ఒక సాధువు కాశీ యాత్ర ముగించుకుని నడిచి వెళ్తూ ఉన్నాడు. బాగా ఎండగా ఉండటంతో అలసిపోయాడు. ఊడలున్న పెద్ద మర్రిచెట్టు కింద ఆగాడు. అదే చెట్టు కింద కుండలు అమ్మే వ్యక్తి వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. ఆ వ్యాపారికి ఎన్నాళ్లుగానో జీవిత సత్యం తెలుసుకోవాలని ఉండేది. సాధువును చూసేసరికి తన ప్రశ్నకు సమాధానం దొరికే అవకాశం వచ్చిందని సంతోషపడ్డాడు. వ్యాపారం చూసుకోమని గుమస్తాకి చెప్పి సాధువు దగ్గరికి వెళ్లి నమస్కరించాడు.
‘వ్యాపారం బాగా జరుగుతున్నా, ఎంత సంపాదిస్తున్నా ఏదో తెలియని అశాంతి నన్ను వెంటాడుతున్నద’ని సాధువుతో చెప్పాడు. తాగడానికి చల్లటి మంచి నీళ్లు ఇచ్చి ‘జీవిత సత్యం ఏదైనా చెప్పమ’ని కోరాడు. పక్కనే మంచి కుండలతోపాటు, పగిలిన కుండలు కూడా అక్కడ ఉండటం గమనించాడు సాధువు. ‘చిల్లు పడిన మట్టికుండ లాంటిది జీవితం’ అన్నాడు సాధువు. వ్యాపారి ఆశ్చర్యంగా ‘అదెలా?’ అని ప్రశ్నించాడు. ‘చిల్లు పడిన కుండలో నీళ్లు పోస్తే ఏమవుతుంది?’ అని అడిగాడు సాధువు.
‘కుండలోంచి నీళ్లన్నీ కారిపోతాయ’ని బదులిచ్చాడు వ్యాపారి. చిన్న నవ్వుతో సాధువు ‘చిల్లు పడిన మట్టికుండలోని నీళ్లు కారిపోయే విధంగా క్షణక్షణానికీ మన ఆయుష్షు తరిగిపోతుంది. మన శరీరం మృత్యువుకు దగ్గరవుతుంది. మనం ఆ సత్యం తెలుసుకుంటే చాలు. మనకు ప్రతి క్షణమూ దైవప్రసాదమని అర్థమవుతుంది’ అని చెప్పి, సాధువు కళ్లు మూసుకుని ధ్యానం చేయడం ప్రారంభించాడు.
అంతా ఆసక్తిగా విన్న వ్యాపారి ‘నిజమే… మన శ్వాసే ఒక అద్భుతం. ఎందుకంటే ప్రపంచంలోని సంపదనంతా ఖర్చు చేసినా ఒక్క శ్వాసను కూడా మనం కొనలేం. అలాంటి అమూల్యమైన శ్వాస తాలూకు గొప్పదనాన్ని గుర్తించి ఎరుకతో జీవనం సాగించాలి. శరీరం పట్ల అభిమానం వదిలిపెట్టాలి. ఈ శరీరం అశాశ్వతమని తెలుసుకుని స్వార్థం, అహం, ‘నాది అనే భావం’ వీడాలి’ అని అవగాహన చేసుకున్నాడు వ్యాపారి.
-ఆర్సీ కృష్ణస్వామి రాజు, 93936 62821