కాఫీ తాగడం.. ఆరోగ్యానికి మంచిదే! కానీ, ఎప్పుడు తాగుతున్నాం? ఎంత తాగుతున్నాం? అనేది కూడా ముఖ్యమని అంటున్నారు అమెరికా పరిశోధకులు. గుండె, శరీరం మీద కెఫీన్, కాఫీ తాగే సమయం చూపించే ప్రభావాలపై ఓ పరిశోధన జరిగింది. అమెరికా నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సంస్థ.. దాదాపు పదేండ్లపాటు ఈ అధ్యయనం నిర్వహించింది. ఇందులో పాల్గొన్నవారు రోజుకు కనీసం ఒక్కసారైనా తీసుకునే ఆహారం, పానీయాలను క్షుణ్నంగా పరిశీలించింది.
సర్వే సమయంలో సంభవించిన మరణాలను, వాటి కారణాలను నమోదు చేసింది. ఆయా డేటాలను విశ్లేషించి.. ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. వీరిలో 52 శాతం మందికి కాఫీ తాగే అలవాటు ఉంది. అందులోనూ 36 శాతం మంది ఉదయం మాత్రమే కాఫీ తాగుతుండగా.. మిగిలిన 16 శాతం మంది రోజులో అనేకసార్లు కాఫీ తాగుతారని చెప్పారు.
అయితే, కాఫీ తాగనివారితో పోలిస్తే.. ఉదయంపూట కాఫీ తాగేవారికి ఏ కారణంతోనైనా మరణం సంభవించే ముప్పు 16 శాతం, గుండెజబ్బుతో మరణించే ముప్పు 31 శాతం తక్కువగా ఉంటున్నట్టు తేలింది. అయితే, రోజంతా రెండుమూడు సార్లు కాఫీ తాగేవారిలో ఇలాంటి ప్రయోజనాలేవీ కనిపించలేదని పరిశోధకులు వెల్లడించారు. మధ్యాహ్నం, సాయంత్రం కాఫీ తాగేవారిలో జీవ గడియారం క్రమం తప్పుతుందనీ, మెలటోనిన్ వంటి హార్మోన్ల మోతాదులు అస్తవ్యస్తమయ్యే ప్రమాదం ఉందని చెప్పుకొచ్చారు. ఫలితంగా ఇన్ఫ్లమేషన్కు దారితీసి.. రక్తపోటు, గుండెజబ్బు ముప్పు పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.