శీతాకాలం మొదలైంది. చల్లని వాతావరణంలో చర్మం కళావిహీనమవుతుంది. చలి గాలులతో చర్మం నిర్జీవంగా మారి.. ముఖం పాలిపోయినట్లు కనిపిస్తుంది. దీని నుంచి తప్పించుకోవడానికి రకరకాల క్రీములు, లోషన్లు వాడాల్సిన అవసరం లేదు. కేవలం వంటింట్లో దొరికే ఆలుగడ్డలతో.. చలిబారి నుంచి అందాన్ని కాపాడుకోవచ్చు.
చర్మాన్ని కాంతివంతం చేసే గుణాలు ఆలుగడ్డలో పుష్కలం. ముఖంపై మొటిమలు, మచ్చలను తొలగించడంలో ఇది సమర్థంగా పనిచేస్తుంది. బంగాళాదుంప నుండి రసాన్ని తీసి.. ముఖానికి బాగా పట్టించాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా రోజూ రెగ్యులర్గా చేస్తుంటే.. ముఖంపై మొటిమలు, మచ్చలు పోతాయి.
ఆలుగడ్డల్లో ఉండే ఎంజైమ్లు, విటమిన్లు సూర్యరశ్మి వల్ల దెబ్బతిన్న చర్మాన్ని బాగుచేయడంలో ముందుంటాయి. ఇవి చర్మం లోపలి నుండి పోషణను అందిస్తాయి. వాపు, నొప్పి వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఆలుగడ్డను సన్నగా, గుండ్రంగా కట్చేసి.. సమస్య ఉన్న ప్రాంతంలో అప్లయి చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే సరి.
ఆలుగడ్డలను మిక్సీలో వేసి మెత్తని పేస్టుగా చేసుకోవాలి. ఆ పేస్టుని ముఖానికి రాసుకుని అరగంట తర్వాత కడిగేస్తే.. చర్మం మృదువుగా మారుతుంది. చర్మంపై జిడ్డును తొలగిస్తుంది. ఆలుగడ్డల రసానికి నిమ్మరసం, తేనె కలిపినా మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, పావుగంట తర్వాత కడిగేస్తే.. ముఖ ఛాయ మెరుగుపడుతుంది.
నిద్రలేమి, ఇతర సమస్యలతో కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడతాయి. ఆలుగడ్డ రసంలో మెత్తని దూదిని ముంచి.. దానిని కళ్లపైన పెట్టి, పావుగంట అలాగే ఉంచాలి. లేకుంటే, ఆలుగడ్డను సన్నని ముక్కలు (చిప్స్ మాదిరి)గా కోసి.. వాటిని కళ్లపైన ఉంచాలి. ఈ చిట్కాను రెగ్యులర్గా ఫాలో అయితే, మంచి ఫలితం కనిపిస్తుంది.
ఆలుగడ్డ నీటితో ముఖాన్ని కడుక్కుంటే.. ముడతలు తగ్గుముఖం పడతాయి. ముఖంపై తెల్లటి మచ్చలు తొలగించడంతోపాటు ఎండకు కమిలిపోయిన చర్మాన్ని మళ్లీ మామూలు స్థితికి తీసుకొస్తుంది.