e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 19, 2021
Home జిందగీ అమ్మ.. నా గైడ్‌, మెంటర్‌!

అమ్మ.. నా గైడ్‌, మెంటర్‌!

తొలి లక్ష్యం మెడిసిన్‌. ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో సీటు తెచ్చుకుంది. మలి లక్ష్యం ఐఏఎస్‌. ఇష్టపడి చదివి కష్టసాధ్యమైన సివిల్‌ సర్వీసు పరీక్షల్లో జాతీయ స్థాయిలో 20వ ర్యాంకు సాధించింది. జీవిత లక్ష్యం.. మహిళా సాధికారత. ముస్సోరిలో శిక్షణ తర్వాత ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ అధికారి హోదాలో ఆ దిశగా దృష్టిసారిస్తానని అంటున్నది తెలుగు రాష్ర్టాలలో సివిల్స్‌ టాపర్‌ శ్రీజ.

మా స్వస్థలం వరంగల్‌. నేను పుట్టింది అక్కడే. రెండో తరగతి చదువుతున్నప్పుడే మా కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. నాన్న పి.శ్రీనివాస్‌ హోండా కంపెనీలో సీనియర్‌ సేల్స్‌ మేనేజర్‌. అమ్మ లత జనగామలో నర్సుగా పని చేస్తున్నారు. తమ్ముడు సాయిరాజ్‌ బీబీఏ చేశాడు. మొదటి నుంచీ చదువుల్లో చురుగ్గా ఉండేదాన్ని. డాక్టర్‌ కావాలన్నది చిన్నప్పటి ఆశయం. పట్టు
దలతో ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో సీటు సంపాదించాను. ఇంటర్న్‌షిప్‌ సమయంలో నాన్న నాకు సివిల్‌ సర్వీసు పరీక్షల గురించి చెప్పారు. మెడికల్‌ సైన్స్‌ ఆప్షనల్‌గా ప్రిపేర్‌ కమ్మని ప్రోత్సహించారు. ఐఏఎస్‌ అధికారి అయితే హెల్త్‌ సెక్టార్‌లో, అడ్మినిస్ట్రేషన్‌లో చాలా సాధించవచ్చని వివరించారు. అప్పటి నుంచీ సివిల్స్‌పై దృష్టిపెట్టాను. పైగా నాకు చదవడం అంటే మొదటి నుంచీ ఇష్టం. సివిల్స్‌ సిలబస్‌ను కూడా మొక్కుబడిగా కాకుండా, ఇష్టంగా చదివాను. ఐఏఎస్‌ అధికారిగా తెలంగాణలో పనిచేయాలని నా కోరిక. అది జరగాలంటే వందలోపు ర్యాంకు రావాలి. అందుకే, మరింత గట్టిగా ప్రిపేరయ్యాను. కానీ, 20వ ర్యాంకు వస్తుందని మాత్రం ఊహించలేదు.

- Advertisement -

సరైన శిక్షణ అవసరం..
నేను మొదటి ప్రయత్నంలోనే మంచి ర్యాంకు తెచ్చుకున్నానంటే, దానికి నా కుటుంబంతో పాటు కోచింగ్‌ ఇచ్చిన గురువులూ కారణమే. మెయిన్స్‌ కోసం ఆరు నెలలు కోచింగ్‌ తీసుకున్నాను. అక్టోబర్‌ 2020లో ప్రిలిమ్స్‌ రాశాను. బాలలత మేడమ్‌, మహేశ్‌ భగవత్‌ సర్‌, గోపాలకృష్ణ సర్‌.. ఇలా నాకు మంచి గురువులు లభించారు. గురువును బట్టే విద్య అంటారు కదా! సివిల్స్‌ కోచింగ్‌లో చేరేటప్పుడు, అమ్మానాన్న నాతో ఒకే మాట చెప్పారు. ‘ఎన్నేండ్లు చదువుకుంటావో చదువుకో. కానీ ఆర్థిక స్వాతంత్య్రం వచ్చేదాకా కష్టపడు. ఆ తర్వాతే ఏదైనా’ అన్నారు. ఇంతటి ప్రోత్సాహం లభిస్తే ఏ అమ్మాయి అయినా అద్భుతాలు సాధిస్తుంది.

వివక్షకు తావులేదు..
మా ఇంట్లో అమ్మాయి, అబ్బాయి అనే తేడా లేదు. తమ్ముడితో సమానంగా నన్ను పెంచడం కాదు, నాతో సమానంగా తమ్ముడిని పెంచారని చెప్పగలను. ఈ విషయంలో నాన్నను అభినందించాల్సిందే. కానీ సమాజంలో ఇప్పటికీ అమ్మాయిలు ఎన్నో రకాలుగా వివక్షకు గురవుతున్నారు. చదువుల విషయంలోనూ ఆ తేడా కనిపిస్తున్నది. పెండ్లి చేసుకుని వెళ్లిపోయే అమ్మాయికి పెద్ద చదువులు ఎందుకని అనుకునేవారూ ఉన్నారు. పెండ్లయ్యాక చదవాలనుకున్నా, పిల్లలను చూసుకోవడం కష్టమై జీవితంతో రాజీపడుతున్నవారూ ఉన్నారు.

అమ్మ ఆలోచనే స్ఫూర్తి..
మా అమ్మానాన్నకు నేను, తమ్ముడే ప్రపంచం. అనుక్షణం మా కోసమే తపిస్తుంటారు. నేను సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతానని చెప్పినప్పుడు అమ్మానాన్న చాలా సంతోషించారు. మంచి ర్యాంకు తెచ్చుకోవడానికి ఎన్నేండ్లు పడుతుందో కచ్చితంగా చెప్పలేం. ఇదంతా తెలిసి కూడా నాకు మద్దతు ఇచ్చారు. ఇక, మా అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను ఐదో తరగతిలో ఉన్నప్పుడు, నాన్న ప్రోత్సాహంతో నర్సింగ్‌ పూర్తి చేసింది. భర్త, తండ్రి.. ఇంటిపెద్ద స్థానంలో ఉన్న ఎవరైనా సరే, ప్రతి మహిళకూ చదువుకునే అవకాశం కల్పించాలని అంటుంది అమ్మ. ప్రతి విషయంలో నాకు గైడ్‌గా, మెంటర్‌గా ఉంటుంది. మమ్మల్ని చూసుకుంటూనే, తన ఉద్యోగ బాధ్యతల్ని చక్కగా నిర్వర్తిస్తుంది. మహిళకు చదువు ఎంత ముఖ్యమో, ఆర్థిక స్వాతంత్య్రం కూడా అంతే అవసరం. ఈ రెండూ ఉంటే చాలు, ప్రతి మహిళా తన జీవితంలో అనుకున్నది సాధించగలదని అమ్మ ప్రగాఢ విశ్వాసం.

మహిళా సాధికారత ముఖ్యం..
మహిళా సాధికారత కోసం ప్రభుత్వాలు చేయాల్సినంత కృషి చేస్తున్నాయి. ఇక్కడ మార్పు రావాల్సిందల్లా తల్లిదండ్రుల ఆలోచనల్లోనే. ఆడబిడ్డ అయినా, మగ బిడ్డ అయినా సమానంగా పెంచాలి. ఒకేతీరుగా విద్యను అందించాలి. నచ్చిన రంగంలో రాణించేందుకు ప్రోత్సహించాలి. అప్పుడు, ఆ ఆడపిల్లలే వాళ్లకు పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారు. మహిళలు కూడా ‘నాకు పెండ్లయిపోయింది, పిల్లలు పుట్టేశారు. నా జీవితం అయిపోయింది’ అని అనుకోవద్దు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదిరించి, లక్ష్యం కోసం ముందడుగు వేయాలి. మహిళా ఉద్యోగుల భద్రత కోసం తెలంగాణ షీ టీమ్స్‌ బాగా పని చేస్తున్నది. అలాగే, సైబర్‌ సెక్యూరిటీ పరంగానూ మహిళలకు షీ టీమ్స్‌ అండగా నిలుస్తున్నది. కాబట్టి, అమ్మాయిలు ఏ విషయంలోనూ రాజీ
పడొద్దన్నది నా సూచన.

… నిఖిత నెల్లుట్ల

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement