ప్రస్తుతం చాలామంది ‘ఫైబర్ మాక్సింగ్’ వెంట పడుతున్నారు. పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆహారానికి పెద్దపీట వేస్తున్నారు. గట్ ఆరోగ్యం కోసం, చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టేందుకు.. ఈ తరహా డైట్‌ను ఫాలో అవుతున్నారు. అయితే, ఫైబర్ మాక్సింగ్తో ఆరోగ్య ప్రయోజనాలతోపాటు కొన్ని సమస్యలు కూడా ఉంటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పీచు పదార్థాలను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. రోజువారీ ఆహారంలో ఫైబర్‌ను చేర్చుకుంటే.. పెద్దపేగు ఆరోగ్యం మెరుగుపడుతుందని అనేక అధ్యయనాలు తేల్చాయి కూడా. అయితే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రకారం.. పెద్దవాళ్లు రోజులో తీసుకునే ఆహారంలో 30 గ్రా. ఫైబర్ ఉండాలి. అదే మూడేళ్లల్లోపు చిన్నారులకు 15 గ్రా., 15 ఏళ్లలోపు వారికి 20 గ్రాముల ఫైబర్ ప్రతిరోజూ అందించాలి. అంతకుమించితే ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
ఈ క్రమంలో ‘ఫైబర్ మాక్సింగ్’ డైట్‌ను పాటించేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫైబర్ అధికంగా తీసుకుంటే.. జీర్ణక్రియపై ఒత్తిడి పడుతుంది. దీనిని నివారించడానికి తగినంత నీరు, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. లేకుంటే, పొత్తికడుపులో తిమ్మిర్లు, పేగుల్లో చికాకు లాంటి సమస్యలు ఎదురవుతాయి. కడుపు ఉబ్బరం, గట్ ఇరిటేషన్ వంటివీ ఇబ్బంది పెడతాయి. ఫైబర్ ఎక్కువైతే ఆహారంలోని క్యాల్షియం, ఐరన్, జింక్ లాంటి పోషకాలను గ్రహించడంలోనూ ఆటంకం కలుగుతుంది. గ్యాస్, మలబద్ధకం, విరేచనాలు కూడా కనిపిస్తాయి.
ఆకలి తగ్గుతుంది. దాంతో విపరీతంగా బరువు తగ్గుతారు. కొన్ని సందర్భాల్లో పేగులో అడ్డంకులు కూడా ఏర్పడే ప్రమాదం ఉంటుంది. దీనిని నివారించడానికి కొన్ని సూచనలు పాటిస్తే సరిపోతుంది. ఒకేసారిగా కాకుండా.. ఆహారంలో ఫైబర్ పదార్థాన్ని నిదానంగా పెంచుకుంటూ వెళ్లాలి. ఒకపూట నుంచి మొదలు పెట్టి.. క్రమేణా మూడుపూటలా తీసుకోవచ్చు. ఫైబర్ కంటెంట్‌ను చిన్నచిన్నగా పెంచుకుంటూ పోతే.. జీర్ణాశయం కూడా అలవాటు పడుతుంది. ఫైబర్ పౌడర్లకు బదులుగా.. పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు, తృణధాన్యాలు, విత్తనాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. స్మూతీలు, పెరుగులో విత్తనాలు వేసుకోవడం, సలాడ్స్ లాంటివీ ప్రయత్నించొచ్చు. మొక్కల ఆధారిత ఆహారాలు తీసుకుంటే..శరీరానికి విభిన్న ఫైబర్లు అందుతాయి.