికితో అది ప్రకటితం అవుతుందని అంటాడు రాబర్ట్. ఇది క్వాంటం స్థాయిలో జరుగుతుంది కాబట్టి, దాన్ని మనం నిరూపించలేం అని వాదిస్తాడు.
భౌతికశాస్త్రంలోని మౌలిక సిద్ధాంతాలో ఒకటి కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ (conservation of energy). దీని ప్రకారం శక్తిని మనం ఉత్పత్తి చేయలేం, నాశనమూ చేయలేం. దాని రూపం మారుతుంది అంతే! బొగ్గు విద్యుత్తుగా, విద్యుత్తు వెలుగుగా రూపాంతరం చెందినట్టు అన్నమాట. వేగంగా విసిరే బంతి సైతం శక్తిని (కైనెటిక్ ఎనర్జీ) సమకూర్చుకుంటుంది. మరి కదిలేమెదిలే శరీరంలో చలనం ఆగిపోతే, ఆ శక్తి ఏమవుతుంది? అది ఉష్ణోగ్రతగా రూపాంతరం చెంది పరిసరాల్లో కలిసిపోతుందని కొందరు అంటారు. పార్థివదేహం చల్లబడటమే ఇందుకు సూచనగా చెబుతారు. మరణం తర్వాత ఏళ్ల తరబడి మనం పొందిన అనుభవాలు, ఏర్పరుచుకున్న విచక్షణ అన్నీ కూడా దేహం నుంచి బయటికి వస్తాయనీ… దాన్నే ఆత్మగా భావించవచ్చని కొందరి భావన. అది మరో శరీరంలో ప్రవేశించడమో (పునర్జన్మ), మరో లోకంలో (మల్టీవర్స్) జీవించడమో జరుగుతుందని ఓ ప్రతిపాదన.
కృత్రిమ మేధస్సు రోజురోజుకూ ఎంతలా ఎదుగుతున్నదో చూస్తున్నాం. వాటికి కూడా సొంత ఆలోచనలు, విచక్షణ అలవర్చే ప్రయత్నం మెరుగవుతున్నది. కొన్నాళ్లకు ఆ రోబోలు తాము నిజమైన జీవులం అనుకుంటే! వినడానికి భయంగా ఉన్నా… ఇది అసాధ్యమైతే కాదు. ఈ సిద్ధాంతాన్ని నిరూపించడానికి రోబో లాంటి సినిమాలే అక్కర్లేదు. సరే ఇప్పుడు దీన్నే మనుషులకు వర్తింపచేద్దాం. ఒకవేళ ఎవరో ఆధునికమైన జీవులు మనుషుల్ని రూపొందించి ఉంటే… వాళ్లు ఇలా ఉండాలి, ఇలా ప్రవర్తించాలి అని ఎక్కడినుంచో నియంత్రిస్తూ ఉంటే… అది నిజమే అని భావించేవారు లేకపోలేదు. ఒకవేళ అది అసాధ్యం అనుకుంటే కనుక అసిమోవ్ మాటల్ని ఓసారి వినాలి. రష్యాలో పుట్టి అమెరికాలో స్థిరపడిన ఐజాక్ అసిమోవ్ ప్రముఖ శాస్త్రవేత్త మాత్రమే కాదు చరిత్రలోనే ఉత్తమ సైన్స్ ఫిక్షన్ రచయితగా పేరు తెచ్చుకున్నారు. రోబోటిక్స్ అన్న పదం ఆయన సృష్టించిందే. రోబోల మీద తీసే ప్రతి సినిమా మీదా ఆయన రచనల ప్రభావం ఉంటుంది. ఇదంతా ఎందుకంటే అసిమోవ్ అంచనా ప్రకారం మనుషులు ఉన్న విభజన రేఖ రోజురోజుకూ సన్నబడిపోవడం ఖాయం. మనుషులు క్రమంగా తమ శరీరాల్లో రకరకాల పరికరాలను అమర్చుకుంటున్నారు. అత్యవసర సందర్భాల్లో వాడే పేస్మేకర్లు, కాక్లియర్ ఇంప్లాంట్ గురించి తెలిసిందే. ఇవే కాకుండా మెదడులో చిప్ పెట్టుకోవడం, వేగంగా కదిలే కాళ్లని అమర్చుకోవడం లాంటి ప్రయోగాలు ఊపందుకుంటున్నాయి. మరోవైపు రోబోలకేమో సహజమైన చర్మం, మెదడు లాంటివి జోడిస్తున్నారు. అసిమోవ్ సిద్ధాంతం ప్రకారం మనిషి క్రమంగా రోబో వైపు, రోబో క్రమంగా మనిషి వైపు వచ్చి… ఇద్దరి మధ్యా ఉన్న హద్దు చెరిగిపోతుంది. ఎవరు మనిషి, ఎవరు రోబో తెలియకుండా పోతుంది. ఈ పరిస్థితి అమరత్వానికి దారితీస్తుంది.
క్వాంటం ఫిజిక్స్ పేరుతో చెప్పినంత మాత్రాన… ఇవన్నీ నిజాలు అని విజ్ఞానలోకం ఒప్పుకొన్నట్టు కాదు. ప్రతి శాస్త్రంలోనూ సవాలక్ష అభిప్రాయాలు, సిద్ధాంతాలు ఉంటాయి. వాటిని మన పరిమిత దృష్టికి కూడా నిరూపించగలిగితేనే నమ్మగలం. ఉదాహరణకు మన కళ్లకు ప్రతీ వస్తువూ ఎత్తు, లోతు, వెడల్పుగానే (త్రీడీ) కనిపిస్తుంది. కానీ నాలుగో పార్శం కూడా ఉందని ఐన్‌స్టీన్ ప్రతిపాదించాడు. దాన్ని మనం చూడలేకపోయినప్పటికీ సిద్ధాంతపరంగా నిరూపించగలిగాడు. ఆత్మ, అమరత్వం, మల్టీవర్స్ లాంటివి కూడా సిద్ధాంతపరంగా నిరూపించాల్సిన అవసరం ఉంది. అప్పుడే వాటి మీద నమ్మకం ఏర్పడుతుంది. అలా నిరూపించిన రోజు కూడా విజ్ఞానశాస్ర్తానికి ఓటమి ఏమీ కాదు. మనిషిలోని మూలశక్తిని సైతం కనుగొన్న విజయం మాత్రమే!
భౌతికశాస్త్రం అనగానే అందరికీ న్యూటన్ సూత్రాలు, ఐన్‌స్టీన్ సిద్ధాంతాలు గుర్తుకువస్తాయి. ఓ వస్తువు ఎందుకు, ఎలా పనిచేస్తుంది అని పరిశీలించి కారణాలు నిరూపించేదే భౌతికశాస్త్రం. క్వాంటం భౌతికశాస్త్రం మరో మెట్టు కిందికి దిగుతుంది. కంటికి కనిపించేవాటి వెనుక కనిపించని రహస్యాలను ఛేదిస్తుంది. ఉదాహరణకు బల్బ్ వేయగానే ప్రసరించే వెలుగుకు కారణం, దాని నుంచి వెలువడే ఫోటాన్లే అని గమనిస్తుంది. విద్యుత్ ప్రవాహానికీ కీలకం, ఎలక్ట్రాన్లే అని ప్రతిపాదిస్తుంది. ఈ అణువులు, పరమాణువుల స్థాయిలో పరిశోధించే క్వాంటం శాస్ర్తానికి ఓ సవాలు ఉంది. దాన్ని ప్రతిపాదించిన ష్రోడింగర్ అనే శాస్త్రవేత్త పేరు మీదుగా ‘ష్రోడింగర్ క్యాట్’ అని దానికి పేరు. ఓ చిన్న గదిలో పిల్లి ఉంది అనుకుందాం. అదే గదిలో విషపు సీసా కూడా ఉంది. పిల్లి ఆ విషం తాగిందా, తాగి బతికే ఉందా, లేదా అసలు సీసా జోలికి పోకుండా ఉందా… ఇదంతా కూడా ఆ గది తలుపు తెరిచే వరకూ తెలియదు కదా! ఒకవేళ ఓ పిల్లి ఏ బాదరబందీ లేకుండా పడుకుని ఉన్నా, గది తలుపు తీయగానే ఉలిక్కిపడి లేవచ్చు కూడా. పరమాణువులు కూడా ఇంతే అంటారు ష్రోడింగర్. ఓ వ్యక్తి వాటి జోలికి వెళ్లే వరకూ అవి ఎలా ప్రవర్తిస్తాయో తెలియదు. అంతేకాదు! పరిశీలించే సమయంలో కూడా వాటి స్వభావం మారిపోవచ్చు. మన చుట్టూ ఉన్న ప్రపంచంలోనే ఇంత మార్మికత ఉంది కాబట్టి, క్వాంటం ఫిజిక్స్ మరణం తర్వాత కూడా ఏదో ఉండి ఉంటుందనే ప్రతిపాదనను సమర్థిస్తున్నది.
క్వాంటం ఫిజిక్స్‌లో ఉన్న అనిశ్చితి ఆధారంగా అమరత్వం గురించి చెప్పుకొనే సిద్ధాంతాలు సరే. నిజంగానే అది ప్రస్తుత వాస్తవ ప్రపంచంలో సాధ్యమేనా అంటే కొన్ని ఆసక్తికరమైన జవాబులు వినిపిస్తున్నాయి.
మతం ప్రకారం ఆత్మ ఉందా! క్వాంటం ఫిజిక్స్ ప్రకారం వేర్వేరు లోకాలు ఉన్నాయా అన్న విషయాన్ని పక్కన పెడితే… మృత్యువు ఉన్నా లేకపోయినా చేతిలో ప్రస్తుతం ఉన్న జీవితాన్ని మాత్రం పరిపూర్ణంగా ఆస్వాదించమని చెబుతున్నారు పెద్దలు. కాలం మనకు అందించే అవకాశాల్లో ఉత్తమమైనదాన్ని ఎంచుకోవడం, సానుకూలమైన భావనలు పెంపొందించుకోవడం, ఈ లోకం మన ఒక్కరిదే కాదు అన్న ఎరుకతో సామాజిక స్పృహతో మెలగడం, జీవితానికి ఓ మంచి లక్ష్యాన్ని ఏర్పర్చుకుని దాన్ని సాధించడం, కరుణతో ఉండటం, మార్పులను స్వాగతిస్తూ వాటికి అణుగుణంగా జీవితాన్ని మలుచుకోవడం… ఇలాంటి లక్షణాలు ఉంటే మనిషి జీవితం పరిపూర్ణంగాను, తను మరణించాక కూడా ప్రభావం శాశ్వతంగా ఉంటుందని వారి సూచన.
జిజాంగ్ షా అనే పరిశోధకుడు క్వాంటం థియరీ ఆఫ్ సౌల్ (Quantum Theory of Soul) అనే పత్రాన్ని వెలువరించాడు. ఇందులో క్వాంటం ఫిజిక్స్ ద్వారా ఆత్మను వివరించే ప్రయత్నం చేశాడు. అవి ధార్మిక భావనలకు దగ్గరగా ఉన్నాయి. ఆత్మ ఓ వ్యక్తి ఉనికికి మూలం; మనిషి చనిపోయినా ఆత్మ కొనసాగుతూనే ఉంటుంది; దేహంలో ఉన్నప్పటికీ ఆత్మకు భౌతికమైన పరిమితులు ఉండవు; దూరంగా ఉన్న ఇతర ఆత్మలతో అది సంభాషించగలదు; విశ్వంతోనూ అనుసంధానం ఏర్పర్చుకోగలదు; అణిమాది సిద్ధులను శాస్త్రీయంగా రుజువు చేయవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే జీవితానికి అర్థం, పరిపూర్ణత ఇచ్చేది ఆత్మే అంటాడు షా తన పత్రంలో!
– కె.సహస్ర