పిల్లల పెంపకంలో పూర్వపు రోజులకీ ఇప్పటికీ విపరీతమైన మార్పు వచ్చింది. ర్యాంకులు, పెద్ద చదువులు, ఐదంకెల ఉద్యోగాలు… ఇలా బయటంతా విపరీతమైన పోటీ ప్రపంచమే కనిపిస్తున్నది. అందుకే ఈ కాలపు తల్లిదండ్రులను ఉద్దేశించి కొన్ని ప్రధానమైన సూచనలు చేశారు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, విద్యావేత్త సుధామూర్తి. ‘పిల్లల పెంపకం’ పరుగు పందెం కాదని అంటున్న ఆమె, వాళ్లపై లేనిపోని లక్ష్యాలను రుద్దడం, ఇతరులతో పోల్చడం ఏమాత్రం మంచి పద్ధతి కాదని చెబుతున్నారు.
అరువు తెచ్చుకున్న కలలను పిల్లలకు బహుమతిగా ఇవ్వకండి. భూమ్మీదికి వచ్చే ప్రతిబిడ్డా.. తనకే ప్రత్యేకమైన ఏదో ఒక సామర్థ్యంతోనే వస్తుంది. అందుకు తగ్గట్టుగానే తన జీవితాన్ని మలచుకుంటుంది. ఆ సామర్థ్యాన్ని కాదని.. వేరొకరి నెరవేరని ఆశయాలను వారిపై రుద్దకండి. ఎవరి కలలనో నిజం చేయడానికి మీ బిడ్డపై భారం మోపడం అన్యాయమే అవుతుంది. తమకు ఆసక్తిలేని కొత్త ఆశయాల కోసం అన్వేషించడం, అందులో విఫలమవడం, తిరిగి ఎదగడానికి ప్రయత్నించడం.. ఇవన్నీ పిల్లలపై ఒత్తిడిని పెంచుతాయి. అంతేకాదు.. ఇలా పెరిగిన పిల్లలు తోలుబొమ్మలే అవుతారు.
మీ బిడ్డలను ఇతర పిల్లలతో పోల్చడం.. వారి ఆత్మైస్థెర్యాన్ని బలహీనపరుస్తుంది. వారిలో అభద్రతను, అనవసరమైన పోటీని సృష్టిస్తుంది. పోలికలు లేకుండా.,నిశ్శబ్దంగా పిల్లల పురోగతికి మద్దతు ఇవ్వడమే మంచిది.
పుస్తకాలు పిల్లల్లో కొత్త ఆలోచనను, ప్రశ్నలనూ రేకెత్తిస్తాయి. అవే వారి మేధస్సును పెంచుతాయి. పిల్లల మనసును సజీవంగా ఉంచుతాయి. అదే గ్యాడ్జెట్లు సమయాన్ని వృథా చేస్తాయి. కాబట్టి, పిల్లల గదిలో పుస్తకాలే ఉండాలి. పాఠ్యపుస్తకాలతోపాటు చందమామ కథలు, జానపద కథల పుస్తకాలూ కొనివ్వండి.
పిల్లల ప్రతి డిమాండ్‌కు లొంగొద్దు. వారు కోరే ప్రతి వస్తువునూ కొనివ్వాల్సిన అససరం లేదు. అదే సమయంలో వారికి అవసరమైన వేరే వస్తువును బహుమతిగా ఇచ్చినా ఫర్వాలేదు. ఇలా చేస్తే పిల్లలు సంతోషపడరని భావించొద్దు. ఇది వారి ఆనందాన్ని దూరం చేయడం కాదు.. ఆనందం అనేది అంత సులువుగా అందదనే పాఠం నేర్పడం.
డబ్బే లక్ష్యం కాదన్న సంగతి.. పిల్లలకు బాల్యం నుంచే నేర్పించండి. అంతకుమించిన ఆలోచనలతో వారిని పెరగనివ్వండి. హోదా, గౌరవం అనేవి సంపదతో మాత్రమే రావనీ.. వ్యక్తిత్వం, ఇతరులకు చేసే సేవతోనే సంఘంలో గౌరవం వస్తుందని పిల్లలకు తెలిసేలా చెప్పండి. మీరిచ్చే పాకెట్ మనీతోనూ ఇతరులకు ఎలా సహాయం చేయొచ్చో నేర్పించండి.