Crisil Report | ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ కీలక డేటాను విడుదల చేసింది. ఇటీవల దేశవ్యాప్తంగా నిత్యావసరాల సరుకుల ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ద్రవ్యోల్బణం నేపథ్యంలో వంటిల్లుపై భారం పడుతున్నది. గతేడాదితో పోలిస్తే వ్యయం పెరిగినట్లు క్రిసిల్ డేటా వెల్లడించింది. ఇంటి శాఖాహార భోజనం ఖరీదవుతుండగా.. మాంసం భోజనం రేటు తగ్గడం విశేషం. ఏప్రిల్ మాసానికి వంటింటికి సంబంధించిన ఖర్చుల నివేదికను విడుదల చేసింది. గతేడాది ఏప్రిల్ నాటితో పోలిస్తే.. ఈ ఏడాది ఇదే నెలతో పోల్చి చూసింది.
ఈ రెండు సమయాల్లో శాఖాహార, మాంసాహార భోజన ఖర్చులను సరిచూసింది. ఈ ఏడాది కాలంలో వెజ్ ఖర్చు 8శాతం మేర పెరిగింది. అదే సమయంలో నాన్వెజ్ ఖర్చు 4శాతం మేర తగ్గుముఖం పట్టింది. అయితే, ఉల్లిపాయలు, టమాటా, బంగాళదుంపలతో పాటు కూరగాయలు, పప్పుల ధరలు ఆకాశాన్నంటుతుండడంతో వెజ్ మీల్స్ ఖర్చు పెరిగిందని పేర్కొంది. చికెన్ ధరలు తగ్గడంతో నాన్వెజ్ భోజనం ఖర్చు తగ్గిందని పేర్కొంది. వెజ్ భోజనంలో రోటీ, ఉల్లిపాయ, టొమాటో, బంగాళదుంప, అన్నం, పప్పు, పెరుగు, సలాడ్ ఉండగా.. మంసాహారం భోజనంలో ఇవే పదార్థాలుంటాయి. కేవలం పప్పు స్థానంలో మాంసం, గుడ్లు ఉంటాయి. ఇందులో నూనెలు, వంటగ్యాస్, ఇతర మసాలాల ఖర్చును సైతం లెక్కగడుతుంటారు.